close

ఈనాడు ప్రత్యేకం

వెనుక నుంచి నరుక్కొద్దాం

జేఈఈలో 10 శాతం డబ్ల్యూఎస్‌ కోటా
ఐఐటీలు, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీల్లో అవకాశం
గత ఏడాది 43,000 మందే ఆ కోటా అభ్యర్థులు
నష్టపోయిన వందలాదిమంది తెలుగు విద్యార్థులు
ఈనాడు, హైదరాబాద్‌

జేఈఈ మెయిన్‌ పరీక్షలో ఆర్థికంగా వెనకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్‌) కోటా ఈసారి కీలకం కానుంది. ఈ కోటాను గత ఏడాదే కొత్తగా ప్రవేశపెట్టినందున అవగాహన లేక చాలామంది తెలుగు విద్యార్థులు నష్టపోయారు. అదీగాక జేఈఈ మెయిన్‌ జనవరి పరీక్ష తర్వాత ఈ కోటాపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అప్పటికే దరఖాస్తుల ప్రక్రియ పూర్తికావడంతో చాలామంది అర్హత ఉన్నా ఈడబ్ల్యూఎస్‌ కింద నమోదు చేసుకోసులేదు. కళాశాలల యాజమాన్యాలు, శిక్షణ సంస్థల నిపుణులు కూడా దీని గురించి వివరించలేదు. దరఖాస్తులో ఈ వివరాల నమోదుకు తర్వాత అవకాశం ఇచ్చినా ఎవరూ పట్టించుకోకపోవడంతో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు జేఈఈలో వెనకబడ్డారు. ఈసారి అర్హులైన విద్యార్థులు ముందుగానే ఈ కోటా కింద దరఖాస్తు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

30 వరకు దరఖాస్తుల ప్రక్రియ
జేఈఈ మెయిన్‌ జనవరి పరీక్షకు దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 3 నుంచి మొదలైంది. ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్రం 2019-20 విద్యాసంవత్సరం నుంచి 10 శాతం ఈడబ్ల్యూఎస్‌ కోటా అమలు చేస్తోంది. జేఈఈ మెయిన్‌లో ర్యాంకులు కూడా కేటగిరీల వారీగా కేటాయిస్తారు. ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద అర్హులైన వారు దరఖాస్తు సమయంలోనే తాము అర్హులమని పొందుపరచాలి. లేకుంటే జనరల్‌ కేటగిరీ కిందకు వస్తారు.

అర్హులు ఎవరు?
ఆర్థికంగా వెనకబడిన అగ్రవర్ణాల (ఓసీ) వారు
కుటుంబ వార్షిక ఆదాయం రూ. 8 లక్షల లోపు ఉన్నవారు
5 ఎకరాలు, ఆలోపు వ్యవసాయ పొలం ఉన్నవారు
మున్సిపాలిటీల్లో అయితే 100 గజాలు, ఆలోపు
విస్తీర్ణంలో నివాస గృహం ఉన్నవారు. ఇతరచోట్ల అయితే 200 గజాల లోపు విస్తీర్ణంలో నివాస గృహం ఉన్నవారు.
పట్టణ, నగర ప్రాంతాల్లో 1,000 చదరపు అడుగులు, ఆలోపు విస్తీర్ణం ఉన్న ఫ్లాట్‌ (అపార్ట్‌మెంట్‌) ఉన్నవారు

మార్కుల తేడా అధికమే
దాదాపు 12 లక్షలమంది పోటీ పడుతుండటంతో జేఈఈలో ఒక్క మార్కు కూడా విద్యార్థుల భవిష్యత్తును మార్చేస్తుంది. గత ఏడాది మెయిన్‌ ర్యాంకుల వెల్లడి తర్వాత ఈడబ్ల్యూఎస్‌ కటాఫ్‌ స్కోర్‌ చూసి వేలాదిమంది జనరల్‌ కేటగిరీ విద్యార్థులు తలలు పట్టుకున్నారు. ఈడబ్ల్యూఎస్‌ కింద దరఖాస్తు చేసుకొని ఉంటే అర్హత సాధించి ఉండేవారమని ఆవేదన చెందారు.

గత ఏడాది ఇలా...
జేఈఈ మెయిన్‌ పరీక్షలు రాసినవారు: 11.47 లక్షలు
జనరల్‌ కేటగిరీ విద్యార్థులు: 5.05 లక్షలమంది
ఈడబ్ల్యూఎస్‌కి దరఖాస్తు చేసిన వారు: 43,035 మంది

ఇప్పుడే ధ్రువపత్రం అవసరం లేదు
- కృష్ణ చైతన్య, జేఈఈ శిక్షణ నిపుణుడు

‘‘ఈసారి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైనందున అర్హులైన వారు ఈడబ్ల్యూఎస్‌ కోటా గురించి దరఖాస్తులో పేర్కొంటే చాలు. ఇప్పుడే తహసీల్దారు ధ్రువపత్రం అవసరం లేదు. ర్యాంకులు ప్రకటించే ముందు ధ్రువపత్రాలు అప్‌లోడ్‌ చేయాలని ఎన్‌టీఏ అడుగుతుంది. అప్పుడు ఇస్తే ఆ కోటా కింద పరిగణించి ర్యాంకులు కేటాయిస్తారు. లేకుంటే జనరల్‌ కేటగిరీలోనే లెక్కిస్తారు.’’


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు