close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
మౌనంగానే ఎదిగింది మనసులను గెలిచింది

విజయీభవ

పెళ్లిచూపుల్లో తనేం చెబుతుందో పెళ్లికొడుక్కి అర్థం కాలేదు..  పెళ్లై కొడుకుపుట్టాక... ఆ పిల్లాడు గుక్కపెట్టి ఏడ్చే ఏడుపు ఆ అమ్మాయికి వినబడలేదు..  కారణం... కౌసల్యా కార్తీక బధిరురాలు. మూగ, చెవిటి అమ్మాయి. అలాంటి అమ్మాయి కోటీశ్వరి కార్యక్రమంలో కోటి రూపాయలు  గెలిచి విజేతగా నిలిచింది..

మిళనాడు.. మదురైలోని సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన కౌసల్య... పుట్టు మూగ, చెవిటి అమ్మాయి. బాగా చదువుకొని డాక్టరవ్వాలనుకున్న తన ఆసక్తికి తల్లిదండ్రులు అండగా నిలిచారు. కానీ బధిరురాలు కావడంతో ఎంబీబీఎస్‌ చేసే అవకాశం దక్కలేదు. అయితేనేం ఎంబీఏ చదివింది. ఆ కల కూడా అంత తేలిగ్గా తీరలేద]ు. కళాశాలలో ప్రొఫెసర్‌ చెప్పే పాఠాలు ఆమెకు వినబడేవి కావు. కాలేజీలో తోటి విద్యార్థినులు రాసుకున్న నోట్సుని ఇంటికి తీసుకొచ్చి నాన్నకు ఇచ్చేది. ముందు వాళ్ల నాన్న ఆ పాఠాలని అర్థం చేసుకుని వాటిని వాళ్ల అమ్మకు చెప్పేవాడు. ఎందుకంటే నాన్న చెప్పేది ఆ అమ్మాయికి అర్థమయ్యేది కాదు. అమ్మ పెదాల కదలికని మాత్రం కౌసల్య బాగానే అర్థం చేసుకునేది. అలా కష్టపడి చదువుకుని... ఎమ్మెస్సీ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఎంబీఏలను పూర్తిచేసి టాపర్‌గా నిలిచింది. ప్రస్తుతం జిల్లా కోర్టులో జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం సంపాదించింది. ఆమెకు  బాలమురుగన్‌తో రెండేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లిచూపులప్పుడు అతడికి కౌసల్య చాలా విషయాలు చెప్పాలనుకుంది. చెప్పింది కూడా. కానీ అవేమి ఆ అబ్బాయికి అర్థం కాలేదు. అయినా ఆమె తెలివితేటలు నచ్చాయి. పెళ్లిచేసుకున్నాడు. భర్త బాలమురుగన్‌కు మదురైలోని రెవెన్యూ శాఖలో ఉద్యోగం.

కౌసల్య తండ్రి ‘నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ’ విశాఖపట్నంలో రీజనల్‌ మేనేజరుగా పని చేసి రిటైరయ్యారు.


ఆ పిలుపు వినాలని...

కౌసల్య, బాలమురుగన్‌ దంపతులకు ఏడాది వయసున్న బాబున్నాడు. ‘ఎప్పుడెప్పుడు వాడిని చూస్తానా అనిపించేది. తీరా పుట్టిన తర్వాత.. వాడు ఏడుస్తున్నా, కేరింతలు కొడుతున్నా నాకు తెలిసేది కాదు. నాకు వినిపించదు కదా అనే విషయం అప్పుడు మాత్రం బాధ కలిగించేది. ఇప్పుడు చిన్నచిన్నగా వాడు అమ్మా అని పిలుస్తుంటే నేను వాడి పెదాల కదలిక మాత్రమే గుర్తించగలను. వాడి గొంతు ఎలా ఉంటుందంటూ అమ్మను ఎన్నోసార్లు అడుగుతూనే ఉన్నాను. ఆ పిలుపు వినడం బహుశా తీరని కోరికేనేమో’ అని అంటోంది కౌసల్య.  
* టీవీ, దినపత్రికలను క్రమం తప్పకుండా అనుసరించే కౌసల్య తమిళంలో ప్రారంభమైన ఎవరీ కోటీశ్వరి కార్యక్రమంలో పాల్గొనడానికి దరఖాస్తు చేసుకుంది. రాధికాశరత్‌కుమార్‌ ఈ క్యార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించారు. ఎంతో క్లిష్టమైన ప్రశ్నలకు సైతం తేలిగ్గా సమాధానాలు చెప్పింది కౌసల్య. సమాధానాలని బోర్డుల రూపంలో చూపిస్తూ చివరి ప్రశ్న వరకు ధైర్యంగా నిలిచి ప్రేక్షకుల హృదయాలనూ   కదిలించిందామె.

* ఈ పోటీలో గెలుచుకున్న కోటి రూపాయల్లో కొంత నగదును కౌసల్య తాను చదువుకున్న నాగర్‌కోయిల్‌ పాఠశాలకు ఇస్తానంటోంది. తమిళ సాహిత్యమంటే చెవికోసుకునే కౌసల్యకు కరుణానిధి కవిత్వమంటే చాలా ఇష్టం. హెలెన్‌ కెల్లర్‌ నుంచి స్ఫూర్తిపొందిన ఈ విజేత.. ఇందిరాగాంధీ, మిథాలీరాజ్‌లను ఎక్కువగా అభిమానిస్తుందట.

* ఇంటర్‌లో చేరేనాటికి ఆమెకు ఏబీసీడీలు రావంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. తమిళం మాతృభాష కావడంతో అంతవరకూ ఆమెకు ఆంగ్లం అవసరం రాలేదు. మదురై కళాశాలలో చేరినప్పుడు ఇంగ్లిష్‌ నేర్చుకోవలసి వచ్చింది.

- శివలెంక నాగభాస్కర్‌, న్యూస్‌టుడే, చెన్నై


మరిన్ని