close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అతడు హింసిస్తున్నాడు!

ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు నేను, ఒకబ్బాయి ప్రేమించుకున్నాం. అతడి వల్ల నేను చాలాసార్లు బాధపడ్డా. చివరకు అతడితో విడిపోయా. కొన్ని రోజులకు మా నాన్న, తమ్ముడు చనిపోయారు.  వీటన్నింటితో బాగా కుంగిపోయా. నన్ను ఆనందంగా ఉంచే వ్యక్తి దొరకాలనుకునేదాన్ని. కొన్నాళ్లకు ఫేస్‌బుక్‌లో ఒక వ్యక్తి పరిచయమై, ప్రేమిస్తున్నానని చెప్పాడు.  మొదట అంగీకరించినా రెండురోజులకే వద్దనేశా. అతడిని ప్రేమించడం నా వల్ల కాలేదు. నేను కాదనేసరికి ఇప్పుడా  వ్యక్తి తరచూ ఫోన్‌ చేసి హింసిస్తున్నాడు.  ప్రస్తుతం నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ విషయాలన్నీ కాబోయే భర్తకి చెప్పాలా? ఈ ఆలోచనలన్నింటి నుంచీ బయటపడాలంటే నేనేం చేయాలి?                               

  - ఓ సోదరి
ఎనిమిదో తరగతి అంటే చాలా చిన్నవయసు. అప్పుడు మీకంతగా లోకానుభవం ఉండదు. ప్రేమ అంటే ఏంటో తెలియదు. కంటికి ఎవరైనా బాగా కనిపించినా, ప్రత్యేకంగా అనిపించినా ప్రేమనే అనుకుంటారు. మీ విషయంలోనూ అదే జరిగింది. కొన్నాళ్లకు అతడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడంతో విడిపోయారు. కొంత కాలానికి తండ్రి, తమ్ముడు చనిపోవడంతో మీరు మానసికంగా కుంగిపోయి ఉంటారు. ఆ సమయంలో ఇతరుల అండ, ఓదార్పు ఉంటే ఆ బాధ నుంచి బయటపడొచ్చని అనుకున్నారు. అదే ప్రేమ అని మీ భావన. తెలిసో, తెలియకో ఫేస్‌బుక్‌లో ఒకరితో పరిచయం ఏర్పరుచుకుని, అతడి మనస్తత్వం అంచనా వేయకుండానే మాట్లాడటం మొదలుపెట్టారు. కొన్నిరోజుల్లోనే ఆ అబ్బాయి మిమ్మల్ని ప్రేమిస్తున్నాననడం, మీరు అంగీకరించడం జరిగిపోయాయి. రెండు రోజులకే ఆ ప్రేమను తిరస్కరించారు. ప్రత్యేక శ్రద్ధ చూపించి, అభిమానించినంత మాత్రాన జీవితాంతం అతడితో కలిసి నడవలేననే సందేహం మీకు కలిగి ఉండొచ్చు. జీవితంపై మీకంటూ ఓ స్పష్టత లేకపోవడమే ఈ సమస్యలన్నింటికీ కారణం. ఎటువంటి వ్యక్తిని జీవిత భాగస్వామిగా ఎంచుకోవాలనుకుంటున్నారో ఇప్పటివరకూ మీకు ఎదురైన సంఘటనల ద్వారా తెలుసుకోవచ్చు. కుటుంబసభ్యులు, సన్నిహితులతో మీ మనసులోని అలజడిని చర్చించండి. ఇంతటి అనిశ్చితి ఎందుకొచ్చిందనేది మీకు మీరుగానే విశ్లేషించుకోండి. జీవితంలో ఎదురైన చేదు అనుభవాలే దీనికి కారణమా... లేక మీకు ఏది కావాలో నిర్ణయించుకోలేకపోవడమా? అనేది అంచనా వేసుకోండి. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని చెప్పారు. పెళ్లికి మీరు మానసికంగా సిద్ధంగా ఉన్నారో లేరో ఆలోచించండి. ముందు ఉద్యోగం సాధించి మీ కాళ్ల మీద మీరు నిలబడటానికి ప్రయత్నించండి. ఆపై జీవితాంతం తోడుగా ఉండే వ్యక్తిని ఎంచుకొని పెళ్లి చేసుకోండి. ఆలోచనల్లో స్థిరత్వం వస్తే క్రమంగా అన్నీ సర్దుకుంటాయి. సామాజిక మాధ్యమాలు ఉపయోగించేముందు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మీకు మీరుగా హద్దులు గీసుకుని వినియోగించండి. అతడు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడని రాశారు. అదే విషయాన్ని మీ పెద్దవాళ్లతో చెబితే పరిష్కారం వెతుకుతారు.
మీ ప్రశ్నలు ఇకపై
vasupsych@eenadu.net కు పంపించగలరు.


జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు