close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
తొక్కలుపారేయకండి!

కూరగాయలు, పండ్లు కోస్తున్నప్పుడు వాటి తొక్కలు పారేస్తున్నారా... ఇకపై అలా చేయకండి. ఆ తొక్కల్ని రకరకాలుగా వాడుకోవచ్చు తెలుసా...

ఇప్పుడు కమలాఫలం సీజను. ఆ తొక్కల్ని అంగుళం మేర కత్తిరించి... వాటితో దంతాలను రుద్దుకుని చూడండి. తెల్లగా మారతాయి. ఏం చేయాలంటే ముందు ఆ తొక్కలతో పళ్లు రుద్దుకుని తరువాత పేస్టుతో తోముకుంటే చాలు.

కీరదోస తొక్కలు చీమల బెడదను సులువుగా నివారిస్తాయి. మీరేం చేయక్కర్లేదు. చీమలు వచ్చే చోట ఈ తొక్కల్ని ఉంచండి.

బూటు పాలిష్‌ అయిపోయిందా... అరటిపండు తొక్కతో రుద్ది చూడండి. బూట్లు కొత్తవాటిలా కనిపిస్తాయి. ఆ తొక్కతో ఆకుల్ని తుడిస్తే... తాజాగా, ఆరోగ్యంగా కనిపిస్తాయి.

ఒక్కోసారి కాఫీ ఫిల్టర్‌లో కాఫీ డికాషన్‌ తాలూకు మరకలు ఉండిపోతాయి. అదే జరుగుతోంటే... ఫిల్టర్‌లో రెండు నిమ్మతొక్కలు, కొద్దిగా ఉప్పు, చల్లని నీరు పోసి... మూతపెట్టేయండి. కాసేపయ్యాక ఒకసారి కుదిపి కడిగేస్తే చాలు.

రకరకాల కూరగాయల తొక్కల్ని పారేయకండి. ఓ గిన్నెలో ముప్పావువంతు నీళ్లు తీసుకుని... ఆ తొక్కల్ని ఇందులో వేసి పొయ్యిమీద పెట్టండి. కాసేపయ్యాక కొద్దిగా ఉప్పు, అల్లంతరుగు, కొన్ని లవంగాలు, దాల్చినచెక్క ముక్క వేయాలి. ఆ నీళ్లు చిక్కగా అయ్యాక తీసుకుంటే.. వెజిటబుల్‌ స్టాక్‌ సిద్ధమైనట్లే. దీన్ని సూప్‌లు, ఇతర పదార్థాల తయారీలో వాడుకోవచ్ఛు

యాపిల్‌ తొక్కను కుండీల్లో ఎరువుగా వేస్తే, మొక్కలకు నైట్రోజన్‌ అంది... ఆరోగ్యంగా ఉంటాయి.


మరిన్ని