close

సంపాదకీయం

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అపూర్వ పథంలో ప్రగతి రథం

మోదీ వందరోజుల పాలన

ప్రధాని మోదీ తొలి వంద రోజుల పాలన దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినది. దేశ ప్రజల సంక్షేమం, అభివృద్ధి; ఆర్థిక వ్యవస్థ బలోపేతం, ఉగ్రవాద నిరోధక చర్యలు, మహిళలకు రక్షణ, మౌలిక సదుపాయాల విస్తరణలను దృష్టిలో పెట్టుకొని పలు కీలక నిర్ణయాలు తీసుకుని మోదీ త్వరితగతిన అమలు పరిచారు. ముఖ్యంగా 70 ఏళ్లుగా వెనకబాటులో మగ్గుతున్న కశ్మీరీలను 370 అధికరణ చెరనుంచి బయటపడేశారు. వందల ఏళ్లుగా ముమ్మార్లు తలాక్‌ వంటి మధ్యయుగ ఛాందస సంప్రదాయాల బారినపడి అన్యాయానికి గురవుతున్న ముస్లిం మహిళలకు రక్షణ కల్పిస్తూ ఆ కట్టుబాటుపై నిషేధం విధించారు. అర ఎకరం ఉన్న బడుగు రైతుకు సైతం వర్తించేలా ఆరువేల రూపాయల పెట్టుబడి సాయం; 60 ఏళ్లు దాటిన ప్రతి రైతుకు, చిరు వ్యాపారికి నెలకు రూ.3 వేల పింఛను... ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో సంస్కరణలు, నిర్మాణాత్మక కార్యక్రమాలు పట్టాలకెక్కించడం ద్వారా కొత్త చరిత్ర సృష్టించారు. సంస్కరణల్లో వేగం కనబరచారు. ప్రతి ఒక్కరికీ సంక్షేమం, సామాజిక న్యాయం అందించాలన్న లక్ష్యాల సాధనలో సత్ఫలితాలు సాధ్యపడ్డాయి. ఈ వంద రోజుల కాలావధిలో 17వ లోక్‌సభ తొలి సమావేశాలు 50 రోజులకుపైగా జరగడం విశేషం. ఆ సమావేశాలు అత్యంత ఫలవంతంగా జరిగాయి. పార్లమెంటు చరిత్రలో ఇదొక ఘనమైన అధ్యాయం. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 17వ లోక్‌సభలో 36 బిల్లులు ఆమోదం పొందాయి. రాజ్యసభలో 20 ఏళ్ల రికార్డులను బద్దలుకొడుతూ 32 బిల్లులు ఆమోదం పొందాయి. రాజ్యసభలో సరైన మెజారిటీ లేకపోయినా ఇతర పార్టీల సహకారంతో పలు కీలక బిల్లులు ఆమోదింపజేసుకోవడం మోదీ ప్రభుత్వ సమర్థతకు, అకుంఠిత దీక్షకు నిదర్శనం.

ఆర్థిక వ్యవస్థ బలోపేతం
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆటుపోట్లకు గురైనా భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం నిలదొక్కుకుని నిలకడగా అభివృద్ధి దిశగా సాగుతోంది. మోదీ నేతృత్వంలో కేవలం అయిదేళ్లలోనే మన ఆర్థిక వ్యవస్థ అదనంగా మరో లక్ష డాలర్ల స్థాయికి ఎదిగింది. దేశ ఆర్థిక వ్యవస్థ 2015-16నాటి 1.99 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.139.3 లక్షల కోట్ల) స్థాయి నుంచి 2018-19లో 2.75 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.192.5 లక్షల కోట్ల) స్థాయికి చేరింది. అంతేకాకుండా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఆ విలువ మూడు లక్షల కోట్ల డాలర్ల స్థాయికి పెరగనుంది. భారత్‌ను అయిదు లక్షల కోట్ల డాలర్ల (రూ.344 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా రూపొందించాలన్న మోదీ సంకల్పం నెరవేరేలా ప్రణాళికలు అమలు జరగనున్నాయి. 2018-19లో భారత ఎగుమతులు తొమ్మిది శాతం పెరిగి 331 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. దేశంలో నిర్మించిన జాతీయ రహదారుల పొడవు 1.32 లక్షల కిలోమీటర్లకు చేరింది. ఇందులో 20శాతం గడచిన నాలుగేళ్లలోనే నిర్మించారు. 2014-15లో రోజుకు 12 కిలోమీటర్ల పొడవైన రహదారిని నిర్మిస్తే, 2018-19కి ఇది 30 కిలోమీటర్ల స్థాయికి చేరింది. 2018-19లో ముడి ఉక్కు ఉత్పత్తి 106.56 మిలియన్‌ టన్నులుగా నమోదైంది.

కేంద్రం 2019-20 ఖరీఫ్‌ సీజన్‌కు 14 పంటలకు కనీస మద్దతు ధరలు (ఎంఎస్‌పీ) పెంచింది. వరికి క్వింటాకు రూ.65, జొన్నకు రూ.120, రాగులకు రూ.253 చొప్పున పెంచారు. సూక్ష్మ పోషక ఎరువులపై రైతులకు రూ.22,875 కోట్ల మేర రాయితీలు ఇచ్చారు. క్వింటా గంధకం (సల్ఫర్‌)పై రాయితీని రూ.350కి పెంచారు. ముద్ర పథకం ప్రారంభించిన నాటినుంచి ఇప్పటి వరకు 19 కోట్లకుపైగా రుణాలు అందించారు. జల వనరులను సంరక్షించి, వాన నీటిని ఒడిసి పట్టుకొనేలా ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు ‘జలశక్తి అభియాన్‌’ కార్యక్రమం అమలు చేస్తున్నారు. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో నీటి పొదుపు, సంరక్షణ, పునర్వినియోగాలను ప్రోత్సహించే దిశగా కార్యాచరణ ప్రకటించారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో నీటికోసం ఇబ్బందిపడుతున్న 256 జిల్లాలు, 1592 బ్లాకుల్లో ఈ కార్యక్రమాన్ని రెండు దశల్లో నిర్వహిస్తారు.

తొలి మంత్రివర్గ సమావేశంలోనే దేశంలో అర్హులైన రైతులందరికీ కిసాన్‌ సమ్మాన్‌ పథకం కింద ఏటా రూ.6వేల సాయం అందించాలని తీర్మానించారు. దానిపై ప్రభుత్వం చేసే ఖర్చు రూ.87,217 కోట్లు. చిన్న, సన్నకారు రైతులకు, జీఎస్‌టీ పరిధిలోకి రాని వ్యాపారుల్లో 60 ఏళ్ల దాటినవారికి నెలకు రూ.3వేలు అందించేలా ప్రధానమంత్రి కిసాన్‌ పింఛను యోజన అమలు చేస్తున్నారు. పాడి పశువులకు రోగాలు రాకుండా కేంద్ర ప్రభుత్వం ఖర్చుతో వ్యాక్సిన్లు వేయిస్తారు. తొలి దశ మొదటి మూడేళ్లలో కనీసం అయిదు కోట్లమంది చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం కల్పిస్తారు. ప్రధానమంత్రి గ్రామ సడక్‌ యోజన (పీఎమ్‌జీఎస్‌వై) మూడో దశ కింద దేశంలోని అన్ని గ్రామాలను వాటికి సమీపంలో ఉన్న వ్యవసాయ మార్కెట్లకు అనుసంధానించేందుకు కేంద్రం కార్యాచరణ సిద్ధం చేసింది. దీనికోసం వచ్చే అయిదేళ్లలో రూ.70వేల కోట్లు ఖర్చు చేయనున్నారు. గ్రామీణ భారతంలో 1.25 లక్షల కిలోమీటర్ల మేర రహదారులు నిర్మిస్తారు.

36 బిల్లుల ఆమోదం
ఈసారి మోదీ సారథ్యంలో భాజపా అత్యధిక మెజారిటీతో ఎన్నిక కాగానే పెండింగ్‌ బిల్లులన్నీ ఆమోదించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో వ్యవహరించింది. లోక్‌సభలో 36, రాజ్యసభలో 32 బిల్లులు ఆమోదించారు. వీటిలో ముమ్మార్లు తలాక్‌ నిషేధ బిల్లు, కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే 370 అధికరణ రద్దు, నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ బిల్లు, చట్టవ్యతిరేక కార్యకలాపాల బిల్లు, అనియంత్రిత డిపాజిట్‌ పథకాల నిషేధ బిల్లు ముఖ్యమైనవి. మోదీ ప్రభుత్వం మొదటి విడత అధికారం చేపట్టినప్పుడు ప్రతి దశలో రాజ్యసభలో బలం కలిగిన ప్రతిపక్షాలు సభకు అంతరాయం కల్పించి అనేక బిల్లులు ఆమోదించకుండా చేశాయి. మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరవాత ఎన్డీఏ సంఖ్యాబలం పెరగడమే కాదు, భాజపా పట్ల చాలా పార్టీల వైఖరి మారింది. అందువల్ల కాంగ్రెసుతోపాటు ఒకటి, రెండు పార్టీలు తమ నిరసనను వాకౌట్లకే పరిమితం చేశాయి. ముమ్మార్లు తలాక్‌ నిషేధ బిల్లు రెండుసార్లు లోక్‌సభలో ఆమోదం పొందినా రాజ్యసభలో దానికి అడ్డంకులు కల్పించారు. అయినా తన దృఢ సంకల్పాన్ని నిలబెట్టుకుంటూ ఈ బిల్లును ప్రభుత్వం రాజ్యసభలోనూ ప్రవేశపెట్టి ఆమోదింపజేసింది. ఎన్డీయేతర పార్టీలు కూడా తక్షణ తలాక్‌ బిల్లుకు మద్దతిచ్చాయి. ఇది ముస్లిం మహిళల పోరాటానికి చట్టబద్ధమైన అండ కల్పించింది. తక్షణ తలాక్‌ను నిషేధిస్తూ చేసిన చట్టం ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడే కాంగ్రెస్‌కు చెంపపెట్టుగా మారింది. ఈ బిల్లు ఒక చరిత్రాత్మకమైన తప్పిదాన్ని సరిదిద్దింది. ముస్లిం మహిళల గౌరవ ప్రతిష్ఠలను పెంపొందించింది.

