close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఎండోమెట్రియోసిస్‌ ఎందుకొస్తుందంటే...

*  నెలసరి వస్తే చాలు... నొప్పితో విలవిల్లాడతారు కొందరు.
* కలయికను ఆస్వాదించలేని పరిస్థితి కొన్ని జంటలది.
* పెళ్లై ఏళ్లు గడుస్తున్నా పిల్లలు కలగని సమస్య మరికొందరిది.
వీటన్నింటికీ పరిష్కారం ఆలోచించే ముందు... ఎండోమెట్రియోసిస్‌ కారణమేమో గమనించుకోండి. అసలేంటీ సమస్య అంటే...

ముందుగా ఎండోమెట్రియం పొర గురించి తెలుసుకుందాం. ఇది ప్రతి స్త్రీ గర్భాశయం అంచుల్లో ఉంటుంది. ప్రతి నెలా నెలసరి సమయంలో రక్తస్రావం రూపంలో బయటకు వచ్చి మళ్లీ ఏర్పడుతుంది. ఇది నెలనెలా జరిగే సహజ ప్రక్రియ. కొన్నిసార్లు కొందరిలో ఈ పొర గర్భాశయంలో కాకుండా మరెక్కడైనా పెరగొచ్చు. ముఖ్యంగా అండాశయాలు, ఫెల్లోపియన్‌ ట్యూబులు, కాలేయం, జీర్ణకోశం, కటివలయ భాగాల్లో ఏర్పడుతుంది. దాన్నే ఎండోమెట్రియోసిస్‌ అంటారు. ఎక్కువశాతం అయితే... అండాశయాలు, జీర్ణకోశం మధ్యలో ఉండే రెక్టో వెజైనల్‌ సెప్టమ్‌లో పెరుగుతుంది. నెలసరి సమయంలో ఇలా ఇతర భాగాల్లో ఏర్పడిన పొర బయటకు రాదు. పైగా ఎప్పటికప్పుడు పెరుగుతూ, విరిగిపోతుంది. అలా విచ్ఛిన్నమైన పొర బయటకు వెళ్లే దారిలేక ఆ భాగాల్లోనే ఉండిపోతుంది. అదే రకరకాల సమస్యలకు దారితీస్తుంది. హార్మోన్లలో జరిగే మార్పులూ కొంతవరకూ తోడవుతాయి.

మళ్లీ మళ్లీ రావొచ్చు...
ఈ సమస్య సూపర్‌ఫీషియల్‌, డీప్‌ఇన్‌ఫిల్టరేటింగ్‌ అనే రకాల్లో ఉంటుంది. సూపర్‌ఫీషియల్‌ అంటే పైన పేర్కొన్న భాగాల్లో పైపొరల్లో మాత్రమే పొర ఏర్పడుతుంది. దాన్ని పూర్తిగా తొలగించేయొచ్చు. అదే డీప్‌ అయితే పూర్తిగా తీయడం చాలా కష్టం. ముందు సమస్యను గుర్తించేందుకు అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ చేస్తారు. సూపర్‌ఫీషియల్‌ అని తేలితే... లాపరోస్కోపీ పద్ధతిలో పేరుకొన్న ఎండోమెట్రియం పొరను తొలగిస్తారు. అదే డీప్‌ అయితే... ఆ పొర కుంచించుకుపోయేలా చేసేందుకు మందులు సిఫారసు చేస్తారు. పైగా ఆ మందుల్ని కొన్నేళ్లపాటు వాడాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ సమస్య మళ్లీమళ్లీ వచ్చే అవకాశం లేకపోలేదు.

మార్పులు చేసుకోవాలి...
నెలసరి, కలయిక పరంగా ఎదురయ్యే సమస్యల్ని చాలామంది నిర్లక్ష్యం చేస్తారు. అందరికీ మామూలేనని అనుకుంటారు. ఆ భ్రమలోనే ఉండిపోకూడదు. దీన్ని నిర్లక్ష్యం చేస్తే... సమస్య నాలుగో దశకు చేరుకుంటే క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉంటుంది. కటివలయ భాగంలో ఈ పొర ఏర్పడితే... అట్టకట్టుకుపోయినట్లు అవుతుంది. మూత్రపిండాల పనితీరుపైనా ప్రభావం పడుతుంది. పైగా ఈ సమస్య ఉన్న స్త్రీలకు సహజంగా గర్భం రాకపోవచ్చు.  ఐవీఎఫ్‌ పద్ధతిని ఎంచుకోవాల్సి ఉంటుంది. అయినప్పటికీ గర్భం వచ్చే అవకాశాలు తక్కువ. సమస్యను బట్టి చికిత్సతోపాటు వైద్యులు తీసుకోవాల్సిన ఇతర జాగ్రత్తల్నీ సూచిస్తారు. వాటిని పాటిస్తూనే జీవనవిధానం పరంగా కొన్ని మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా అధికబరువుంటే తగ్గించుకోవాలి. జంక్‌ఫుడ్‌ని పూర్తిగా మానేయాలి. ప్రతిరోజూ కనీసం అరగంట నుంచి ముప్పావుగంటసేపు వ్యాయామం చేయాలి. ఒత్తిడినీ అదుపులో ఉంచుకోవాలి.  నెలసరి పరంగా ఎదురయ్యే సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదు.

ఇవీ లక్షణాలు...

* మొదట కనిపించే మార్పు నెలసరి సమయంలో అసౌకర్యం. నెలసరికి ముందు భరించలేని నొప్పి వస్తుంది. ముఖ్యంగా కటివలయ భాగంలో నొప్పి ఎక్కువగా ఉంటుంది. అధికరక్తస్రావం కనిపిస్తుంది. అలసట, వికారం, కడుపు ఉబ్బరం, మలబద్ధకం, విరేచనాలు వంటి లక్షణాలూ ఎదురవుతుంటాయి.
*  పెళ్లైనవారిలో ఈ సమస్య ఎదురైతే గనుక... ఆ ప్రభావం లైంగికచర్యపై పడుతుంది. కలయిక అసౌకర్యంగా అనిపిస్తుంది. ఆ సమయంలో నొప్పీ ఉంటుంది. ఈ పొర అండాశయాల్లో పేరుకోవడం వల్ల అండాల నాణ్యత తగ్గుతుంది. అసలు అవి విడుదలా కాకపోవచ్చు. దాంతో గర్భం రాదు.
* మల, మూత్ర విసర్జన సమయంలోనూ నొప్పి బాధిస్తుంది.
* ఈ సమస్య ఏ వయసులో అయినా రావొచ్చు. మెనోపాజ్‌ దశలోనూ కనిపించొచ్చు. ఏ దశలోనైనా ఇబ్బంది పెట్టే ఎండోమెట్రియోసిస్‌ వల్ల ఆ స్త్రీ శారీరకంగానే కాదు మానసికంగానూ బాధపడుతుంది.

కొన్ని కారణాలు...

* నెలసరి సమయంలో అయ్యే రక్తస్రావం కొన్నిసార్లు ఫెల్లోపియన్‌ ట్యూబులు, కటివలయ భాగానికి చేరుకోవచ్చు. హిస్టెరెక్టమీ, సిజేరియన్‌ చేస్తున్నప్పుడు ఎండోమెట్రియం కణాలు ఇతర భాగాల్లోకి చొచ్చుకుపోయే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు ఏ కారణం లేకుండానే ఆ కణాలు శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించొచ్చు. జన్యుపరంగానూ ఇలా కావొచ్చు. ఈస్ట్రోజెన్‌ హార్మోను ప్రభావంతోనూ ఈ సమస్య ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

మరిన్ని