close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @9 PM

1. తెరుచుకున్న పోలవరం టెక్నికల్‌ బిడ్లు

రివర్స్‌ టెండరింగ్‌ ప్రక్రియలో భాగంగా పోలవరం ఎడమ కాల్వ అనుసంధానం, సొరంగం పనుల్లో టెక్నికల్‌ బిడ్‌లను ఏపీ ప్రభుత్వం తెరిచింది. ఇనిషీయల్‌ బెంచ్‌మార్క్‌ విలువ రూ.274.55 కోట్లు కాగా.. మ్యాక్స్‌ ఇన్‌ఫ్రా సంస్థ 15.6 శాతం తక్కువగా కోట్‌ చేసింది. టెక్నికల్‌ బిడ్‌ విలువ ప్రకారం రూ.42.8 కోట్లను తక్కువగా ఆ సంస్థ కోట్‌ చేసింది. మరోవైపు ఈనెల 23న పోలవరం నిర్మాణానికి సంబంధించిన ఫైనాన్షియల్‌ బిడ్లను జలవనరుల శాఖ తెరవనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ‘రేవంత్‌ తీరుతో కాంగ్రెస్‌ గ్రాఫ్‌ పడిపోయింది’

మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి తీరును టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ కోదండరెడ్డి తప్పు భట్టారు. రేవంత్‌రెడ్డితో తీరుతో పార్టీ గ్రాఫ్ పడిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ప్రాంగణంలో కోదండ రెడ్డి మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. పార్టీ క్రమశిక్షణ కమిటీ సమావేశంలో రేవంత్ రెడ్డి వ్యవహారంపై చర్చించినట్లు చెప్పారు. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. అసెంబ్లీలో మొదటి రెండు రోజులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడిన తీరుతో పార్టీ గ్రాఫ్ పెరిగితే.. మూడో రోజు రేవంత్ రెడ్డి వచ్చి విద్యుత్ సమస్య మాట్లాడలేదని పేర్కొనడంతో పార్టీ  గ్రాఫ్ పడిపోయింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ప్రశ్నపత్రాల లీక్‌..భారీ కుంభకోణం:చంద్రబాబు

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల నియామకాల ప్రశ్నపత్రాల లీక్‌తో భారీ కుంభకోణం చేశారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. లక్షలాది మంది నిరుద్యోగులను దగా చేశారని.. వారి భవితకు ఉరేశారని ఆయన దుయ్యబట్టారు. ప్రశ్నపత్రాలు లీక్‌ అయ్యాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ట్విటర్‌లో చంద్రబాబు స్పందించారు. మోసపోయిన నిరుద్యోగులకు ఏ రకంగా న్యాయం చేస్తారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. గోదావరి దుర్ఘటన:బోటు యజమాని అరెస్ట్‌

గోదావరిలో బోటు దుర్ఘటన అంశంలో బోటు యజమానిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. రాయల్‌ వశిష్ఠ పున్నమి పర్యాటక బోటు యజమాని కోడిగుడ్ల వెంకటరమణను పోలీసులు అరెస్ట్‌ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. ప్రభావతి, అచ్యుతామణి అనే మహిళల పేరుతో బోటు రిజిస్ట్రేషన్‌ చేసినట్లు గుర్తించిన పోలీసులు.. వారిని కూడా అరెస్టు చేశారు. రంపచోడవరం ఏఎస్పీ వకుల్‌ జిందాల్‌ వెంకటరమణను మాత్రమే మీడియా ముందు ప్రవేశపెట్టారు. నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఏఎస్పీ చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. కోడెల ఆత్మహత్యపై హైకోర్టులో పిటిషన్‌

తెదేపా సీనియర్‌ నేత, మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ ఆత్మహత్యపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఏపీ రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్షుడు బూరగడ్డ అనిల్‌ కుమార్‌ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. కోడెలది ఆత్మహత్య కాదని.. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆయన గొప్ప వైద్యుడని, ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఆయనకు లేదన్నారు. సీబీఐ, తెలంగాణ ప్రభుత్వం, బంజారాహిల్స్‌ సీఐలను పిటిషనర్‌ ప్రతివాదులుగా చేర్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఆ సభ వాస్తవ పరిస్థితులను దాచలేదు: రాహుల్‌

దేశీయ కంపెనీలకు కార్పొరేట్‌ పన్నును తగ్గించిన నేపథ్యంలో ప్రధాని మోదీపై కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విమర్శలు చేశారు. దేశంలో సంస్థలకు పన్నులు తగ్గించిన మోదీ.. టెక్సాస్‌లో జరగబోయే తన కార్యక్రమం ‘హౌదీ మోదీ!’ కోసం ఎంత ఖర్చవుతుందని ప్రశ్నించారు. సెప్టెంబరు 22న హ్యూస్టన్‌లో ఈ కార్యక్రమం జరగనుండగా.. అమెరికాలో ఓ విదేశీ నాయకుడి సభకు అత్యధికంగా ఖర్చు పెట్టే కార్యక్రమం ఇదే అవుతుందని నిర్వహకులు చెప్పారన్నారు. రాహుల్‌ ట్వీటర్‌ ద్వారా మోదీని విమర్శించారు. ఈ ట్వీట్‌కు ‘హౌదీ ఇండియన్‌ ఎకానమీ’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. భారత్‌కు సాఫీగానే చమురు దిగుమతులు

భారత్‌కు చమురు దిగుమతుల విషయంలో ఎలాంటి ఆటంకం కలగనీయబోమని సౌదీ అరేబియా హామీ ఇచ్చింది. ఈ మేరకు ఆ దేశ చమురుశాఖ మంత్రి అయిన యువరాజు అబ్దుల్‌జీజ్‌ బిన్‌ సల్మాన్‌ స్పష్టం చేసినట్లు భారత పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. భారత అవసరాల మేరకు చమురు పంపిణీ సాఫీగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చినట్లు చెప్పారు. సౌదీలో ఇటీవల రెండు చమురు కేంద్రాలపై డ్రోన్‌ దాడులు జరిగిన నేపథ్యంలో చమురు ఉత్పత్తి కొంత తగ్గిన దృష్ట్యా ఆ ప్రభావం భారత దిగుమతులపై ఉంటుందని భావించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ‘భాజపా-శివసేన పొత్తు ఖాయమే’

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాతో పొత్తు ఖాయమని శివసేన కార్యదర్శి అనిల్‌ దేశాయ్ తెలిపారు. సెప్టెంబరు 22న భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా ముంబయికి రానున్నారని, ఈ సందర్భంగా పొత్తు ప్రకటన ఉంటుందని ఆయన తెలిపారు. సీట్ల సర్దుబాటు విషయంలో ఇరు పార్టీల మధ్య సయోధ్య కుదరడం లేదంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో అనిల్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ముంబయిలో శివసేనకు చెందిన పలువురు ప్రముఖ నాయకులతో శుక్రవారం ఆయన సమావేశం నిర్వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. లండన్‌లో ధనుష్‌ క్రేజ్‌ చూశారా..!

తమిళ నటుడు ధనుష్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారనే విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ కోసం ఆయన లండన్‌ వెళ్లారు. అయితే ఈ విషయం తెలుసుకున్న లండన్‌లోని ధనుష్‌ అభిమానులు షూటింగ్‌ జరుగుతున్న లోకేషన్‌కు భారీగా చేరుకున్నారు. అభిమానులను చూసిన ధనుష్‌ వారి వద్దకు వచ్చి కరచాలనం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఫైనల్‌కు చేరిన తొలి భారతీయుడు అతడే!

భారత బాక్సర్‌ అమిత్‌ పంగాల్‌ (52 కిలోలు) సరికొత్త చరిత్ర సృష్టించాడు. పురుషుల ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌కు చేరిన తొలి భారతీయుడిగా ఘనత సాధించాడు. సెమీస్‌లో అతడు కజక్‌స్థాన్‌కు చెందిన సాకెన్‌ బిబోసినోవ్‌ను 3-2తో ఓడించి అబ్బురపరిచాడు. శనివారం జరిగే ఫైనల్లో పంగాల్‌ ఉజ్బెకిస్థాన్‌ బాక్సర్‌ షాఖోబిదిన్‌ జొయిరోవ్‌తో స్వర్ణం కోసం తలపడనున్నాడు. బాక్సింగ్‌లో పంగాల్‌ స్వల్ప కాలంలోనే అద్భుతమైన ప్రగతి సాధించాడు. 2017 ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో 47 కిలోల విభాగంలో కాంస్యం కైవసం చేసుకున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు