close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
చలిలో... చక్కటి చర్మానికి

కాసేపు ఎండలోకి వెళ్లినా... కొందరు మహిళల చర్మం కమిలిపోయినట్లు అవుతుంది. కాంతిని కోల్పోతుంది.  ఇలాంటి వారి చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే...  కొన్ని సహజ ఫేస్‌ప్యాక్‌లను ప్రయత్నించాలి.
* బొప్పాయి పండులో ఉండే ఎంజైములకు చర్మం రంగును మెరుగుపరిచే గుణం ఉంటుంది. ఈ పండును క్రమం తప్పకుండా తినడంతోపాటు, రెండురోజులకోసారి దీని గుజ్జును ముఖానికి రాసుకోవాలి. ముఖచర్మం ఆరోగ్యంగా ఉంటుంది.  

* ముల్తానీమట్టిలో నిమ్మరసం, గులాబీనీరు కలిపి ముఖానికి పూతలా వేసుకోవాలి. ఆరిపోయిన తరువాత కడిగేసుకుంటే మృతకణాలు తొలగిపోతాయి. జిడ్డుచర్మతత్వం ఉన్నవారు దీన్ని క్రమంతప్పకుండా ప్రయత్నిస్తే మార్పు కనిపిస్తుంది. వాతావరణం మరీ చల్లగా ఉన్నప్పుడు ముల్తానీమట్టితో పూత వేసుకోకూడదు. చర్మం పొడిబారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
* పాలు, తేనెను సమపాళ్లలో కలిపి ముఖానికి రాసుకోవాలి. కాసేపు మర్దన చేసి... ఆరిన తరువాత చల్లని నీటితో కడిగేస్తే చర్మం ఆరోగ్యంగా మారడంతో పాటు మెరుపునూ సంతరించుకుంటుంది. పాలు సహజ క్లెన్సర్‌గా పనిచేస్తే... తేనె బ్యాక్టీరియా ను నివారిస్తుంది. చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.
* బంగాళాదుంపరసంలో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇది సహజ బ్లీచ్‌లా పనిచేసి, చర్మాన్ని శుభ్రపరుస్తుంది. కమిలిపోకుండా కాపాడుతుంది. బంగాళాదుంప ముక్కలపై నిమ్మరసం వేసి ముఖానికి మర్దన చేసుకున్నా ఫలితం ఉంటుంది.
* బాదం నూనెలో ఎ, డి, ఇ విటమిన్లు ఉంటాయి. ఇవి చర్మ రంగును మెరుగుపరుస్తాయి. అరటిపండు గుజ్జులో బాదం నూనె కలిపి ముఖానికి రాసుకుని ఇరవై నిమిషాల తరువాత   కడిగేయాలి. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు రక్తప్రసరణను మెరుగుపడేలా చేస్తాయి. నల్లటి వలయాలు రాకుండా నిరోధిస్తాయి.
* టొమాటో, దోసకాయ ముక్కల గుజ్జును ముఖానికి పూతలా వేసుకుంటే మృతకణాలు తొలగిపోతాయి. మంచి క్లెన్సర్‌లా పనిచేయడంతో పాటు కంటికింద వలయాలు రాకుండా, చర్మం ముడతలు పడకుండా కాపాడుతుందీ పూత.


మరిన్ని