close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
పటాస్‌తో జబర్దస్త్‌గా!

చిన్నప్పటి నుంచీ ఎదుటివారిని పరిశీలించడం, వారిని అనుకరించడం అలవాటైన ఆ అమ్మాయికి అదే కెరీర్‌ అయ్యింది. ప్రముఖుల ప్రశంసలూ తెచ్చిపెట్టింది. నటీనటులు, రాజకీయ ప్రముఖులు... ఇలా ఎవరి గొంతునైనా ఇట్టే అనుకరించడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. ఓ వైపు టీవీ షోలల్లో గలగలా మాట్లాడేస్తూ, మరోవైపు మిమిక్రీ చేస్తూ బిజీబిజీగా ఉండే ఆమే ఉదయశ్రీ బైరోజు. ఇటీవల   జబర్ద]స్త్‌లో కనిపించి మరింత మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న ఆమె తన గురించి చెప్పుకొచ్చిందిలా.

మాది మధ్యతరగతి కుటుంబం. అమ్మ జయప్రద గృహిణి. నాన్న రమేష్‌బాబు చారి మెకానిక్‌ షెడ్‌ నడుపుతారు. తమ్ముడు సాయికిరణ్‌. నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. ఇంటరు, డిగ్రీ ఇక్కడే పూర్తిచేసి, ఎంబీఏ ఎదులాబాద్‌ ఒమేగాలో చదివా. చిన్నప్పటి నుంచి అందరినీ ఏకాగ్రతగా పరిశీలించడం, తరువాత వారిని అనుకరించడం నాకు ఇష్టం. అది నా అభిరుచిగా మార్చుకున్నా. అవకాశం వచ్చినప్పుడల్లా ఇంట్లో, స్కూల్లో స్నేహితుల ముందు అనుకరణ చేసేదాన్ని. స్కూల్‌లోనూ పలు కార్యక్రమాల్లో పాల్గొనేదాన్ని. ఎలాంటి శిక్షణా లేకుండా నాకు నేనే నేర్చుకున్న కళ ఇది. ఎప్పటికప్పుడు సినీ, రాజకీయ ప్రముఖులను పరిశీలిస్తూ... ఇంట్లో అద్దంలో నన్ను నేను చూసుకుంటూ సాధన చేస్తా.

యాంకరింగ్‌తో మొదలు...
అప్పుడు నేను ఇంటరు చదువుతున్నా. ఓ రోజు కాలేజీ నుంచి వచ్చి ఇంట్లో టీవీ చూస్తున్నా. ఈ-టీవీలో ‘స్టార్‌ మహిళ’కు ఆడిషన్‌ జరుగుతోందని, ఆసక్తి ఉన్నవాళ్లు సంప్రదించమంటూ ఫోన్‌ నంబరు కనిపించింది. చిన్నప్పటి నుంచి బుల్లితెరపై కనిపించాలనే నా ఆసక్తికి అదే సరైన సమయం అనిపించింది. ఏ మాత్రం ఆలోచించకుండా ఆడిషన్‌కు వెళితే, వెంటనే ఎంపికయ్యా. అలా ఇంటరులోనే నా కెరీర్‌ ప్రారంభమైంది. టీ న్యూస్‌లో ‘ధూం-ధాం ముచ్చట్లు’లో మల్లీశ్వరిగా పక్కా తెలంగాణ యాసలో నేను చదివే వార్తలు’, ఈటీవీ ప్లస్‌లో ‘పటాస్‌’ కార్యక్రమానికి ఎప్పటికప్పుడు ప్రశంసలు వస్తూనే ఉన్నాయి. డబ్‌స్మాష్‌లు, టిక్‌టాక్‌లు, మిమిక్రీ... అన్నీ నాకు గుర్తింపు తెచ్చినవే.

సాధనతోనే సాధ్యం...
నేను చేసిన డబ్‌స్మాష్‌ వీడియో ఒకటి ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ చూసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. అది చూసి ‘నా నువ్వే’ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చారు. ఇప్పడు ‘సంత-మట్టి మనుషుల ప్రేమకథ’ చిత్రంలో నటించా. నేను నటీనటులను అనుకరిస్తూ చేసిన షోలను చూసిన హైపర్‌ ఆది ఓసారి నాకు ఫోను చేసి తనతో కలిసి జబర్ద]స్త్‌ కార్యక్రమం చేయమన్నారు. ఈ మధ్య జబర్ద]స్త్‌లోని ఓ స్కిట్‌లో పాల్గొన్నా. కథానాయికలను అనుకరించిన విధానానికి నాగబాబు, రోజా ఇచ్చిన అభినందనలు మరవలేను. ఆ కార్యక్రమం చూసిన కొందరు తెలుగు దర్శకులు ‘చాలా బాగా చేశావు’ అంటూ అభినందించారు. ఎవరినైనా అయిదు నిమిషాలు చూస్తే  వారిలా మాట్లాడగలను. ఇదెలా సాధ్యమని చాలామంది అడుగుతుంటారు. వాళ్లను గమనించాక కొంత సాధన చేస్తా అంతే. తమన్నా, సమంత, కాజల్‌లా మాట్లాడగలను. వాళ్లే కాదు, మరికొందరు నటలు, రాజకీయ నాయకుల్లా మాట్లాడగలను. సమయం ఉంటే జర్నలిజం చదవాలని ఉంది. నాకు ఇంత గుర్తింపు రావడం వెనుక అమ్మ, నాన్న అందిస్తున్న సహకారం ఎంతో ఉంది.


మరిన్ని