కశ్మీరీల కల సాకారం
జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే 370 అధికరణను రద్దుచేసే బిల్లు అతి ముఖ్యమైనది. దీన్ని రద్దుచేయడం ద్వారా 70 ఏళ్లనుంచి అభివృద్ధి, వికాసానికి నోచుకోకుండా, దీనావస్థలో బతుకుతున్న కశ్మీరీల బతుకుల్లో మోదీ ప్రభుత్వం వెలుగులు నింపింది. 370 అధికరణ రద్దుతో భారతీయ జనసంఘ్‌ వ్యవస్థాపకుడు శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ, దేశ తొలి ఉపప్రధాని సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌, దివంగత ప్రధాని వాజ్‌పేయీ, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ల స్వప్నం సాకారమైంది. జాతీయ మెడికల్‌ కమిషన్‌ బిల్లు కూడా దేశంలో అతిపెద్ద సంస్కరణ. అవినీతికి ఆలవాలమై, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ప్రస్తుత వ్యవస్థను రద్దుచేసి కొత్త వ్యవస్థను ఏర్పరచేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తోంది. దీనితో ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో 50 శాతం సీట్లు పేదలకు అందుబాటులోకి వస్తాయి. పేదలు, మధ్యతరగతి వర్గాలను ప్రలోభపెట్టి, వారి నుంచి డిపాజిట్లు సేకరించి బోర్డులు తిప్పేసే శారదా చిట్‌ఫండ్స్‌ లాంటి కుంభకోణాలను అరికట్టేందుకు ప్రవేశపెట్టిన అనియంత్రిత డిపాజిట్‌ పథకాల నిషేధ బిల్లు కూడా చరిత్రాత్మకమైనది. పేదలు కష్టపడి దాచుకున్న సొమ్ముకు చట్టపరమైన భద్రత కల్పించేందుకు ఇది దోహదం చేస్తుంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక బిల్లు అత్యంత ప్రధానమైనది. ఈ బిల్లు ఉగ్రదాడులపై దర్యాప్తు విషయంలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు మరింత శక్తి సమకూర్చడానికి వీలు కల్పిస్తుంది. భారతీయులపై, విదేశాల్లోని భారతీయ ఆస్తులపై ఉగ్రదాడులు చోటుచేసుకుంటే దర్యాప్తు జరిపే అధికారం ఎన్‌ఐఏకు సమకూరింది. ఏకపక్ష   ఆరోపణలకు తావులేకుండా, ఎవరినైనా ఉగ్రవాదులుగా ప్రకటించే ముందు నాలుగు దశల్లో నిశిత పరిశీలన జరుపుతారు. నిందితులు అప్పీళ్లకు వెళ్లే అవకాశమూ ఇచ్చారు. పిల్లలపై అత్యాచారానికి మరణశిక్ష, ఇతర నేరాలకు కఠిన శిక్షలు విధించేలా పోక్సో చట్టసవరణ బిల్లు, వినియోగదారుల హక్కులను బలోపేతం చేసే బిల్లుకు, జాతీయ స్థాయిలో, వివిధ రాష్ట్రాల మానవ హక్కుల కమిషన్లలో ఛైర్‌పర్సన్ల సభ్యుల నియామక ప్రక్రియను వేగవంతం చేసే బిల్లుకు ఆమోదం లభించింది. సమాచార హక్కు చట్టానికి చేసిన సవరణ, వ్యాపార కోణం, లాభాపేక్షతో మాత్రమే సాగే గర్భాన్ని అద్దెకు ఇచ్చే ప్రక్రియను అడ్డుకునే ‘సరోగసి’ బిల్లులూ పార్లమెంటు ఆమోదం పొందాయి. ఆధార్‌ను గుర్తింపు పత్రంగా స్వచ్ఛందంగా ఉపయోగించుకునేందుకు ఉద్దేశించిన సవరణ బిల్లు, మోటారు వాహనాల బిల్లు, ట్రాన్స్‌జెండర్స్‌ బిల్లు, కోడ్‌ ఆఫ్‌ వేజెస్‌, కంపెనీల బిల్లు వంటి అనేక బిల్లులు ఈ సమావేశాల్లో ఆమోదం పొందాయి. కాలం చెల్లిన 58 బిల్లులను సైతం రద్దుచేయడం మోదీ ప్రభుత్వ వేగవంతమైన పనితీరుకు నిదర్శనం!


జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు