close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
అరటి వృథాకు అడ్డుకట్ట

రటిబోదెతో పర్యావరణహితమైన సంచులు, ఆహారం, మాత్రలను భద్రపరిచేందుకు అనువైన ప్యాకింగ్‌ ముడిసరకును తన పరిశోధనలో కనిపెట్టింది భారత సంతతికి చెందిన జయశ్రీ ఆర్కాట్‌. ఆస్ట్రేలియా, న్యూసౌత్‌వేల్‌ విశ్వవిద్యాలయంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆమె... తన బృందంతో కలిసి దీన్ని తయారుచేసినట్లు ఆ విశ్వవిద్యాలయం తాజాగా ప్రకటించింది. అరటిగెలలు కోసిన తరువాత... అరటితోట దాదాపుగా వృథాగానే మిగిలిపోతుంది. దాంతోనే పర్యావరణానికి హాని చేయని, భూమిలో తేలికగా కలిసిపోయేలా ప్యాకింగ్‌కు ఉపయోగపడేలా ఏదైనా చేయాలనుకుంది జయశ్రీ. దీనిపై కొన్నేళ్లుగా తన బృందంతో కలిసి పరిశోధనలు చేసింది. ‘అరటి గెలలు కోసిన తరువాత, ఆ చెట్టు కాండాన్ని దుస్తుల తయారీ లేదా సేంద్రియ ఎరువుకు మాత్రమే వినియోగిస్తున్నారు. అదీ పన్నెండుశాతమే. మిగతాదంతా వృథా అవుతోంది. దాన్ని సద్వినియోగం చేయాలనుకునేదాన్ని. సిడ్నీలోని రాయల్‌ బొటానికల్‌ గార్డెన్‌కు ఎరువుగా అరటి బోదె వృథా వచ్చేది. దీన్ని పరిశోధిస్తే ఇందులో ఉండే సెల్యులోజ్‌ను ప్యాకింగ్‌కు అనువుగా మార్చుకోవచ్చని తెలిసింది. మేం ఇప్పుడు అదే చేశాం. ఇప్పుడు అరటిబోదె  తొంభైశాతం వరకూ పలురకాలుగా ఉపయోగపడుతుంది..’ అని చెబుతుందామె.  
పరిశోధన ఇలా... అరటి కాండాన్ని ల్యాబ్‌కు తరలించి, ముక్కలుగా చేసిందీ బృందం. వీటిని తక్కువవేడిలో ఆరబెట్టి  పొడిచేసి...  గాఢత తక్కువగా ఉండే రసాయనంతో శుభ్రపరిచింది. తరువాత బేకింగ్‌ పేపర్‌ను పోలినట్లుగా ముడిసరకును తయారుచేసింది. దాన్ని ఒకసారి మాత్రమే ఉపయోగించొచ్చు. కావాలనుకుంటే మళ్లీ రీసైకిల్‌ చేసుకోవచ్చు. ఒకవేళ పారేసినా భూమిలో సులువుగా కలిసిపోతుందని చెబుతుందామె. ఆ ముడిసరకుతో చేసే ప్యాకింగ్‌ ఆహారం, మాత్రలు.. కొన్నిరకాల వస్తువుల్ని భద్రపరిచేందుకు ఉపయోగపడుతుందని వివరిస్తుంది జయశ్రీ. అరటితోటలను పెంచే రైతులు ఆ చెట్టు బోదెను పొడిగా మార్చి అమ్మగలిగితే వారికి ఆదాయమూ వస్తుందని చెబుతుందామె. ఇందుకోసం బ్యాగుల తయారీ సంస్థలను సంప్రదించడం మొదలుపెట్టామని చెప్పే జయశ్రీ మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ, పీజీ పూర్తిచేసింది. ఆ తరువాత హైదరాబాద్‌లోని అగ్రికల్చరల్‌ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేసి, 1990లో ఆస్ట్రేలియాకు పరిశోధన నిమిత్తం వెళ్లింది.


మరిన్ని