close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
గుర్రంపై అందాల పోటీలకు!

ఇష్టంతో పోలో నేర్చుకున్న ఆమె... ఆ క్రీడను ఆధారం చేసుకుని అందాల పోటీలకు వెళ్లింది. అక్కడితో ఆగిపోకుండా పేద విద్యార్థినులకు డిజిటల్‌ విద్యపై అవగాహన కల్పిస్తోంది. ఆ సేవకే ఐక్యరాజ్యసమితి నుంచి ప్రశంసలు అందుకుంది. ఆమే హైదరాబాద్‌కు చెందిన ఆర్ణిత దంపరాల.

అందాల పోటీలంటే బికినీ ప్రదర్శనలు, నడుము కొలతలే కాదు... సామాజిక ప్రయోజనాలూ ఉంటాయి. అలాంటివే నేను వెళ్లిన అందాలపోటీలు. పోలో కష్టమైనా... నా ఆసక్తిని చూసి అమ్మానాన్నలు ప్రోత్సహించారు. దాంతోపాటు అందాలపోటీలన్నా ఇష్టమే. కొన్నాళ్లక్రితం స్నేహితులతో కలిసి మిస్‌ ఇంటర్నేషనల్‌ సౌత్‌ జోన్‌ పోటీల్లో పాల్గొని గెలిచా. ఆ తరువాత పలు అంతర్జాతీయ అందాల పోటీలకు వెళ్లే అవకాశాలు వచ్చాయి. అందులో మిస్‌ టూరిజం ఒకటైతే, తాజాగా జరిగిన పోలో ఇంటర్నేషనల్‌ బ్యూటీ పీజెంట్‌ మరొకటి. రెండోదాంట్లో పోలో ఆట భాగం కావడం, సేవ చేసే అవకాశమూ ఉండటంతో ఈ పోటీలకు వెళ్లాలనుకున్నా. ఇది ఈ మధ్యే దుబాయ్‌లో జరిగింది. దానికోసం పోలో క్రీడలో మరిన్ని నైపుణ్యాలు పెంచుకున్నా. దీనికి 97 దేశాల నుంచి ప్రాతినిధ్యం వహించారు. సేవా చేయాలి కాబట్టి... ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థినులకు డిజిటల్‌ విద్యపై అవగాహన కల్పించేందుకు సిద్ధమయ్యా. ఈ పోటీల వెనుకున్న ప్రధాన లక్ష్యమే సేవ, పోలోక్రీడపై ప్రచారం. ఇవన్నీ విజయవంతం చేసినందుకే ఐక్యరాజ్య సమితి ప్రశంసాపత్రం అందించింది.

సేవను కొనసాగిస్తున్నా... పోటీలు అయిపోయినా నా కార్యక్రమాల్ని కొనసాగిస్తున్నా. దానికి కారణం నా కుటుంబనేపథ్యమే. చిన్నప్పటి నుంచీ అమ్మ తాను నిర్వహించే సేవా కార్యక్రమాల్లో నన్నూ భాగం చేసేది. అవకాశం ఉన్నప్పుడల్లా అనాథాశ్రమాలకు తీసుకెళ్లేది. ఇవన్నీ నాపై ప్రభావం చూపించాయి. అందుకే ఈ పోటీల్లో భాగంగా డిజిటల్‌ లిటరసీ పెంచేందుకు ప్రభుత్వ పాఠశాలలను ఎంచుకున్నా. ప్రస్తుతం మేడ్చల్‌, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు డిజిటల్‌ పాఠాలు ఎంత వరకు అవసరం, వారు దాన్ని అందిపుచ్చుకోవడానికి ఎదురవుతోన్న సవాళ్లు వంటివి అధ్యయనం చేస్తూనే, సులువుగా ఎలా ఉపయోగించుకోవచ్చో పిల్లలకు నేర్పుతున్నా. నాన్న సతీష్‌ ఆంధ్రాబ్యాంక్‌ మేనేజర్‌గా చేసేవారు. అమ్మ కుముదా దేవి గృహిణి. నేను హైదరాబాద్‌ జేెఎన్‌టీయూలో బీటెక్‌ పూర్తి చేశా. ఎంబీఏ దూరవిద్యలో చదివా. భవిష్యత్తులో వ్యాపారవేత్త కావాలన్నది నా కల.


మరిన్ని