close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఆత్మీయతలో రాజస్థానం!

ఇదీ సంక్రాంతి సంప్రదాయమే!

సంక్రాంతి సరదాలు తెస్తుంది. పిండి వంటలు ఇస్తుంది. నువ్వుల లడ్డూల తీపిని పంచుతుంది. మన తెలుగునాట సంక్రాంతి శోభ ఇది. రాజస్థాన్‌లోనూ సంక్రాంతి అద్భుతంగా చేసుకుంటారు. ఈ పండగలో తోబుట్టువుల మధ్య ఆప్యాయతను పెంచేలా ఘెవర్‌ అనే తీపి పదార్థాన్ని పంచుకుంటారు. హైదరాబాద్‌లోని బేగంబజార్‌ నెలరోజుల పాటు ఈ ఘెవర్‌ ఘుమఘుమలతో సందడిసందడిగా ఉంటుంది..

ఘెవర్‌ రుచిలో ఎంత ప్రత్యేకంగా ఉంటుందో తయారీ కూడా అంతే వైవిధ్యంగా ఉంటుంది. దీని తయారీలో మైదాపిండి, నెయ్యి, పాలు, నిమ్మకాయ తగుపాళ్లలో కలిసి మిశ్రమాన్ని జారుగా చేస్తారు. పెద్ద కడాయిలో నూనె వేడెక్కిన తర్వాత అందులో లోహపు రింగుల్లాంటివి వదిలి అందులో పిండిని చుక్కలుచుక్కలుగా వేస్తారు. దాంతో వీటికి ప్రత్యేకమైన రూపు వస్తుంది. వీటిని చక్కెర పాకంలో ముంచి విక్రయిస్తారు. అక్కడే తినాలనుకునే వారికి మలై పూసి, కేసర్‌ రాసి, డ్రైఫ్రూట్స్‌ పలుకులు వేసి పువ్వు ఆకారంలో కోసి అమ్ముతారు. రాజస్థాన్‌ మహిళలు ఇంట్లో ఘేవర్‌, పేనీర్‌, నువ్వుల ఉండలు, డ్రైఫ్రూట్‌ లడ్డూలతో పూజ చేస్తారు. మధ్యాహ్నం తర్వాత వీటిని తమ కూతుళ్లకు, అక్కచెల్లెళ్లకు ఇచ్చివస్తారు. ఇలా చేస్తే అందరికీ మంచి జరుగుతుందని వారి నమ్మకం. ఏటా ఈ సంప్రదాయాన్ని హైదరాబాద్‌లోని రాజస్థానీయులు పాటిస్తున్నారు. వారిని చూసి చుట్టుపక్కల వారు తమ ఆడపిల్లలకు ఈ ఘేవర్‌ని కానుకగా ఇస్తుండటం విశేషం. బేగంబజార్‌ ఈ ఘెవర్‌కు ప్రసిద్ధి.

- తేరాల రంజిత్‌ కుమార్‌, ఈనాడు, హైదరాబాద్‌


మరిన్ని