close

ఫీచర్ పేజీలు

ప్రీమియం తగ్గించుకుందాం

వాహన సురక్ష

క్లెయిం చేసుకున్నా, చేసుకోకపోయినా ప్రతి వాహనానికీ బీమా చేయడం తప్పనిసరి. ఈ ప్రీమియం కొన్నిసార్లు చాలామందికి భారంగా అనిపిస్తుంటుంది. ఈ మొత్తం తగ్గించుకోవడానికి కొన్ని మార్గాలున్నాయి. పాటిస్తే డబ్బులు మిగుల్చుకున్నట్టే.
ప్రమాదాలొద్దు: ప్రమాదం జరిగినప్పుడు నష్టపరిహారం రూపంలో ఆదుకుంటుందనే ఉద్దేశంతోనే కదా బీమా చేస్తారు. అలాంటిది మళ్లీ ప్రమాదం జరగకుండా చూసుకొమ్మని ఎలా చెబుతారంటారా? ఎందుకంటే క్లెయిం చేసుకోకపోతే బీమా రెన్యువల్‌ చేసేటప్పుడు అదనపు ప్రీమియం కట్టాల్సిన పన్లేదు. దీంతోపాటు వ్యయప్రయాసలెన్నో తప్పుతాయి. సమయం కలిసొస్తుంది. అన్నింటికీ మించి శారీరక గాయాల వల్ల కలిగే బాధ ఉండదు.
మినహాయించండి: బీమా క్లెయిం చేసుకుంటున్నప్పుడు వాహనానికయ్యే నష్టానికి పూర్తి పరిహారం ఎప్పుడూ దక్కదు. వాహనదారు సొంతంగా కొంత మొత్తం భరించాల్సి ఉంటుంది. దీన్నే డిడక్టబుల్‌ మొత్తం అంటారు. చిన్నచిన్న ప్రమాదాలు జరిగినప్పుడు క్లెయిం తీసుకోకుండా, డిడక్టబుల్‌ పెంచితే తర్వాత బీమా ప్రీమియం తగ్గుతుంది.
కంపెనీ మారొద్దు: ఇన్సూరెన్స్‌ ఎప్పుడూ ఒకే బీమా కంపెనీ దగ్గర చేయించాలి. దీర్ఘకాలికంగా తమతో ఉన్న వినియోగదారులను ఏ సంస్థా వదులుకోదు. రాయితీలు, ఆఫర్లు ఎక్కువగా ఇస్తుంటుంది. కంపెనీ మారకుండా ఉంటే నో క్లెయిం బోనస్‌ కవర్‌ చేసుకోవడం తేలిక.
అదనం వద్దు: ప్రమాదం జరిగినప్పుడు పూర్తిస్థాయిలో నష్టపరిహారం పొందాలనే ఉద్దేశంతో చాలామంది యాడ్‌ఆన్‌ బీమా చేయిస్తుంటారు. దీంతో ప్రీమియం మొత్తం పెరుగుతుంది. కొత్త వాహనాలకైతే ఫర్వాలేదుగానీ పాత వాహనాలకు రాన్రాను వాటి నిర్ణయాత్మక ధర తగ్గుతుంటుంది. ఈ పరిస్థితుల్లో యాడ్‌ఆన్స్‌తో భారం పెంచుకోవద్దు.

బేరమాడదాం: మార్కెట్లో బీమా కంపెనీలకు కొదవ లేదు. కొత్తగా వాహనం కొన్నప్పుడు, మొదటిసారి బీమా చేయిస్తున్నప్పుడు వాహనదారులకు ప్రీమియంపై అనేక రాయితీలు, ఆఫర్లు ఇస్తుంటాయి. బేరమాడితే ఆ మొత్తం మరింత తగ్గుతుంది.  
దొంగతనం నుంచి రక్షణ: కారు, బైక్‌ విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. భద్రత ఉన్న ప్రదేశాల్లోనే వాహనాలు నిలిపి ఉంచాలి. చోరీకి గురైనా వాహనం ఎక్కడుందో తెలిసేలా టెకాల్నజీ, యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిని సరిగ్గా వినియోగిస్తే తర్వాతి ప్రీమియంలో అదనపు చెల్లింపులు మిగులుతాయి.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు