close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM

1. ట్రాఫిక్‌ జరిమానాలు రాష్ట్రాల ఇష్టమే: గడ్కరీ

కేంద్ర ప్రభుత్వం పెంచిన ట్రాఫిక్‌ జరిమానాల విధింపుపై రాష్ట్రాలే సొంతంగా నిర్ణయాలు తీసుకోవచ్చని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టంచేశారు. దేశవ్యాప్తంగా పెరిగిన ట్రాఫిక్‌ జరిమానాలను గుజరాత్‌ ప్రభుత్వం మంగళవారం తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల సవరించిన మోటారు వాహనాల చట్టం-2019 ప్రకారం పెరిగిన ట్రాఫిక్‌ జరిమానాలను రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించుకొనే వెసులుబాటు ఉంటుందని వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. ప్రాజెక్టుల న్యాయసమీక్షకు జడ్జి నియామకం

పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక వనరుల శాఖలో ప్రాజెక్టుల న్యాయ సమీక్ష కోసం ఏపీ ప్రభుత్వం హైకోర్టు జడ్జిని నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం హైకోర్టు జడ్జి జస్టిస్‌ శివశంకర్‌రావును నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన నియామకానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి  ఆమోద ముద్ర వేశారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులు, టెండర్లను ఈ న్యాయమూర్తి సమీక్షించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. ‘నిమజ్జనం’ సెలవు ప్రకటించిన ప్రభుత్వం

వినాయక నిమజ్జనం సందర్భంగా గురువారం తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. జంట నగరాలు, మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాలకు ఈ సెలవు వర్తిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. గురువారం సెలవు ప్రకటిస్తున్నందున ఈనెల 14న (రెండో శనివారం) పనిదినంగా స్పష్టం చేసింది. నిమజ్జనం సందర్భంగా జంట నగరాలతో పాటు, మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల పరిధిలో గణేశుడి శోభాయాత్ర ఘనంగా నిర్వహించనున్నారు. ఖైరతాబాద్‌ మహాగణపతితో పాటు బాలాపూర్‌ గణనాథుడి భారీ విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. ఏపీలో వరద బాధితుల పరిహారం విడుదల

ఉభయగోదావరి జిల్లాల్లోని వరద బాధితులకు ప్రకటించిన పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. వరద నీటిలో మునిగిన గ్రామాల్లోని ఒక్కో బాధిత కుటుంబానికి రూ.5వేల చొప్పున చెల్లించాలని ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. ఈ మేరకు రూ.10.9 కోట్ల నిధులను విడుదల చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. నరేష్‌కు రాజశేఖర్‌నోటీసులు: ‘మా’ వివరణ

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌ (‘మా’)కు సంబంధించి సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వార్తలపై కార్యవ‌ర్గం వివ‌ర‌ణ‌ ఇచ్చింది. కార్యవర్గంలో భేదాభిప్రాయాలు వ‌చ్చాయ‌ని, అధ్యక్షుడు న‌రేష్‌కు రాజ‌శేఖ‌ర్ కార్యవ‌ర్గం నోటీసులు ఇచ్చారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విష‌యం తెలుసుకున్న ‘మా’ కార్యనిర్వాహ‌క వర్గం వాటిని తీవ్రంగా ఖండించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. ప్రభుత్వానికి కడప ‘యురేనియం’ నివేదిక

కడప జిల్లాలోని యురేనియం అనర్థాలపై అధ్యయనం చేసిన కమిటీ  రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. తుమ్మలపల్లిలోని యురేనియం ప్లాంట్‌తో ఆ ప్రాంతంలో ప్రజలపై పడుతున్న ప్రభావం తదితర అంశాలను నివేదికలో కమిటీ పొందుపరిచింది. ఈనెల 9, 10 తేదీల్లో తుమ్మలపల్లి సమీపంలోని యురేనియం బాధిత ప్రాంతాల్లో 11 మంది సభ్యుల కమిటీ పర్యటించి ప్రజల అభిప్రాయాలు సేకరించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. ఏలూరు సబ్‌జైలుకు చింతమనేని తరలింపు

తెదేపా నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు ఏలూరు ఎక్సైజ్‌ న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఏలూరు ప్రభుత్వ వైద్యశాలలో చింతమనేనికి వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం పోలీసులు ఆయన్ను కోర్టుకు తీసుకెళ్లారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో విచారణ చేపట్టిన న్యాయస్థానం.. చింతమనేనికి ఈనెల 25 వరకు రిమాండ్‌ విధించింది. న్యాయస్థానం రిమాండ్‌ విధించడంతో పోలీసులు ఆయన్ను ఏలూరు సబ్‌జైలుకు తరలించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. రేపు భాజపాలోకి ఆదినారాయణరెడ్డి?

మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి తెదేపాను వీడనున్నారు. భాజపాలో చేరేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. బుధవారం ఆయన దిల్లీ బయల్దేరి వెళ్లారు. రేపు జాతీయ నేతల సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి ఆదినారాయణరెడ్డి తెదేపాకు అంటీముట్టనట్లే వ్యవహరిస్తూ వచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. భావితరాలకు కాలుష్య తెలంగాణఇస్తామా?:పవన్‌

నల్లమలలో యురేనియం తవ్వకాలపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మరోసారి స్పందించారు. ఈ మేరకు బుధవారం ఆయన ట్వీట్‌ చేశారు. భావి తరాలకు బంగారు తెలంగాణ ఇస్తామా? యురేనియం కాలుష్య తెలంగాణ ఇస్తామా? అనేది అన్ని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ఆలోచించుకోవాలని సూచించారు. నల్లమల అడవుల సంరక్షణకు జనసేన పార్టీ మద్దతుగా నిలబడుతుందని స్పష్టంచేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. కేటీఆర్‌కు మహేష్‌ మద్దతు

తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు ప్రిన్స్‌ మహేష్‌బాబు మద్దతు తెలిపారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు జ్వరాల బారిన పడి తీవ్రంగా బాధపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై ఇటీవల తెలంగాణ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ సోషల్‌మీడియా వేదికగా స్పందిస్తూ .. జ్వరాల బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు