close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ముంగిట్లోజెర్బరాల జిగేల్‌

బృందావనం

ఎరుపు, పసుపు, నారింజ, గులాబీ... ఇలా వివిధ వర్ణాల్లో ముద్దబంతి విచ్చుకున్నట్లుగా విరగబూస్తాయి జెర్బారా పూలు. ఈ మొక్కలు ఇంటి తోటకు కొత్త అందాన్ని తెస్తాయి. వీటిని పెంచుకునే విధానం తెలుసుకుందామా...

జెర్బారా... ఆకర్షణీయమైన పెద్ద పెద్ద పూలతో, పొడవైన గట్టి కాండంతో ఉండే అందమైన మొక్క. తక్కువ కాలంలో అందమైన ఏకరీతి పూలనిస్తుంది. ఇవి ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. వరండా, బాల్కనీ, తోట, బెడ్డింగ్‌ మొక్కలుగానూ వీటిని పెంచుకోవచ్ఛు విత్తనాల కన్నా టిష్యూ కల్చర్‌ మొక్కలు త్వరగా పూలనిస్తాయి.

మట్టి మిశ్రమం ఇలా: ఈ మొక్కకు ఎక్కువగా ఉప్పులేని మట్టి మిశ్రమం ఎంచుకోవాలి. తొమ్మిది నుంచి 15 సెం.మీ. వ్యాసార్ధం ఉన్న కుండీల్లో నాటాలి. మొదట్లో కుండీలను పక్కపక్కనే ఉంచాలి. నాలుగైదు వారాల తరువాత వాటి మధ్య దూరాన్ని పెంచాలి. మొక్క మొదలు నేలను తాకే ప్రాంతంలో కచ్చితంగా సూర్యరశ్మి పడితేనే మొగ్గలు వస్తాయి. లేదంటే పూత ఆలస్యమవుతుంది. ఆకులూ పొడుగ్గా పెరుగుతాయి. పగటిపూట ఉష్ణోగ్రత 22 నుంచి 24 డిగ్రీలు, రాత్రి 18 డిగ్రీలు ఉంటే మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది.

పోషణ ఇలా... మొదట్లో కొంత మొత్తంలో ద్రవరూపంలో నత్రజని, క్యాల్షియం, నైట్రేట్‌ అందించాలి. మొక్కలు పెరిగే కొద్దీ వీటి మోతాదు పెంచాలి. ఇనుము, మాంగనీస్‌ లాంటి సూక్ష్మధాతు లోపాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఆకులు పసుపు రంగులోకి మారిపోతాయి. బోరాన్‌ మూలకం లోపంతో చివర్లు ఎదగక ఆకులు ముడుచుకుంటాయి. ఈ లక్షణాలు గుర్తించిన వెంటనే సూక్ష్మధాతు మిశ్రమాన్ని పిచికారి చేయాలి. కుండీలో నాటిన తరువాత పన్నెండు నుంచి పద్నాలుగు రోజుల్లో గ్రాము డామినోజైడ్‌ లీటరు నీటిలో కలిపి మొక్కలపై చల్లితే పొడవు పెరగవు. ఇబ్బందులు... వేపనూనె లేదా వేపగింజల కషాయం పిచికారి చేస్తే... పాము పొడ, తామర పురుగులు, తెల్లదోమ, నల్లి పురుగులు అదుపులో ఉంచవచ్ఛు ఏడు నుంచి పదకొండు వారాల్లో మొక్కలు పూలు పూస్తాయి. మొక్కలు అస్తవ్యస్తంగా ఎదిగితే నల్లి లేదా తామర పురుగుల సమస్య ఉన్నట్లు గుర్తించాలి. అవి పొట్టిగా ఉన్నా లేదా మందకొడిగా పెరుగుతూ నీరు పోయే సౌకర్యం లేదని అర్థంచేసుకోవాలి. మట్టి చాలా గట్టిగా ఉన్నా, కుండీలో ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉన్నా ఇలా కావచ్ఛు.


మరిన్ని