close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
నానమ్మ, తాతల ఆస్తిపై నా పిల్లలకు హక్కుంటుందా?

నాకు రెండున్నరేళ్ల క్రితం  పెళ్లయింది. ఒక బాబు. సంవత్సరం నుంచి నేను, నా భర్త వేరువేరుగా నివసిస్తున్నాం. మేం విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నాం. అతని పేరు మీద ఎటువంటి ఆస్తులు లేవు. వాళ్ల అమ్మానాన్నల పేరు మీద ఉన్నాయి. మా అత్తగారు ఏడేళ్ల క్రితం  మరణించారు. విడాకులు తీసుకున్న తరువాత అత్తమామల పేరు మీద ఉన్న ఆస్తులపై  నా కొడుక్కి హక్కు ఉంటుందా. సలహా ఇవ్వగలరు?

-ఓ సోదరి

తప్పకుండా ఉంటుంది. మీరూ మీ భర్త తీసుకునే విడాకులు... మీ సంసార జీవితానికి ముగింపు పలుకుతాయి. కానీ, మీ పిల్లల వారసత్వ హక్కుల విషయంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీ అత్త, మామల పేరు మీద ఉన్న ఆస్తులు ఉమ్మడిగా ఉన్నాయా? విడివిడిగానా అన్నది తెలుసుకోండి. హిందూ వారసత్వచట్టం 1956 ప్రకారం స్త్రీ,పురుషుల వారసత్వ హక్కులు ప్రత్యేకంగా ఉన్నాయి. ఈ చట్టంలోని సెక్షన్‌ 8 ప్రకారం పురుషులు వీలునామా రాయకుండా చనిపోతే అతడి ఆస్తి ఎవరెవరికి చెందుతుంది అనేది తెలియజేస్తుంది. సెక్షన్‌ 15... ఓ మహిళ తనకి సంబంధించిన ఆస్తులకు వీలునామా రాయకుండా చనిపోతే అవి ఎవరెవరికి చెందాలో ఇందులో వివరించి ఉంటుంది. పిల్లలు అంటే కొడుకులకు, కూతుళ్లుకు మొదటగా ఆస్తి పంచుకునే హక్కు ఉంటుంది. మీ భర్తకి వచ్చే వాటాలో మీ పిల్లలకూ భాగం ఉంటుంది. దానికోసం మీరు భాగస్వామ్యం కోరుతూ కోర్టులో సూట్‌ దాఖలు చేయాల్సి ఉంటుంది. మీరు విడాకులు తీసుకునేటప్పుడే ఆస్తి వాటాల గురించి స్పష్టంగా ఒక ఒప్పందం చేసుకుంటే బావుంటుంది. ఎందుకంటే పిల్లలకి అన్యాయం జరగకూడదు. మళ్లీ మీరు భవిష్యత్తులో ఆస్తి కోసం కోర్టు మెట్లు ఎక్కాల్సిన అవసరం లేకుండా చూసుకోవాలి. మైనర్‌ల ఆస్తుల్ని ముట్టుకోవడానికి తల్లిదండ్రులకి సైతం కోర్టు అనుమతి కావాలి. ముందు ఓ మంచి లాయర్‌ని సంప్రదించి అడుగులు వేయండి.

మీ ప్రశ్నలు vasulegal@eenadu.com కు పంపించగలరు.


మరిన్ని