close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
మా తుజే సలాం

సాధారణంగా బయటకు వెళితే తల్లులు పిల్లలకు పాలు ఇవ్వడానికి ఇబ్బంది పడుతుంటారు. డబ్బా  పాల మీద ఆధారపడుతుంటారు.. కానీ ఇక్కడ ఒక క్రీడాకారిణి తల్లి పాల విలువను చాటుతూ తన బిడ్డను మైదానానికి తీసుకెళ్లడమే కాదు. ఆట మధ్యలో పాలిచ్చి అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఆమే మిజోరం వాలీబాల్‌ క్రీడాకారిణి లాల్‌వెన్‌త్లుంగి.
అమ్మగా మారాక చాలామంది క్రీడాకారిణులు ఆటలనే వదిలేస్తారు.. ఒకవేళ తల్లి అయిన తర్వాత పునరాగమనం చేస్తే పిల్లలను ఇంటి దగ్గరే వదిలి మైదానానికి వస్తారు. కానీ మిజోరం వాలీబాల్‌ క్రీడాకారిణి లాల్‌వెన్‌త్లుంగి మాత్రం తన బిడ్డను ఆట స్థలానికే తీసుకొచ్చింది. అంతేకాదు ఆట మధ్య విరామంలో తన చిన్నారికి పాలిచ్చింది. ఈ సంఘటన మిజోరంలో చోటు చేసుకుంది. ఇక్కడ జరుగుతున్న ఒక వాలీబాల్‌ శిబిరంలో లాల్‌వెన్‌త్లుంగి అనే వాలీబాల్‌ క్రీడాకారిణి తైకుమ్‌ జట్టు తరఫున పేరు నమోదు చేసుకుంది. ఏడు నెలల తన బిడ్డను కూడా ఈ పోటీలకు తీసుకొచ్చేందుకు అనుమతి తీసుకుంది. ఆట మధ్యలో ఆమె పసిబిడ్డకు పాలిచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆమె బిడ్డకు పాలిస్తున్న దృశ్యాన్ని ఒకరు ఫొటో తీసి ఫేస్‌బుక్‌లో పెట్టడంతో వైరల్‌గా మారింది. ఫేస్‌బుక్‌తో పాటు ఇతర సామాజిక మాధ్యమాల్లో ఈ ఫొటోను విస్తృతంగా షేర్‌ చేస్తున్నారు. అటు క్రీడాకారిణిగా, ఇటు తల్లిగా ఒకేసారి బాధ్యతలు మోసిన లాల్‌వెన్‌త్లుంగిపై అంతర్జాలంలో ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆమెకు సలాం అని.. తల్లిగా, క్రీడాకారిణిగా ఒకేసారి న్యాయం చేసిందని సామాజిక మాధ్యమాల్లో పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. 2019 మిజోరం రాష్ట్ర క్రీడల్లో లాల్‌వెన్‌త్లుంగి బిడ్డకు పాలిస్తున్న దృశ్యం చిహ్నంగా మారింది. అందరికీ ఆదర్శంగా నిలిచిన ఆమెకు మిజోరం రాష్ట్ర క్రీడల మంత్రి రాబర్ట్‌.. రూ.10 వేల బహుమతి ప్రకటించారు.


మరిన్ని