close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఎక్కడైనా రాములమ్మనే!

నవ్వితే... అందరి దృష్టి తిప్పుకోవడానికన్నారు. కాస్త దూకుడుగా మాట్లాడితే... ఆటలు సాగడం లేదని కామెంట్లు చేశారు. మిన్నకుంటే... ఏదో ప్లాన్‌ చేస్తోందని అనుమానించారు.  మాట్లాడితే... అరిచినట్టుందన్నారు. అరిస్తే... అక్కడికెక్కడికో వినిపిస్తుందన్నారు.  బిగ్‌బాస్‌- 3 హౌజ్‌లో శ్రీముఖి 105 రోజుల ప్రస్థానమిది. కానీ, ఇన్ని రోజులూ ఆ షోను ఫాలో అయిన ప్రేక్షకులు మాత్రం... ఆమె ఆమెలాగే ఉందనుకున్నారు. తనలాగే ఆడుతోందనుకున్నారు.  టైటిల్‌ గెలవకపోయినా... కోట్ల మంది హృదయాలను గెలిచానని చెబుతున్న శ్రీముఖి బిగ్‌బాస్‌ హౌజ్‌లో తన అనుభవాలను ‘వసుంధర’తో ప్రత్యేకంగా పంచుకుందిలా...

* టైటిల్‌ గెలవలేకపోయినందుకు బాధపడుతున్నారా?
గెలుపోటములు సహజం. కాకపోతే ఓడిపోవడం ఎవరికీ ఇష్టం ఉండదు. నాకూ అంతే. ఫైనల్‌కి చేరుకోవడం అంత సులువైన విషయం కాదు. బిగ్‌బాస్‌ ఇంట్లో ది బెస్ట్‌ పెర్ఫార్మర్‌గా అందరి మనసుల్నీ గెలుచుకోగలిగానని బయటకు వచ్చాకే అర్థమైంది. శక్తిమంతమైన మహిళగా చివరిదాకా విజయం కోసం పోరాడాలనుకున్నా. ఈ విషయంలో నాకు బాబా మాస్టరే స్ఫూర్తి. ‘గెలిస్తే అక్కడితో సరిపెట్టేసుకుంటాం. ఓటమి లక్ష్యంపై కసిగా దృష్టిపెట్టే శక్తినిస్తుంది...’ అని చెప్పేవారు. చిరంజీవి సర్‌ సైతం... ‘నువ్వు టైటిల్‌ గెలవకపోయినా... కోట్లాదిమంది మనసులు గెలుచుకున్నావు...’ అని చెప్పడం ఆనందంగా అనిపించింది.

* ఈ ప్రయాణం తరువాత శ్రీముఖి ఎలా ఉండబోతుంది?
విశ్రాంతి కోసం మాల్దీవులకు వెళ్తున్నా. కొన్నిరోజులు కుటుంబంతో గడుపుతా. తరువాత ఎప్పటిలానే షోలు కొనసాగిస్తా. బిగ్‌బాస్‌ వల్ల నాలో కోపం చాలావరకూ తగ్గింది. ఓపిక పెరిగింది. సవాళ్లను తీసుకునే సామర్థ్యం, ఆత్మవిశ్వాసం బలపడ్డాయి. ప్రేక్షకుల అంచనాలను చేరుకునే పెద్ద బాధ్యత నాపై ఉంది. దాన్ని నేను నిర్వర్తిస్తా. బిగ్‌బాస్‌ జీవిత పాఠాలెన్నో నేర్పించింది. ఆ ఇంటి గుర్తుగా టాటూ నాతో పాటు చివరివరకూ ఉంటుంది. నా వ్యక్తిత్వాన్ని మరింతగా మెరుగుపరుచుకోవడానికి ఈ ప్రయాణం ఎంతగానో తోడ్పడింది.

* భిన్న నేపథ్యాలు ఉన్న వ్యక్తులతో కలిసిపోవడంలో మీకెలాంటి సవాళ్లు ఎదురయ్యాయి?  
తెరపై కనిపించేవాళ్లు... తెరవెనుక ఎలా ఉంటారనేది చూడాలనుకుంటారు ప్రేక్షకులు. అందుకే వేర్వేరు నేపథ్యాలున్న వ్యక్తులను ఒకే ఇంట్లో ఉంచారు. సున్నా నుంచి మొదలుపెట్టి మనమేంటో నిరూపించుకోవడమే బిగ్‌బాస్‌. అక్కడ నేను నాలానే ఉండాలనుకున్నా. అందరినీ కుటుంబ సభ్యుల్లా భావించా. గెలుపోటముల గురించి ఆలోచించలేదు. నాకు ఆత్మవిశ్వాసం ఎక్కువని అనుకున్నా... కచ్చితంగా పదిహేను వారాలూ  అక్కడ ఉండగలనని నమ్మా. ఆ శక్తి, సామర్థ్యాలు నాకున్నాయని అనిపించింది. తిండి, నిద్ర తక్కువైనా ఓర్చుకోగలను. వృత్తిపరంగా నాకంటూ సొంత వ్యక్తిత్వం ఉండటంతో ఇంటిసభ్యులందరినీ సమన్వయం చేయగలనా అని మాత్రం అనుకున్నా. నొప్పించకుండా చెప్పడం, ఎప్పుడూ ఉత్సాహంగా కనిపించడం, గొడవలు వచ్చినా సర్దుకుపోగలగడం వంటివన్నీ అక్కడే అలవాటు చేసుకున్నా. బహుశా ఇవన్నీ నాకు అత్తింట్లో కలిసిపోవడానికి కావలసినంత అనుభవాన్నిచ్చాయని అనుకుంటున్నా.

* బిగ్‌బాస్‌ హౌజ్‌ నుంచి ఏమైనా కోల్పోయానని అనుకుంటున్నారా?
మొదట్లో రోజులు ఎంత త్వరగా గడిచిపోతాయా అనిపించేది. చివరికి వచ్చేసరికి... బిగ్‌బాస్‌ మాటల్ని, ఆ వంటగదిని, బాబా మాస్టర్‌ని... ఇలా చాలానే మిస్సవుతానని అనిపించేది. ఫోను సౌకర్యం, బాహ్యప్రపంచంతో సంబంధాలు ఉండేవి కావు. క్రమంగా ఒక్కొక్కరుగా ఎలిమినేట్‌ అవుతుంటే తెలియని బాధ మొదలయ్యింది.

* ఇప్పుడేమనిపిస్తోంది?
గెలుపోటములతో సంబంధం లేకుండా నన్ను ఇంతమంది అభిమానిస్తున్నారని తెలిసి ఆశ్చర్యపోయా. ఒకప్పుడు నాది చిన్న కుటుంబం. ఇప్పుడు నాకో పెద్ద అభిమాన కుటుంబమే ఉంది. గెలిస్తే... శుభాకాంక్షలు మాత్రమే చెప్పేవారేమో! నన్ను కలిసినవాళ్లంతా నాలో ఏం నచ్చిందో చెబుతోంటే సంతోషంగా ఉంది.

* బిగ్‌బాస్‌ హౌజ్‌లో మీ బెస్ట్‌ ఫ్రెండ్‌ ఎవరు?
బాబా భాస్కర్‌. ఆయన ఓ అద్భుతమైన వ్యక్తి. శ్రీముఖికి ఆయన మేల్‌వర్షన్‌. మా ఇద్దరి మనస్తత్వాలు ఒకేలా ఉంటాయి. ఇద్దరం ఆహార ప్రియులం. వంట చేయడం, డ్యాన్స్‌... మా ఇద్దరికీ ఇష్టమే. మా జోడీని  ప్రేక్షకులూ ఇష్టపడ్డారని బయటకి వచ్చాకే తెలిసింది.

* రాహుల్‌తో గొడవ గురించి?
నాకు రాహుల్‌తో ఇంతకుముందే పరిచయం ఉంది. ఆ ఇంట్లో మా మధ్య జరిగిన కొన్ని విషయాలకు నొచ్చుకున్నా... వాదనలకు దిగకుండా పరిణతితో వ్యవహరించాలనుకున్నా. టాస్క్‌లు, సందర్భాలు... సమస్యలకి ఆజ్యం పోయడం మామూలే. రాహులే కాదు...మిగిలిన పదిహేనుమంది ఇప్పుడు ఎక్కడ కనిపించినా సరే... ఆ ఇంట్లో ఎలా ఉన్నానో... అలాగే మాట్లాడతా.

* కొడుకు గెలిచినా... మీరంటే ఇష్టమన్న రాహుల్‌ తల్లి మాటల్ని మీరెలా స్వీకరిస్తారు?
థ్యాంక్స్‌ ఆంటీ! ఒక్కొక్కరికీ ఒక్కో అంశం నచ్చొచ్చు. నేను చేసే అల్లరి ఆవిడకి ఇష్టం అని హౌజ్‌లోకి వచ్చినప్పుడే ఆమె చెప్పారు.

