close

ఫీచర్ పేజీలు

బుల్లెట్‌కి పోటీ ఏది?

మెకానిక్‌ గురూ

* నేనొక కారు కొనాలనుకుంటున్నాను. అరవైశాతం సిటీలో, నలభైశాతం హైవేలపై నడుపుతాను. పెట్రోలు రకం తీసుకొమ్మంటారా? డీజిల్‌దా? దాని పనితీరు బాగుండాలి. రూ.పదిలక్షలు నా బడ్జెట్‌.

- విద్యాధరరావు, హైదరాబాద్‌

ఎక్కువగా సిటీలోనే నడుపుతానంటున్నారు కాబట్టి పెట్రోల్‌ రకం ఎంచుకోండి. ఆటోమేటిక్‌ అయితే నగర రోడ్లపై నడపడానికి సౌకర్యవంతంగా ఉంటుంది. మంచి మైలేజీ వస్తుంది. ప్రీమియం హ్యాచ్‌బాక్‌లో మారుతిసుజుకీ బ్యాలెనో, హ్యుందాయ్‌ ఐ20.. కాంపాక్ట్‌ సెడాన్‌ విభాగంలో మారుతిసుజుకీ స్విఫ్ట్‌ డిజైర్‌, హ్యుందాయ్‌ ఎక్సెంట్‌, హోండా అమేజ్‌లు.. కాంపాక్ట్‌ ఎస్‌యూవీలో మారుతిసుజుకీ విటారా బ్రెజా, హ్యుందాయ్‌ వెన్యూ, మహీంద్రా ఎక్స్‌యూవీ 300లలో ఏదైనా ఎంచుకోవచ్చు. ఎంయూవీ కావాలంటే రెనాల్ట్‌ ట్రైబర్‌, మారుతిసుజుకీ ఎర్టిగా లాంటివి మీ ధరలో అందుబాటులో ఉన్నాయి.
* నేను 350సీసీ విభాగంలో బైక్‌ కొనాలనుకుంటున్నాను. నా మొదటి ప్రాధాన్యం రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్‌. దీనికి వేరే ప్రత్యామ్నాయం ఏదైనా ఉందా? మైలేజీతోపాటు మంచి లుక్‌ ఉన్న బండి కావాలి. సలహా ఇవ్వండి.

- వసుదేవ్‌ బెహరా, ఈమెయిల్‌

350-400 సీసీ విభాగంలో మార్కెట్లో ఎన్నోరకాల మోటార్‌సైకిళ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సెగ్మెంట్‌లో బుల్లెట్‌ నమ్మకమైన బండి. చాలామంది రైడర్లకు ఇది ఫేవరెట్‌. నిర్వహణ వ్యయం తక్కువ. నడపడం తేలిక. మంచి సామర్థ్యం, తక్కువ ధర, మెరుగైన సర్వీసింగ్‌ సేవలతో అందుబాటులో ఉన్నది బజాజ్‌ డోమినర్‌ 400. మంచి పనితీరు, మేటి పికప్‌ కేటీఎం 390 సొంతమైనా దీంతో వెన్నునొప్పి ఎక్కువంటారు. కొత్తగా వచ్చిన జావా, బెనెల్లీలనూ పరిశీలించొచ్చు.
* నా హోండా షైన్‌ బండి నాలుగేళ్ల నుంచి వాడుతున్నాను. ఈమధ్యే ఒక కొత్త సమస్య మొదలైంది. బండి నడుస్తున్నప్పుడు ఇంజిన్‌ ఆఫ్‌ చేసినట్టు సడెన్‌గా ఆగిపోతోంది. కాసేపు ఆగి ఆన్‌ చేస్తేగానీ స్టార్ట్‌ కావడం లేదు. ఎందుకిలా?

              - శ్రీనివాస్‌ అటుకం, వరంగల్‌

ఎవరైనా బండి ఇంజిన్‌ స్టార్ట్‌ చేసిన తర్వాత కాసేపు అలాగే ఉంచి తర్వాత నడపాలి. ఇలా చేయడం వల్ల ఆయిల్‌ గ్యాలరీల ద్వారా ఆయిల్‌ ఇంజిన్‌కు చేరుతుంది. కార్బురేటర్‌ లేదా ఫ్యుయెల్‌ ఇంజెక్షన్‌ సిస్టమ్‌ ద్వారా ఇంధనం సాఫీగా ఇంజిన్‌కి వెళ్తుంది. మధ్యలో ఏవైనా ఎయిర్‌ గ్యాప్‌లు ఉంటే  ఫిల్‌ అవుతాయి. లేదంటే ఈ మార్గాల్లో ఎయిర్‌ గ్యాప్‌లు ఏర్పడి ఇంజిన్‌కి పెట్రోల్‌, ఆయిల్‌ అందక అకస్మాత్తుగా ఆగిపోతుంది. దీంతోపాటు ఎయిర్‌ఫిల్టర్‌, కార్బురేటర్‌లను ఒకసారి పరిశీలించండి. దుమ్మూధూళీ, వ్యర్థాలు పోగయ్యా యేమో చెక్‌ చేయండి. ఇంధనంలో ఎక్కువ కల్తీ ఉన్నా, ఇంజిన్‌ హెడ్‌వాల్వ్‌, సీడీఐలలో తేడా ఉన్నా ఈ సమస్య వస్తుంది.

- హర్షిన్‌ లాల్‌పేట్‌, ఆటోమొబైల్‌ నిపుణుడు

(మీకూ ఇలాంటి సందేహాలు, సమస్యలు ఉంటే రాసి పంపండి)


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు