close

ఈనాడు ప్రత్యేకం

మద్దతివ్వని మార్కెట్లు!

పత్తి కొనుగోలుకు ముందుకురాని సీసీఐ
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు అంతంతమాత్రం
విపణిలో అన్నదాతల నిలువు దోపిడీ
ప్రైవేటు వ్యాపారుల ఇష్టారాజ్యం

ఈ చిత్రంలో కనిపిస్తున్న రైతులు సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ వ్యవసాయ మార్కెట్‌కు పత్తిని అమ్మడానికి తీసుకొచ్చారు. మొత్తం 15.86 క్వింటాళ్ల పత్తిని బస్తాల్లో నింపుకొని 10 మంది రైతులు తీసుకురాగా ఈనామ్‌లో మార్కెట్‌ సిబ్బంది దాన్ని విడివిడిగా ఉంచారు. వ్యాపారులు పత్తిని చూసివెళ్లి ఎవరికి వారు ఈనామ్‌ కింద ఆన్‌లైన్‌లో ధరలను కోట్‌ చేశారు. పత్తి మద్దతు ధర క్వింటాకు రూ.5,550 కాగా.. కనిష్ఠంగా రూ.3,189 నుంచి గరిష్ఠంగా రూ.3,621 వరకే వ్యాపారులు కోట్‌ చేయడం గమనార్హం. అత్యధిక ధర రూ.3,621 కూడా కేవలం 3.31 క్వింటాళ్లకే ఒక రైతుకు మాత్రమే ఇచ్చారు. రాష్ట్రంలో పత్తికి వ్యవసాయ మార్కెట్‌లలో లభిస్తున్న ధరలకు ఇది నిదర్శనం.

సిద్దిపేట జిల్లా నుంచి ‘ఈనాడు’ ప్రతినిధి

కాలం కలిసిరాకుంటే ఎవరూ ఏం చేయలేరు. కానీ, ఈ సారి విస్తారంగా వర్షాలు పడ్డాయి. పంట పండినట్లేనని రైతులు సంబరపడుతుండగా.. మళ్లీ అతివర్షాలు కలవరపెట్టాయి. చివరికి ఎలాగోలా కష్టపడి అన్నదాతలు కాపాడుకున్న పంటకు ధర మాత్రం దక్కడంలేదు. వానాకాలం(ఖరీఫ్‌) పంటలకు మద్దతు ధర రావడం లేదు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు. ఇదే అదనుగా వ్యాపారులు ధర తగ్గించేస్తున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా సాగైన పత్తి పంటను మద్దతు ధరకన్నా రూ.2 వేలకు పైగా తగ్గించి కొంటున్నారు. ఇదేమని అడిగితే తేమ ఎక్కువ ఉందని చెబుతున్నారు. ఇప్పటికే పెసలు, మినుములను రైతులు తక్కువ ధరలకు అమ్ముకోవాల్సి వచ్చింది. ఇప్పుడిక పత్తి, మొక్కజొన్నల కొనుగోలులోనూ ‘దోపిడి’ అధికమైంది. రాష్ట్రంలో పత్తితోపాటు ఇతర పంటలు ఎక్కువగా అమ్మకాలు జరిగే వాటిలో ఖమ్మం, వరంగల్‌ మార్కెట్లు అతిపెద్దవి. వాటిలోనూ పరిస్థితి ఏ మాత్రం ఆశాజనకంగా లేదు.

ఖమ్మంలో కమీషన్‌ వ్యాపారుల దందా..
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో లైసెన్స్‌ లేని కమీషన్‌ వ్యాపారులు రైతులను దోచుకుంటున్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నల్గొండ, మహబూబాబాద్‌, వరంగల్‌ గ్రామీణ జిల్లాలతోపాటు ఏపీలోని కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో రైతులు పంటలను అమ్ముకునేందుకు ఖమ్మం మార్కెట్‌కు వస్తుంటారు. అయితే ఇక్కడ అక్రమాలకు అంతులేకుండా పోతోంది. పత్తి, పెసర, మిరప, ఇతర పంటలను నాణ్యత లేదనే సాకుతో తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు పత్తి సీజన్‌ ప్రారంభమైంది. సీసీఐ ఇంత వరకు జాడలేదు. ఇదే అదనుగా ప్రైవేటు వ్యాపారులు రైతుల నుంచి తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారు.

ఇష్టమొచ్చినట్లు ధరల నిర్ణయం..
పంటలకు ధరల నిర్ణయంలోనూ రైతులను ఇబ్బంది పెడుతున్నారు. వ్యాపారులంతా ముందే సిండికేట్‌గా మారి ధర ఎంత వేయాలో నిర్ణయించుకుని ఆ తరవాత ఎవరికి వారు తగ్గించి ఆన్‌లైన్‌లో కోట్‌ చేస్తున్నారు. ఉదాహరణకు నిర్మల్‌ జిల్లా భైంసా వ్యవసాయ మార్కెట్‌లో రైతులకు గిట్టుబాటు ధరలు దక్కడం లేదు. పంట నాణ్యతను కొలిచే గ్రేడర్లు నాణ్యతను తక్కువగా ఈనామ్‌లో నమోదు చేయడంతో వ్యాపారులు తక్కువ ధరలను కోట్‌ చేస్తున్నారు. ఉదయం రైతులు పంటలను తెస్తే మధ్యాహ్నం 12 గంటలకు ధరలు నిర్ధారించాల్సి ఉండగా.. సాయంత్రం వరకు వెల్లడించడం లేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో తక్కువ ధరలకే పంటను అమ్ముకొని రైతులు ఇంటి ముఖం పడుతున్నారు.

నాణ్యత పేరుతో గోల్‌మాల్‌...
పంటలను మార్కెట్లకు తెచ్చినప్పుడు అందులో తేమ ఎంత శాతం ఉందనేది చూడటానికి ఈ సీజన్‌ నుంచి కొత్త రకం యంత్రాలను ఇచ్చారు. పత్తి బస్తాలో చువ్వలతో లోపలికి గుచ్చగానే తేమ ఎంత శాతం ఎంతో యంత్రంపైన, దానికి అనుసంధానమైన సెల్‌ఫోన్‌ ద్వారా నమోదవుతోంది. కానీ, ఇది ఆన్‌లైన్‌లో వచ్చినా రైతులకు ఇచ్చే తక్‌పట్టీపై రాయడం లేదని గజ్వేల్‌కు చెందిన రైతులు కొమురయ్య, నాగరాజు, స్వామి, కిష్టయ్యలు వాపోయారు.

ఆరబెట్టి తీసుకురావాలి
పత్తిని మద్దతు ధరకు కొనేందుకు రాష్ట్రవ్యాప్తంగా 252 జిన్నింగ్‌ మిల్లులు, మరో 96 వ్యవసాయ మార్కెట్లలో సీసీఐ కొనుగోలు కేంద్రాలను తెరిచింది. కానీ, పత్తిలో తేమ 12 శాతానికి మించితే సీసీఐ కొనదు. అంతకన్నా ఎక్కువగా తేమ ఉంటోంది. రైతులు పత్తిని ఆరబెట్టి మార్కెట్‌కు తీసుకురావాలి. మొక్కజొన్నల కొనుగోలుకు కేంద్రాలు తెరవాలని మార్క్‌ఫెడ్‌కు ప్రభుత్వం సూచించింది.
-లక్ష్మీబాయి, సంచాలకురాలు, మార్కెటింగ్‌ శాఖ
వ్యాపారులు సొమ్ముచేసుకుంటున్నారు
రూ.8 వేల చొప్పున రెండేకరాలు భూమిని కౌలుకు తీసుకున్నా. ఎకరంలో మొక్కజొన్న, మరో ఎకరంలో పసుపు సాగు చేశాను. అధిక వర్షాల కారణంగా పంట దెబ్బతింది. దిగుబడులు సగానికి తగ్గిపోయాయి. కోతలకే రూ.5 వేల దాకా ఖర్చయింది. రైతులు పంటలు అమ్మేశాక ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. మా వద్ద కొన్న వ్యాపారులే అక్కడ విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.
-బర్ల గణపతి, కౌలు రైతు, నిర్మల్‌ జిల్లా 
గత్యంతరం లేకే..
మూడేకరాల్లో సోయాచిక్కుడు పంటను సాగు చేశాను. చివరి దశలో అధిక వర్షాలతో పంట కోతకు వచ్చినదశలో పాడైంది. పెట్టుబడి తిరిగిరాని పరిస్థితి ఉంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినా వెంటనే డబ్బు రాదని చెప్పారు. దీంతో గత్యంతరం లేక ప్రైవేటు వ్యాపారులకు విక్రయించాం.
-జుట్టు చిన్నన్న, సోయా రైతు, మహాగాం, నిర్మల్‌ 
తెగనమ్ముకోవాల్సిన పరిస్థితి 
ఖమ్మం మార్కెట్‌కు పది క్వింటాళ్ల పెసలు తెచ్చా. క్వింటా రూ.6,300కే విక్రయించాల్సి వచ్చింది. ఇంటి దగ్గరి నుంచి విపణికి తెచ్చేందుకు రవాణా ఖర్చులు రూ.900 అయ్యాయి. తిరిగి తీసుకెళ్లాలంటే మరో రూ.900 ఖర్చవుతుంది. అందుకే తెచ్చిన సరుకు ఇంటికి తీసుకెళ్లలేక తక్కువ ధరకే తెగనమ్ముకోవాల్సి వచ్చింది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ఉంటే రూ.7,000ల వరకు ధర వచ్చేది. 
-నల్లమోతు రామలింగయ్య, రైతు, కొణిజర్ల, ఖమ్మం 
ధర గిట్టుబాటు కావటం లేదు.
ఎన్నో ఆశలతో మార్కెట్‌కు 16 క్వింటాళ్ల పత్తి తెస్తే క్వింటా రూ.4,400 చొప్పున కొనుగోలు చేశారు. దీనికి తోడు వ్యవసాయ మార్కెట్లలో తారం పేరుతో దోపిడీ చేస్తున్నారు. నేను తెచ్చిన పత్తిలో బస్తాకు 3.50 కిలోల చొప్పున పత్తిని తారం పేరుతో కింద తీసేశారు. ఇలా మార్కెట్‌కు వచ్చిన రైతులను అందిన కాడికి దోచుకుంటున్నారు. 
-భూక్యా బిక్కు, రైతు, గోవింద్రాల, కామేపల్లి మండలం, ఖమ్మం జిల్లా

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు