close

ఫీచర్ పేజీలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పదండి బాపూ జాడలో

అక్టోబరు 2 గాంధీ జయంతి

దసరా సెలవులు వచ్చేస్తున్నాయ్‌! ఈ పది రోజుల్లో పిల్లలకు ఏం చెప్పాలి? ఏమేం చూపాలి? జాతిపిత 150వ జయంతి వచ్చేస్తోంది. ఇంతకన్నా మంచి తరుణం ఏముంటుంది. మీ పిల్లలకు బాపూ గురించే చెప్పండి. ఆ మహాత్ముడు నడయాడిన దివ్య స్థలాలను చూపించండి. గాంధీజీ జీవితాన్ని పరిచయం చేసే ప్రదేశాలు కొన్నయితే.. ఆయన సందేశాన్ని అందించే ప్రాంతాలు ఇంకొన్ని.. ఇంకేం..గాంధీయాత్రకు తరలి వెళ్లండి...

జాతిపిత జన్మస్థలి: పోర్‌బందర్‌, గుజరాత్‌

గుజరాత్‌లో కడలి అంచున ఉంటుంది పోర్‌బందర్‌. ఒకప్పుడు రేవు పట్టణంగా ప్రసిద్ధి. ఇప్పుడా సంగతి ఎవరికీ గుర్తులేదు. పోర్‌బందర్‌ అనగానే అందరికీ గుర్తొచ్చేది మన జాతిపితే. గాంధీ మహాత్ముడు ఇక్కడే పుట్టాడని చిన్నప్పటి నుంచీ చదువుకున్నాం. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకకు సుమారు 105 కి.మీ. దూరంలో ఉంటుందీ దివ్యస్థలి. బాపూ జన్మించిన భవనం ఇప్పుడు కీర్తి మందిర్‌గా కనిపిస్తుంది. నిత్యం వచ్చిపోయే పర్యాటకులతో ఈ ప్రదేశం కిటకిటలాడుతుంది. మూడు అంతస్తుల్లో ఉండే కీర్తి మందిర్‌ భవనంలో అడుగడుగునా మహాత్ముడి మహోన్నత చరిత్ర దర్శనమిస్తుంది. సందర్శనశాలలో బాపూ వాడిన వస్తువులు, చదివిన పుస్తకాలు చూడొచ్చు. ఇక్కడే ఓ గ్రంథాలయం ఏర్పాటు చేశారు. ప్రార్థనా మందిరం కూడా ఉంది. ఇదే విహారంలో సముద్ర తీరం తప్పక చూడాల్సిన ప్రదేశం. సమీపంలోనే పోర్‌బందర్‌ పక్షుల సంరక్షణ కేంద్రం ఉంటుంది. శీతకాలంలో రకరకాల పక్షులు ఇక్కడికి వలస వస్తాయి. పట్టణానికి 15 కి.మీ. దూరంలో బార్దాహిల్స్‌ జంతు సంరక్షణ కేంద్రం ఉంది. పనిలో పనిగా వీటినీ సందర్శించవచ్చు. ప్రముఖ పుణ్యక్షేత్రం సోమ్‌నాథ్‌ పోర్‌బందర్‌కు 135 కి.మీ. దూరంలో ఉంటుంది.

చేరుకునేదిలా: సికింద్రాబాద్‌ నుంచి పోర్‌బందర్‌కు రైళ్లున్నాయి. సికింద్రాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం నుంచి రాజ్‌కోట్‌కు రైళ్లున్నాయి. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో, రైలు మార్గంలో పోర్‌బందర్‌కు చేరుకోవచ్చు.


వేడి చర్చల శీతల విడిది: సిమ్లా, హిమాచల్‌ప్రదేశ్‌

ఆంగ్లేయుల పాలనలో సిమ్లా వేసవి రాజధానిగా ఉండేది. వేసవిలో బ్రిటిష్‌ పాలకులు, ఉన్నతాధికారులు అక్కడికి వెళ్లిపోయేవాళ్లు. ఆ సమయంలో వారితో చర్చలు జరపాల్సి వస్తే గాంధీజీ కూడా సిమ్లాకు వెళ్లేవారు. 1921-46 మధ్యకాలంలో బాపూ దాదాపు పదకొండుసార్లు ఈ ప్రాంతానికి వెళ్లారు. ఆ సమయంలో గాంధీజీ బస చేసిన భవంతులు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. కాలక్రమంలో ఆ భవనాల్లో ఇతరుల పరమైనవే ఎక్కువ. రాజకుమారి అమృత్‌కౌర్‌కు చెందిన మనోర్విల్లీ భవనాన్ని ఇప్పుడు ఎయిమ్స్‌ ప్రాంగణంలో చూడొచ్చు. 1945లో బ్రిటిష్‌ జనరల్‌తో చర్చల సందర్భంగా సిమ్లా వచ్చిన బాపూ, పటేల్‌, నెహ్రూ, మౌలానా అజాద్‌ తదితర మహానుభావులు ఇదే భవనంలో ఉన్నారు.

చేరుకునేదిలా: సిమ్లా.. చండీగఢ్‌ నుంచి 115 కి.మీ., దిల్లీ నుంచి 342 కి.మీ. దూరంలో ఉంటుంది. దిల్లీ నుంచి బస్సులు, ట్యాక్సీల్లో సిమ్లా వెళ్లొచ్చు. చండీగఢ్‌ నుంచి బస్సులు, ట్యాక్సీల్లో వెళ్లొచ్చు.


నిరశన సౌధం: హైదరీ మంజిల్‌, కోల్‌కతా

కోల్‌కతాలో ఎన్నో పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి. బెంగాలీ రుచులు పంచే మహానగరిలో బాపూ చెదరని చిహ్నం కూడా ఒకటుంది. అదే హైదరీ మంజిల్‌. దేశానికి స్వతంత్రం సిద్ధించిన తర్వాత కొన్నాళ్లు గాంధీజీ ఇక్కడే ఉన్నారు. దేశమంతా మతకల్లోలాలు చెలరేగడంతో కలత చెందారు. బెంగాల్‌లో మత విద్వేషాలు పెచ్చరిల్లడంతో ఆవేదన చెందారు. ఈ విధ్వంసాన్ని ఆపడానికి 78 ఏళ్ల వయసులో బాపూ నిరాహార దీక్షకు పూనుకున్నారు. సెప్టెంబరు 1న దీక్షలో కూర్చున్నారు గాంధీ. మూడు రోజుల పాటు పచ్చి గంగ ముట్టుకోలేదు. నిరసనకారులు వెనక్కి తగ్గి.. ఆయుధాలు వీడటంతో సెప్టెంబరు 4న నిరశన విరమించారు. ఆనాడు బాపూ ఉపవాసం చేసిన హైదరీ మంజిల్‌.. గాంధీ స్మారక భవనాన్ని నేటికీ దర్శించవచ్చు. భవంతిలో గాంధీజీ అపురూప చిత్రాలను, ఆయన వాడిన వస్తువులను చూడొచ్చు.

చేరుకునేదిలా: సికింద్రాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం నుంచి కోల్‌కతాకు రైళ్లున్నాయి.


సత్యాగ్రహ స్ఫూర్తి: దండి, గుజరాత్‌

దండి... గుజరాత్‌ తీరంలోని ఓ చిన్న గ్రామం. ప్రపంచమంతా సత్య, అహింసల బలాన్ని తెలుసుకుందిక్కడే. అంత శక్తివంతమైన బ్రిటిష్‌ పాలన చరమాంకానికి చేరుకుందిక్కడే!  సత్యాగ్రహ సిద్ధాంతం పెను ఉప్పెనగా మారి తీరాన్ని తాకిందీ ఇక్కడే!! మహాత్ముడి ఆధ్వర్యంలో 1930 మార్చిలో జరిగిన ఉప్పు సత్యాగ్రహానికి వేదికైన ఈ చిన్న గ్రామం ఇప్పుడు ప్రపంచాన్ని మరోసారి తనవైపు తిప్పుకొనేందుకు ముస్తాబైంది. 89 ఏళ్ల అహింసాయుత పోరాటానికి చిహ్నంగా జాతీయ ఉప్పు సత్యాగ్రహ స్మారకం దండిలో రూపుదిద్దుకుంది. అప్పటి రోజులు గుర్తొచ్చేలా 80 మంది సత్యాగ్రహుల ప్రతిమలతో పాటు మరెన్నో జ్ఞాపకాలు ఇక్కడ ఉన్నాయి. ఆనాటి మహోద్యమాన్ని గురించి వివరించే ఫలకాలు చూపుతిప్పుకోనివ్వవు. ఆకట్టుకునే పరిసరాలు ఒకవైపు, మహాత్యాగాల చిహ్నాలు మరోవైపు సందర్శకులకు కొత్త అనుభూతిని కలిగిస్తాయి. ఈ స్మారకం మొత్తానికి సౌర విద్యుత్తునే వాడుతుండడం మరో విశేషం. దండి మెమోరియాల్‌ సమీపంలోనే నవసరి పట్టణం ఉంది. పర్యటకులు ఇక్కడ బస చేయొచ్చు. ఈ పట్టణానికి రోడ్డు, రైలు మార్గాలున్నాయి. 30 కిలోమీటర్ల దూరంలోని సూరత్‌కు చేరుకుని కూడా ఇక్కడకు రావచ్చు. 


బాపూ జీవిత చిత్రం: గాంధీ తీర్థం, మహారాష్ట్ర


మహారాష్ట్రలోని జల్‌గావ్‌లో ఉంటుంది బాపూ తీర్థం . మహాత్ముడి సమగ్ర జీవితాన్ని ఇక్కడ దర్శించవచ్చు. గాంధీ ఫౌండేషన్‌ నిర్మించిన సువిశాల పర్యావరణహిత భవనం అపురూపంగా ఉంటుంది. భవనంలో బాపూ జీవితంలోని ప్రధాన ఘట్టాలు వర్ణచిత్రాలు, ఛాయాచిత్రాలు, శిల్పాలు, వీడియోలు, యానిమేషన్ల రూపంలో దర్శనమిస్తాయి. బాల్యంలో గాంధీని ప్రభావితం చేసిన శ్రవణకుమారుడి కథ, సత్యహరిశ్చôద్రుడి గాథ.. పిల్లల్లో సత్యశోధనకు బీజం వేస్తాయి. స్వతంత్ర సంగ్రామంలో బాపూ కార్యదీక్షకు అద్దంపట్టే సన్నివేశాలు యువత లక్ష్యసాధనకు దోహదం చేస్తాయి. 2012 మార్చిలో ఈ అద్భుత సందర్శనశాలను ప్రారంభించారు.

చేరుకునేదిలా: సికింద్రాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం నుంచి జల్‌గావ్‌కు రైళ్లు అందుబాటులో ఉన్నాయి. రైల్వేస్టేషన్‌ నుంచి ఆటోల్లో గాంధీ తీర్థం చేరుకోవచ్చు.  ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక కేంద్రం అజంతా.. జల్‌గావ్‌ నుంచి 56 కి.మీ. దూరంలో ఉంటుంది.


హిమనగం.. గీతా సారం..: కౌసానీ, ఉత్తరాఖండ్‌

ఓసారి ఓ టీ ఎస్టేట్‌ యజమాని గాంధీని కలిశారు. స్వతంత్ర సంగ్రామంలో తీరికలేకుండా ఉన్న బాపూని కౌసానీకి వచ్చి ఓ రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలని కోరారు. అందుకు బాపూ అంగీకరించారు. అన్నట్టుగానే  1929 జూన్‌లో గాంధీ కౌసానీకి వచ్చారు. రెండు రోజులు గడిచిపోయాయి. మూడు.. నాలుగు.. ఐదు.. రోజులు దొర్లిపోతున్నాయి. తిరుగు ప్రయాణం మాటే మర్చిపోయారు గాంధీజీ. మహాత్ముడి మనసును కట్టిపడేసిన సౌందర్యం కౌసానీ సొంతం. హిమాలయాల చెంతనుండే.. ఈ పర్యాటక కేంద్రం బాపూని అమితంగా ఆకర్షించింది. శీతల పవనాలు, పచ్చని తేయాకు తోటలు, కొండలు, చెట్లు మహాత్ముడిని మంత్రముగ్ధుడిని చేశాయి. నందాదేవి, త్రిశూల్‌ తదితర హిమవన్నగాల సోయగాలు చూసి గాంధీజీ మైమరచిపోయేవారట. రెండు రోజుల పర్యటనకు కౌసానీ వచ్చి.. ఏకంగా 14 రోజులు అక్కడే ఉండిపోయారు. ఇదే సమయంలో ‘అనాసక్తి యోగ’ పేరిట గీతా సారాన్ని గుజరాతీలోకి అనువదించారు. బాపూ విడిది చేసిన ఆ భవనం నేటికీ అంతే ప్రశాంతంగా ఉంది. గాంధీజీ జీవిత విశేషాలు ఇక్కడ చూడొచ్చు. కౌసానీ పర్యటనకు వచ్చిన వాళ్లు చెంతనే ఉన్న అల్మోడా, నైనిటాల్‌ కూడా చూడొచ్చు.

చేరుకునేదిలా: దిల్లీ నుంచి నైనిటాల్‌కు బస్సులు, ట్యాక్సీల్లో వెళ్లొచ్చు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కౌసానీ చేరుకోవచ్చు.


బాపూ బాటలో..
బాపూ జీవితంతో ముడిపడిన మరెన్నో ప్రాంతాలు.. పర్యాటక కేంద్రాలుగా భాసిల్లుతున్నాయి. వాటిలో కొన్ని..
* సబర్మతి ఆశ్రమం, అహ్మదాబాద్‌, గుజరాత్‌
* అగాఖాన్‌ ప్యాలెస్‌, పుణె, మహారాష్ట్ర
* సేవాగ్రామ్‌ ఆశ్రమం, వార్ధా, మహారాష్ట్ర
* కస్తూర్బా ఆశ్రమం, చంపారన్‌, బిహార్‌
* గాంధీ మ్యూజియం, దిల్లీ
* గాంధీ మ్యూజియం, మదురై, తమిళనాడు
* గాంధీ సంగ్రహాలయ, ముంబయి, మహారాష్ట్రమరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు