close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఉన్నచోటే ఉరుకులు

బర్పీ వ్యాయామాలు

బయట మంచు ఎక్కువగా ఉంది. తీరిక లేదు. ఇలా ఏదో ఒక సాకు చూపించి వ్యాయామాన్ని ఎగ్గొట్టడంలో మన తరువాతే ఎవరైనా ఉంటారేమో! ఈ తీరు నెమ్మదిగా మనలో వ్యాయామం పట్ల క్రమశిక్షణ తగ్గిస్తుంది. అయినా పరుగెత్తడానికి బయటకే వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉండికూడా ప్రత్యామ్నాయ వ్యాయామాలు చేయొచ్చు. బర్పీ అలాంటి శక్తిమంతమైన వ్యాయామమే!

పది నిమిషాలు రన్నింగ్‌ చేస్తే ఎన్ని కెలొరీలు కరుగుతాయో.. పదినిమిషాలు బర్పీ వర్కౌట్‌ చేసినా అన్నే కెలొరీలు కరుగుతాయి. దీంతో పాటు శరీరంలో ప్రతిభాగం దృఢంగా తయారవుతుంది. ఛాతీ, భుజాలు, చేతులు, పొట్ట, కాళ్లు.. ఇలా ప్రతి భాగంపై ఇది  ప్రభావం చూపి కొవ్వును కరిగిస్తుంది. సాధారణంగా ప్రత్యేక సాయుధ దళాలు ఆపరేషన్లకు అడవులు, పర్వతాల్లో నెలల తరబడి ఉన్నప్పుడు వారు జాగింగ్‌ చేయడానికి అవకాశం ఉండదు. అలాంటి సమయాల్లో ఈ వ్యాయామం చేస్తారంటే ఇది ఎంత ప్రభావవంతమైందో అర్థం చేసుకోవచ్చు.

ఒక చోట నిటారుగా నిలబడాలి. తర్వాత ఫుల్‌స్క్వాట్‌ చేయాలి.. వెంటనే ఒక పుష్‌అప్‌ చేయాలి.. మళ్లీ ఫుల్‌స్క్వాట్‌ పొజిషన్‌లో కూర్చోవాలి. చివరికి ఒకసారి గాల్లోకి గెంతి నిలబడితే ఒక బర్పీ పూర్తయినట్లు. ప్రతి మూడు క్షణాలకు ఒక బర్పీ చొప్పున నిమిషం చేస్తే 20 బర్పీలు అవుతాయి. వ్యక్తి బరువును బట్టి 9 నుంచి 13 కెలొరీలు కరుగుతాయి. సన్నగా ఉన్నవారితో పోల్చితే బరువు ఎక్కువ ఉన్నవారికి అధిక శక్తి ఖర్చవుతుంది. ఎందుకంటే వారి శరీరం మొత్తం బర్పీ చేయాలంటే ఎక్కువ శ్రమపడాలి.

సరదాగా డాబాపైకి వెళ్లి ఒక మూల నిలబడి 20 బర్పీలు చేసి రెండో మూలకు పరుగెత్తి 19 బర్పీలు చేసి మూడో మూలకు వెళ్లి 18 బర్పీలు.. ఇలా ఒకటి వచ్చే వరకు చేస్తే మరో వ్యాయామం ఏదీ అవసరం ఉండదు.  గమనిక: ఆరోగ్య సమస్యలు లేకుండా పూర్తిగా ఫిట్‌గా ఉన్నవాళ్లు  మాత్రమే చేయాలి.  
- కె. చంద్రమౌళి, ఫిట్‌నెస్‌ నిపుణులు


మరిన్ని