* మీరు కాకపోతే ఎవరు గెలవాలనుకున్నారు?
నేను లేదంటే బాబాభాస్కర్‌ గెలవాలనుకున్నా. భవిష్యత్తు సీజన్‌లలో అయినా అమ్మాయిలు గెలిస్తే చూడాలనుకుంటున్నా. 

* యాంకరింగ్‌లోకి ఎలా వచ్చారు?
ఓసారి ఈటీవీలో ప్రసారమయ్యే హోం మినిస్టర్‌ కార్యక్రమం షూటింగ్‌ మా ఇంట్లో జరిగింది. ఆ ప్రోగ్రాం డైరెక్టర్‌ నన్ను చూసి నాన్నతో ‘మీ అమ్మాయితో యాంకరింగ్‌ చేయిస్తారా?’ అని అడిగారు. నాన్న మొదట ఒప్పుకోలేదు. వాళ్లు మళ్లీ అడగడంతో ఒకే ఒక్క షో చేస్తా అంటూ... ఆయన్ని ఒప్పించాం. అలా అదుర్స్‌ కార్యక్రమంతో నా ప్రయాణం మొదలైంది. 

* మీ కుటుంబం గురించి...
నాన్న రామ్‌కిషన్‌ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌. మాది నిజామాబాద్‌. అమ్మ లత బ్యూటీషియన్‌. నాకో తమ్ముడు శుశ్రుత్‌. నా వృత్తిరీత్యా నేను హైదరాబాద్‌లో ఉంటున్నా. తమ్ముడు నాకు తోడుగా ఉంటాడు. బిగ్‌బాస్‌కి వెళ్లాక... నాకు వాళ్ల విలువ, వాళ్లకి నా విలువ బాగా తెలిసింది. నాన్న అంతర్ముఖులు. ఆయన స్టేజిమీద నన్ను చూసి అంత ఓపెన్‌గా మాట్లాడతారని అనుకోలేదు. అమ్మ, తమ్ముడు నా స్నేహితులు. నేను నామినేట్‌ అయిన ప్రతిసారీ ఎంతో టెన్షన్‌ పడ్డారు. ట్రోలింగ్‌నీ ఎదుర్కొన్నారు. నాతో పాటు వాళ్లూ ఇప్పుడు ఎంతో ధైర్యంగా మారారు.

* చిన్నప్పటి నుంచీ మీరు ఇలానే అల్లరి చేసేవారా?
అస్సలు కాదు. చిన్నప్పటి నుంచీ నాకు చదువే ప్రపంచం. డాక్టర్‌ కావాలనుకున్నా. పది, ఇంటర్‌లో తొంభైశాతానికి పైగా మార్కులు వచ్చాయి. బీడీఎస్‌లో సీటూ వచ్చింది. అది చేస్తున్నప్పుడే యాంకరింగ్‌ అవకాశం రావడంతో దాన్ని మధ్యలోనే వదిలేశా. అన్నీ అనుకున్నట్లు జరిగితే అది జీవితం కాదు కదా! 

* తెలుగు గలగలా ఎలా మాట్లాడగలుగుతున్నారు?
చిన్నప్పటి నుంచీ టీవీ, సినిమాలు చూడటం తక్కువే. స్థానిక తెలుగు యాస మాట్లాడేదాన్ని. యాంకరింగ్‌లోకి అడుగు పెట్టడానికి ముందు నాన్న తెలుగు భాషపై పట్టు రావాలంటే పత్రికలు చదవాలని చెప్పేవారు. రోజూ ఉదయాన్నే నాతో  Ÿఈనాడు పేపర్‌ చదివించేవారు. 

* డ్యాన్స్‌ అంటే పిచ్చి. అర్ధరాత్రి బీట్‌ వినిపించినా...ఆగలేను.  
* టాస్క్‌లన్నీ ఇష్టంగా చేసినా... శివజ్యోతిని ఏడిపించాల్సి వచ్చినప్పుడు మాత్రం ఇబ్బంది పడ్డా. అది నాకు ఇష్టం లేకపోయినా చేశా.
* నేను చక్కగా వంట చేస్తా. నా పనులే కాదు... ఇంటిల్లపాదీ పనులూ చేయగలను.

మరిన్ని