close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఇప్పుడు ఆమే గ్యాంగ్‌లీడర్‌

తెల్లవారకుండానే... చిమ్మ చీకట్లో... చేతిలో టార్చితో భుజంపై 15 కేజీల బరువుతో సైనికుడిలా అడుగులేస్తుందీమె. ఖరగ్‌పూర్‌ పరిధిలోని రైల్వేజోన్‌కి వెళ్తుంది. పది కిలోమీటర్ల దూరం పొడవునా... రోజుకి 150కి పైగా రైళ్లు ప్రయాణించే పట్టాలను అణువణువూ పరీక్షించి... ఏ  ప్రమాదం జరగకుండా చూడటం ఆమె కర్తవ్యం.  మగవారికి దీటుగా ‘కీ మ్యాన్‌’గా రైళ్ల పట్టాలకు మరమ్మతులు చేస్తున్న ఆమే... 40 ఏళ్ల పుష్పాసింగ్‌. తన వృత్తిలో ఎదురైన ఎన్నో అనుభవాలను వసుంధరతో పంచుకుందిలా...
ఖరగ్‌పూర్‌లో ఓ మధ్యతరగతి కుటుంబం పుష్పాసింగ్‌ది. తండ్రి రైల్వే కూలీగా చేసేవారు. తల్లి గృహిణి. ఇంటర్‌ పూర్తికావడం ఆలస్యం; టీచర్‌గా చేస్తోన్న లక్ష్మణ్‌సింగ్‌కి ఇచ్చి పెళ్లి చేశారు. ఆ తరువాత రెండేళ్లకు రైల్వేశాఖలో గ్యాంగ్‌మెన్‌ ఉద్యోగానికి పరీక్ష రాసి అర్హత సాధించింది. ‘ఆ తరువాత  కొంత శిక్షణ ఇచ్చారు. ఆ వెంటనే ఉద్యోగంలో చేరా. సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వే ఖరగ్‌పూర్‌ డివిజన్‌లో శ్యామ్‌ఛక్‌ స్టేషన్‌ పరిధిలో విధులు అప్పగించారు. మొదటి రోజు అక్కడకు వెళ్లేసరికి ఆరుగురి సిబ్బందిలో నేనొక్కదాన్నే మహిళను. భయపడి ఇంటికి తిరిగి వెళ్లిపోయా. ఇంట్లో నానమ్మ కోప్పడింది. ఇది కాకుండా వేరే ఉద్యోగం వస్తుందో లేదో చెప్పలేం. కుటుంబ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకో అంటూ ఆమె చెప్పడంతో తిరిగి వెళ్లడానికి నిశ్చయించుకున్నా. మావారు మాత్రం నీ ఇష్టమని చెప్పారు. అలా మరుసటి రోజు విధుల్లోకి వెళ్లా. అయిదు రైలు పట్టాలను పరిశీలించే బాధ్యత నాకు అప్పగించారు. రోజుకి దాదాపు 10 గంటలపాటు, 10 కిలోమీటర్ల పొడవుండే అయిదు పట్టాల లైన్లను పరీక్షించాలి. విధుల్లో భాగంగా 15 కేజీల బరువున్న సామాన్ల బ్యాగును మోయాలి. స్పేర్‌ నట్లు, డిటోనేటర్స్‌, రించెస్‌, సుత్తి వంటి వస్తువులు నిత్యం మా వద్ద సిద్ధంగా ఉండాలి. ఎక్కడైనా పట్టాల్లో పగుళ్లు ఏర్పడినా, విరిగిపోయినా, మధ్య ఉండే బోల్టులు  ఊడినా తక్షణం మరమ్మతు చేయగలగాలి. ప్రతి చోట పట్టాల నట్లు బిగిస్తూ ఉండాలి. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో రైళ్లు దూసుకుపోవడం వల్ల ఆ ఒత్తిడికి ఎప్పటికప్పుడు బోల్టులు వదులవుతూ ఉంటాయి. అటువంటివాటిని గుర్తించాలి. ఈ విధులు నాకు ఛాలెంజ్‌గా అనిపించాయి. ‘అమ్మాయివి నువ్వేం చేయగలవు’ అన్న సిబ్బందికి నేనేంటో తెలియజేయాలనుకున్నా. క్రమంగా ఎంత కష్టమైనా వారితో సమానంగా పని చేసే స్థాయికి చేరుకున్నా...’ అంటుంది పుష్ప.
రైలు వచ్చేసింది...
పుష్ప విధులు ఉదయం అయిదు గంటలకు మొదలవుతాయి. విడతలవారీగా పని చేయాల్సి ఉంటుంది. ఓ రోజు ఆమె రైలు పట్టాలు రిపేరు చేస్తోంటే వెనుక ఏదో ఎక్స్‌ప్రెస్‌ వేగంగా దూసుకొచ్చింది. వెంటనే అప్రమత్తమైంది. ఇలాంటివి మామూలే అంటుందామె. చీకటి, ఎండ, వాన అని చూసుకోకుండా విధులు నిర్వహించాల్సిందే అంటుంది పుష్ప. మూడేళ్ల క్రితం ఆమె భర్త హృద్రోగంతో చనిపోయాడు. అప్పటికి పిల్లలిద్దరూ చిన్నవాళ్లు. వాళ్లని పెద్ద చదువులు చదివించాలనే ఆయన ఆశయాన్ని ఆమె  తీర్చాలనుకుంది. దాంతో మరింత కష్టపడటం మొదలుపెట్టింది. ఇప్పటికీ ఉదయం మూడు గంటలకు నిద్రలేచి, ఇంటిపనులన్నీ చేసుకుని పనికి బయలు దేరుతుంది.
రైలు ప్రమాదం తప్పించింది
శ్యామ్‌ఛక్‌ స్టేషన్‌కు అతి సమీపంలో పెను ప్రమాదాన్ని తప్పించింది పుష్ప. అసలేం జరిగిందంటే... ‘అది 2016. ఉదయం 5.45 గంటలకు పట్టాలను పర్యవేక్షిస్తున్న సమయంలో ఒకచోట ఏడు అంగుళాల పొడవున పగుళ్లు గుర్తించా. మరికొన్ని క్షణాల్లో అటువైపు ఓ ఎక్స్‌ప్రెస్‌ రానుంది. మరమ్మతు చేసే సమయం లేదు. వెంటనే స్టేషన్‌ మాస్టారుకి సమాచారం అందించా. ఆయన అక్కడకు రాబోతున్న రైలును ఆపేయాలంటూ సిగ్నల్‌ ఇచ్చారు. సకాలంలో గుర్తించి సమాచారం ఇచ్చినందుకు అధికారులు నన్ను ప్రశంసించారు. 2018లో రైల్వే విమెన్స్‌ వెల్ఫేర్‌ సెంట్రల్‌ ఆర్గనైజేషన్‌ తరఫున ‘రైల్వే విమెన్‌ అవార్డు’ను అందించారు. అప్పటివరకు గ్యాంగ్‌మెన్‌గా పనిచేస్తున్న నాకు ‘కీ మెన్‌’గా పదోన్నతి ఇచ్చారు. అవార్డు కన్నా వేలాదిమంది ప్రాణాలను కాపాడగలిగాననే తృప్తి ఎక్కువ సంతోషాన్నిచ్చింది’ అని వివరిస్తుంది పుష్ప.


జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు