close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఇస్తినమ్మ వాయనం

పుచ్చుకుంటినమ్మ పచ్చదనం!

నోములు, వ్రతాలప్పుడు వాయనాలు ఇచ్చిపుచ్చుకోవడం సంప్రదాయం. ఆ మహిళా అధికారీ అదే చేసింది. ఆమె వాయనంగా ఇచ్చింది పసుపు కుంకుమలు కాదు. పచ్చని మొక్కలు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వర్తిస్తున్న హరితహారాన్ని వ్రతంగా భావించి ‘హరిత లక్ష్మి’ కార్యక్రమాన్ని చేపట్టారామె. ఒక్కో ఇంటికీ ఐదేసి మొక్కల చొప్పున ఇచ్చి.. ప్రజలందరినీ వ్రతంలో భాగస్వాములను చేస్తున్నారు. ఈ సత్కార్యానికి సృజనాత్మకను జోడించి అరుదైన అధికారిగా మన్ననలు అందుకుంటున్నారు వరంగల్‌ రూరల్‌ జిల్లా దుగ్గొండ మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి పల్లవి. హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలను సంరక్షించడం అనుకున్నంత సులభం కాదు. కానీ దాన్ని ప్రజలకు మరింత చేరువచేసి వాళ్లను ఆ కార్యక్రమంలో భాగం చేశారు పల్లవి. ఎంపీడీవోగా విధుల్లో చేరిన రెండేళ్ల కాలంలోనే మొక్కలను సంరక్షించే బాధ్యతను తీసుకున్నారు.

అంతేకాదు ఆసక్తి, పట్టుదల ఉంటే ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయవచ్చనీ నిరూపించారు. ‘హరిత లక్ష్మి’ పేరుతో ఇంటింటికీ ఐదు మొక్కలు అందజేసే ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. మొక్కల పెంపకం అంటే మహిళలకు సహజంగా ఉండే ఆసక్తిని హరితహారం కార్యక్రమ అభివృద్ధికి వినియోగించుకున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా 34 గ్రామ పంచాయతీల్లోని పదివేల ఇళ్లకు ఒక్కో ఇంటికి ఐదు మొక్కల చొప్పున పంపిణీ చేశారు. అందులో శ్రీగంధంతోపాటు పూల మొక్కలు కూడా ఉన్నాయి. ఒకేరోజు 50 వేల మొక్కలు పంపిణీ చేసి తనదైన ముద్రను వేసుకున్నారు. ఇలా లక్ష్యం మేరకు మొక్కలను నాటడమే కాకుండా వాటిని సంరక్షించడంలోనూ ముందు వరుసలో నిలిచారు.    
- బైగాని వీరాస్వామి, న్యూస్‌టుడే, దుగ్గొండి


మరిన్ని