close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
సైరా కోసం... వేల స్కెచ్‌లు!

పదకొండేళ్లకే మోడల్‌గా ర్యాంప్‌పై నడిచిన ఆమె... ప్రముఖ నటులకు స్టైలిస్ట్‌గా మారతానని ఊహించి ఉండదు. ఇష్టంగా ఈ రంగంలోకి వచ్చి... సృజనకు పదును పెట్టుకుంది. అంచెలంచెలుగా ఎదిగింది. ఆ కష్టమే ఆమెకు సైరాకు స్టైలిస్ట్‌గా పనిచేసే అవకాశాన్ని తెచ్చిపెట్టింది. ఆమే ఉత్తరా మేనన్‌. ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ మేనన్‌ చెల్లెలైన ఉత్తర ఈ రంగంలోకి ఎలా వచ్చిందో వసుంధరకు చెప్పుకొచ్చిందిలా...
భిరుచి మాత్రమే ఉంటే సరిపోదు. మన సత్తా నిరూపించుకోవడానికి వచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకోగలగాలి. కష్టాన్నే నమ్ముకున్న నేను  ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోగలిగా. మా అన్నయ్య ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ మేనన్‌. ఓ యాడ్‌ఫిల్మ్‌లో నేను రూపొందించిన దుస్తులు, స్టైలింగ్‌ చూసి తన తరువాతి తమిళ సినిమా ఎన్నై ఆరిందాల్‌లో పనిచేసే అవకాశం ఇచ్చారు. తెలుగులో ఇప్పటివరకూ మనం, శైలజారెడ్డి అల్లుడు, గ్యాంగ్‌లీడర్‌... వంటి ఎన్నో సినిమాలకు పనిచేసిన అనుభవం ఉంది. వాటన్నింటినీ చూసే దర్శకుడు సురేందర్‌ రెడ్డి ‘సైరా’కి స్టైలిస్ట్‌గా చేయమంటూ అవకాశం కల్పించారు. సినిమా గురించి తెలిశాక... ఆ పాత్రల ఆహార్యాన్ని మొదట బొమ్మల రూపంలో స్కెచ్‌లు వేసుకున్నాం. ఆ తరువాతే దుస్తుల డిజైనింగ్‌. ఇదయ్యాకే కాస్ట్యూమ్‌ డిజైనర్ల పని మొదలవుతుంది. ఈ సినిమాలో ప్రధాన పాత్రలకు అంజూమోదీ, సుస్మితా కొణిదెల కాస్ట్యూమ్‌ డిజైనర్లుగా పనిచేస్తే, నేను సినిమా మొత్తానికి స్టైలిస్ట్‌గా వ్యవహరించా.

చరిత్ర అధ్యయనం చేశా...

సినిమా కథ విన్న తరువాత ఆ పాత్రల వ్యక్తిత్వం ప్రతిబింబించేలా స్టైలింగ్‌ చేయాలి. ప్రతిపాత్ర దేనికదే ప్రత్యేకం. అప్పటి చరిత్ర కోసం పుస్తకాలు చదివా. మ్యూజియంలకూ వెళ్లా. స్థానిక ప్రాంతాలు తిరిగా. ఎన్నో విషయాలపై స్పష్టత వచ్చాకే...  ఒక్కో పాత్రకి అవసరమైన లుక్స్‌ని స్కెచ్‌ల రూపంలో సిద్ధం చేశా. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఫేషియల్‌ స్కిన్‌ ఎలా ఉండాలి... జుట్టు ఎలా కనిపించాలి.... తలపాగా పెట్టుకునే విధానం, షాల్‌ వేసుకునే తీరు... వాటికి  ఎలాంటి రంగులు వాడాలి... ఇలా అన్నింటినీ నేనూ, ప్రొడక్షన్‌ డైరక్టర్‌ రాజీవన్‌, కాన్సెప్ట్‌ ఆర్టిస్ట్‌ కలిసి రోజుల తరబడి చర్చించుకునేవాళ్లం. ఆరునెలల పాటు పనిచేసి వేలాది చిత్రాలు గీశాం.

టై అండ్‌ డై చేసి...

సినిమాలోని ప్రధాన పాత్ర ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లుక్‌ కోసం ఎంత కష్టపడ్డామో... అందులో ఉండే సుమారు పద్దెనిమిది వందల మంది గిరిజనుల ఆహార్యం తీర్చిదిద్దడానికి, వారికో ప్రత్యేకతను తీసుకురావడానికి అంతే శ్రమించాం. వీరిలో ఒక వర్గం పూర్తిగా మాంసాహారం తీసుకునే తెగగా కనిపిస్తారు. మరికొందరు ప్రకృతిపై ఆధారపడే సాత్విక స్వభావం గలవారు. అవన్నీ దృష్టిలో పెట్టుకుని డిజైన్‌ చేశాం. అలాగే అమితాబ్‌బచ్చన్‌, నయనతార, అదితీరావ్‌, విజయ్‌సేతుపతి, జగపతిబాబు, సుదీప్‌...లాంటి మరెందరో నటులకు సంబంధించిన లుక్స్‌ని స్కెచ్‌ల రూపంలో రూపొందించుకున్నాం. అక్కడితోనే మా పని అయిపోలేదు. కలర్‌ స్క్రీన్‌ కోసం ప్రొడక్షన్‌ డైరక్టర్‌, కెమెరామెన్‌లతో సరి చూసుకునేదాన్ని. తెలుగు, తమిళ రాష్ట్రాల్లో సాధారణంగా ముదురు, లేత రంగులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అలాంటివే ఎంచుకున్నా. ఇందుకోసం వాడిన దుస్తులన్నీ చెన్నై, హైదరాబాద్‌ల్లోనే కొన్నాం. వాటిని ప్రత్యేకంగా టై అండ్‌ డై చేసేవాళ్లం. బంగారు ఆభరణాలకు యాంటిక్‌, డల్‌ కలర్స్‌ వాడా. ఇది పూర్తిగా తెలుగు మూలాలున్న చిత్రం. అందుకే ఉత్తరాది శైలి ప్రభావం కనిపించకూడదని ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాం. ఆంగ్లేయుల పాత్రధారులకు అవసరమయ్యే  దుస్తులు, బెల్టులు, టోపీలు వంటివాటిని దిల్లీలోని పలు ప్రాంతాల్లో గమనించి... ఆ తరువాతే రూపొందించాం. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకలో చిరంజీవి నాకు ధన్యవాదాలు చెబుతుంటే ఆనందంగా అనిపించింది. ఆయన తరచూ ‘నేను మహారాజులా కనిపిస్తున్నా ఉత్తరా...’ అని అంటుంటే భలే అనిపించేది.

తెలుగులో నేను...

తెలుగు ఇండస్ట్రీలో నేను పనిచేసిన మొదటి సినిమా విక్రమ్‌ కె కుమార్‌ చేసిన మనం. అందులోని ఇంటి సెట్‌కి ఇంటీరియర్‌ డిజైనింగ్‌ చేశా. నిజానికి నేను చేసే పనికి అది భిన్నమైనా పూర్తిచేశా. అదొక్కటే కాదు... సాహసం శ్వాసగా సాగిపో, శైలజారెడ్డి అల్లుడు, నానీ గ్యాంగ్‌లీడర్‌ సినిమాలకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పనిచేశా. కథ, ఆ పాత్రలతో పాటు సెట్‌, అక్కడి వాతావరణాన్నీ అంచనా వేసుకున్నాకే డిజైన్‌, స్టైలింగ్‌ మొదలుపెడతా. అదే నాకు ప్రత్యేకత తెచ్చిపెడుతోంది.

హోటల్‌ పెడతా...

నాన్నది కేరళ. అమ్మది చెన్నై. నేను పుట్టిపెరిగినదంతా చెన్నైలోనే. హోటల్‌ మేనేజ్‌మెంట్‌ పూర్తిచేశా. కాస్ట్యూమ్‌ డిజైనింగ్‌ కోర్సూ చదివా. ఎప్పటికైనా హోటల్‌ పెట్టడం నా కల. నాకు చిన్నప్పటి నుంచీ ప్రత్యేకంగా తయారవ్వడం ఇష్టం. అంతా నా దుస్తుల్ని మెచ్చుకునేవారు. 11 ఏళ్ల వయసులో ఫ్యాషన్‌ రంగంలోకి అడుగుపెట్టి ర్యాంప్‌పై నడిచా. మా వారికి ప్రొడక్షన్‌ సంస్థ ఉంది. పెళ్లయ్యాక ఆయన తీసే ప్రకటనలకు నేను  స్టైలింగ్‌, డిజైనింగ్‌ చేసేదాన్ని. మిరిండా, 7 అప్‌ వంటి ప్రకటనలకు చేశా. ఆ తరువాతే  నాకు పలు అవకాశాలు వచ్చాయి. మొదటి సినిమాకే అవార్డునీ అందుకున్నా. నన్ను నేను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకుంటూ ముందుకు సాగడమే నా లక్ష్యంగా పెట్టుకున్నా.


మరిన్ని