close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
మహిళా సహకార దీపం!

బ్యాంకు ఉద్యోగాన్ని సైతం వదులుకొని ఇష్టంతో సామాజిక సేవవైపు వెళ్లిందామె. ఆ కార్యక్రమాలను గుర్తించిన జౌళి మంత్రిత్వ శాఖ మహిళలకు చేనేత కళలపై శిక్షణ ఇవ్వమంటూ ఓ ప్రాజెక్టుని అప్పజెప్పింది. అప్పుడే జ్యూట్‌ ఉత్పత్తుల గురించి తెలుసుకుని సొంతంగా ఓ తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. ఇప్పుడు వాటిని పెద్ద మొత్తంలో తయారు చేసేందుకు ఓ సహకార సంఘాన్నే స్థాపించింది. ఆమే దీపా దూర్జటి. ఈ రంగంలో మహిళలతో స్థాపించిన మొట్టమొదటి కో-ఆపరేటివ్‌ సొసైటీ ఇదే. ఆమె తన ప్రయాణాన్ని వివరిస్తోందిలా...

నేను పుట్టి, పెరిగిందంతా విజయవాడలో. నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పూర్తి చేశా. కొన్నాళ్లు బ్యాంకులో ఉద్యోగం చేశా. మొదటినుంచీ మహిళలకు ఏదైనా చేయాలని ఉండేది. దాంతో ఉద్యోగం వదిలేసి కొన్నాళ్లు ఎన్జీవోలతో కలిసి పనిచేశా. ఈ క్రమంలోనే జౌళి మంత్రిత్వ శాఖ నుంచి గ్రామీణ మహిళలకు జనపనార, హస్తకళ, చేనేత ఉత్పత్తులపై శిక్షణ అందించే ప్రాజెక్టు వచ్చింది. దానికి మేనేజరుగా మూడేళ్లు వివిధ ప్రాంతాల్లో కార్యక్రమాలు రూపొందించా. దాదాపు 300 మందికి శిక్షణ ఇచ్చాం. అప్పుడే నాకు జనపనార ఉత్పత్తుల గురించి పూర్తిగా తెలిసింది. నావంతుగా కొంతమంది మహిళలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో 2016లో హైదరాబాద్‌లోని మైత్రీవనం సమీపంలో జ్యూట్‌ ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని ప్రారంభించా. ఇప్పుడు అక్కడ 12 మంది పనిచేస్తున్నారు.

సహకార సంఘం ఆలోచన వచ్చిందిలా... జనపనార పంట కొనుగోళ్లు, అమ్మకాలను కోల్‌కతాలోని నేషనల్‌ జ్యూట్‌ బోర్డు పర్యవేక్షిస్తుంది. జ్యూట్‌ ఉత్పత్తులకు కావాల్సిన ముడి సరకును ఎవరైనా జ్యూట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(జేసీఐ) నుంచే తీసుకోవాలి. ఒకానొక సందర్భంలో నాలాంటి చిన్న తయారీ కేంద్రాలకు ముడి సరకు లభించడం కష్టంగా మారింది. దీంతో చిన్న యూనిట్లన్నీ కలిపి ఓ సహకార సంఘాన్ని ఏర్పాటు చేసుకోమని నేషనల్‌ జ్యూట్‌ బోర్డ్‌ వారు సలహా ఇచ్చారు. జ్యూట్‌ కార్పొరేషన్‌ ఆర్డర్లన్నీ సహకార సంఘాలకే ఇస్తారని వివరించారు. ఎక్కువ మొత్తంలో ఉత్పత్తులను తయారు చేయడంతో పాటు, వీలైనంత ఎక్కువమంది మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించొచ్చనే ఉద్దేశంతో సహకార సంఘం ఏర్పాటు చేయాలనుకున్నా. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటకలోని జ్యూట్‌ ఉత్పత్తుల కర్మాగారాలను సంప్రదించా. చివరకు 157 మంది సభ్యులతో ‘ప్రభావన మల్టీస్టేట్‌ విమెన్‌ జ్యూట్‌ అండ్‌ ఫైబర్‌ ప్రొడక్ట్స్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ’ని ఏర్పాటు చేశాం. పదిహేడు మందిని బోర్డు సభ్యులుగా ఎన్నుకున్నాం. జాతీయ కో-ఆపరేటివ్‌ చట్టం కింద మా సంస్థను నమోదు చేయడానికి సంవత్సరం పాటు కష్టపడ్డాం. దీని ఏర్పాటులో నాకు సాయం చేసిన కవిత బోయినపల్లి సంస్థకు ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. మా సొసైటీ కింద మూడు రాష్ట్రాల్లో కలిపి రెండొందల మంది మహిళలు పనిచేస్తున్నారు. కొంతమంది గ్రామీణ మహిళలకు ఇంటి నుంచే పనిచేసుకునే సదుపాయం కల్పిస్తున్నాం. వారంలో వారెన్ని జ్యూట్‌ బ్యాగులు తయారు చేయాలో చెప్పి, అందుకు అవసరమైన ముడి సరకును అందిస్తాం. యంత్రాలతో ఉత్పత్తులను తయారుచేస్తే సులువుగానే లక్షలు సంపాదించవచ్చు. కానీ మా లక్ష్యం అది కాదు. మహిళలకు ఉపాధి అవకాశాలను విస్తృతం చేయాలనే ఆలోచనతో చేతితో తయారు చేసేలా ప్రోత్సహిస్తున్నాం.

టీటీడీ ఆర్డరు... తిరుమల కొండపై ప్లాస్టిక్‌ వినియోగానికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించిన తిరుమల తిరుపతి దేవస్థానం వారు... జ్యూట్‌తో ప్రసాదం కవర్లను తయారుచేసి ఇవ్వమని జేసీఐని సంప్రదించారు. లోపలి వైపు అల్యూమినియం కాగితపు పొర ఉండే సంచులను ఆహార పదార్థాలను నిల్వచేయడానికి వాడొచ్చని వారు ప్రతిపాదించి వీటి తయారీ బాధ్యతను మాకిచ్చారు. ఇందుకు అవసరమయ్యే ముడిసరకుని వారే అందిస్తారు. ఉత్పత్తులు సిద్ధమయ్యాక వాటిని తితిదేకు సరఫరా చేస్తాం. ప్రస్తుతం ప్రసాదాల కోసం రోజూ ఇరవై వేల జ్యూట్‌ కవర్లు, సంచులను తయారు చేస్తున్నాం. పైలెట్‌ ప్రాజెక్టు కింద ఇప్పటికే వివిధ పరిమాణాల్లో ఉన్న ప్యాకెట్లను పంపించాం. వినియోగదారుల ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా వీటిల్లో మార్పులు చేసే పనిలో ఉన్నాం. మేం వారికి అందించిన పెద్ద సైజు జ్యూట్‌ బ్యాగులో 25 లడ్డూలు పడతాయి. దీని కనీస జీవిత కాలం ఒక సంవత్సరం ఉంటుంది. తితిదేలో రోజుకు లక్ష వరకు ప్రసాదం కవర్లు అవసరమవుతాయి.

సామాజిక సేవలో... ఇంతకు ముందే పలు ఎన్జీవోలతో కలిసి పనిచేసిన అనుభవం ఉంది. మూగ, చెవిటి వాళ్లతో జ్యూట్‌ బ్యాగులు తయారు చేయించి, వాటికి పెయింటింగ్‌లు వేయించి నేరుగా వినియోగదారులకు అందిస్తున్నాం. పుట్టపర్తి సేవాట్రస్టు కింద మహిళలకు ఉచితంగా ఉపాధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. బాలనారాయణ సేవ కింద దాదాపు 300 మందికి పోషకాలుండే అల్పాహారాన్ని ఉచితంగా అందిస్తున్నాం. ద్వీప అనే పేరుతో మాకు ఓ స్వచ్ఛంద సంస్థ ఉంది. మా సహకార సంఘం బోర్డు సభ్యుల సాయంతో దీని ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతున్నాం. మావారు బ్యాంకు మేనేజరు. నేను ఉద్యోగం వదిలేసి సామాజిక సేవపైపు వెళ్తానని ఇంట్లో చెప్పినప్పుడు వద్దని వారించారు. నేను మొదలు పెట్టిన కార్యక్రమాలు విజయవంతం కావడంతో ఐఎస్‌బీ నుంచి ఉపకార వేతనం వచ్చింది. అప్పటి నుంచీ నా ఆలోచనలకు, అభిప్రాయాలకు అందరూ విలువ ఇవ్వడం మొదలుపెట్టారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే పదహారేళ్లుగా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నా.


మరిన్ని