close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
తారలా మిలమిలా!

కొత్త ఉద్యోగానికి మారాలనుకునేవారు లక్ష్యాలను ఎలా నిర్దేశించుకోవాలి? ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి ఎలాంటి నైపుణ్యాలు అవసరం? కెరీర్‌ బ్రేక్‌ తర్వాత అర్హత, అనుభవానికి తగిన ఉద్యోగం సాధించేందుకు ఏయే అంశాలపై దృష్టి పెట్టాలి?వీటిన్నింటికీ సరైన సమాధానం ఇచ్చేప్రయత్నం చేస్తోంది ‘ది స్టార్‌ ఇన్‌ మి’ సంస్థ.  దీన్ని ప్రారంభించిన ఉమా కాసోజీ ఈ సంస్థ మహిళలకు ఏ విధంగా చేయూతనిస్తుందో చెబుతున్నారు...
కార్పొరేట్‌
ప్రపంచంలో 15 సంవత్సరాల అనుభవం ఉన్న ఉమ వివిధ హోదాల్లో జరిగే నాయకత్వ సదస్సులకు హాజరయ్యేవారు. అప్పుడే ఇలాంటి సమావేశాలకు హాజరయ్యే మహిళల సంఖ్య చాలా తక్కువగా ఉందని తెలుసుకుంది. సీనియర్‌ లీడర్‌షిప్‌ స్థాయిలో ఉన్న మహిళలు మొత్తం 15శాతంలోపే ఉండటం ఆమెను ఆశ్చర్యానికి గురిచేసింది. సీనియారిటీ, పని అనుభవం ఉన్నా మహిళా ఉద్యోగులు ఎందుకు ఉన్నత స్థానాలకు చేరుకోలేకపోతున్నారనే ఆమె ప్రశ్నకు సమాధానమే ‘ద స్టార్‌ ఇన్‌ మి’ అంకుర సంస్థ. రెండేళ్ల క్రితం బెంగళూరుకు చెందిన మహువా ముఖర్జీతో కలిసి మహిళలకోసమే ఈ సంస్థను రూపొందించారు.  

ఈ సంస్థ ఏం నేర్పిస్తుంది...
ఉద్యోగాల వెతుకులాటలో నేటి అవసరాలకు తగినవిధంగా మహిళలకు సరైన దిశానిర్దేశం చేయడమే ఈ సంస్థ లక్ష్యం. పాత సంప్రదాయ విధానాలకు స్వస్తి చెబుతూ కొత్త పద్ధతులు నేర్పిస్తారు. రెజ్యూమేలకు బదులుగా పర్సనల్‌ బ్రాండింగ్‌పై అవగాహన కల్పిస్తారు. పని అనుభవం, కెరీర్‌లో సాధించిన విజయాలు, విద్యార్హతలు వంటి వివరాలను ఫొటోలు, వీడియోల రూపంలో సిద్ధంచేస్తారు. ఈ విజువల్‌ ప్రొఫైల్‌ను ఆన్‌లైన్‌లో ఉంచుతారు. తరువాత వారి లక్ష్యాల ఆధారంగా ప్రొఫెషనల్‌ నెట్‌వర్క్‌పై అవగాహన కల్పిస్తారు. పెద్దసంస్థలతో అనుసంధానమయ్యేందుకు నెట్‌వర్క్‌ గ్రూప్‌ల్లో సభ్యత్వం కల్పిస్తారు. ఇతర సంస్థలకు చెందిన ఉన్నతోద్యోగులతో మాట్లాడే అవకాశం కల్పిస్తారు. ఉదాహరణకు ఒక యువతి మార్కెటింగ్‌ సంస్థలో మేనేజరు స్థాయి ఉద్యోగాన్ని ఆశిస్తుంటే... ప్రొఫైల్‌ తయారు చేసిన తరువాత వివిధ సంస్థల్లో మార్కెటింగ్‌ మేనేజర్లతో మాట్లాడిస్తారు. వీటి ఫలితంగా నెట్‌వర్కింగ్‌ పరిధి పెరిగి ఉద్యోగం సాధిస్తామనే భరోసా కలుగుతుంది. నైపుణ్యాలు పెంచుకునేందుకు సర్టిఫైడ్‌ లీడర్‌షిప్‌ కోచ్‌లతో తరగతులు నిర్వహిస్తారు. ఇందుకు 45మంది గ్లోబల్‌ కోచ్‌లతో ఒప్పందం కుదుర్చుకున్నారు. కెరీర్‌గ్యాప్‌ తరువాత ఉద్యోగం చేయాలనుకునే వారిని... అనుభవం, వయసు, అర్హతల ఆధారంగా గ్రూపులుగా విభజిస్తారు. వీరికి ‘రిటర్న్‌ టు వర్క్‌’ ప్రోగ్రాంలో భాగంగా శిక్షణ ఇస్తారు. స్టార్టప్‌ ఇండియా సర్టిఫికేషన్‌ సాధించిన స్టార్‌ ఇన్‌ మి... గూగుల్‌ లాంచ్‌ప్యాడ్‌, షి లవ్స్‌ టెక్నాలజీ సంస్థలు ప్రకటించిన టాప్‌ టెన్‌ వ్యాపారవేత్తల జాబితాలో చోటు దక్కించుకుంది. ఐఎస్‌బీతో రీసెర్చ్‌ పార్ట్‌నర్‌గా ఒప్పందం కుదుర్చుకున్నారు. దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన పది విద్యాసంస్థలతో నాయకత్వ లోపాలను అధిగమించడానికి సదస్సులు నిర్వహిస్తున్నారు.
అనుభవాలే పాఠాలుగా...
‘ఇన్ఫోసిస్‌ మాకు మొదటి అవకాశం ఇచ్చింది. అక్కడ సీనియర్‌ లీడర్‌షిప్‌ హోదాలో పనిచేసే మహిళలకు శిక్షణ ఇచ్చాం. ఇది సత్ఫలితాలను ఇవ్వడంతో ప్రతి మూడు నెలలకు ఓసారి ఇలాంటి శిక్షణకు రూపకల్పన చేయమని చెప్పారు. ఇప్పటి వరకు వివిధ సంస్థల్లో పనిచేస్తున్న నాలుగువేలమంది మహిళలకు శిక్షణ ఇచ్చాం. 30 సదస్సుల్లో పాల్గొని అవగాహన కల్పించాం’ అంటున్న ఉమ.. ఐఐఎం కొజికోడ్‌ నుంచి 2001లో ఎంబీఏ చేశారు. ప్రస్తుతం అదే విద్యాసంస్థలో గవర్నింగ్‌ బోర్డు మెంబరుగా సేవలందిస్తున్నారు. మహువా ముఖర్జీ ఐఐటీ, ఐఎస్‌బీలో చదివి కార్పొరేట్‌ రంగంలో పనిచేశారు.


మరిన్ని