close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
నానమ్మ, అమ్మ కలగన్నారు నేను సాధించాను!

నిన్న దిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అందరి కళ్లు ఆమెవైపే ఉన్నాయి.. అంతమంది సైనిక యోధులని... ఓ అమ్మాయి ముందుండి నడిపించడం ఆశ్చర్యమే కదామరి. కెప్టెన్‌ తాన్యా షేర్గిల్‌ చిన్ననాటి కల అది.

ఇటీవల జరిగిన ఆర్మీడే పరేడ్‌లో సైనిక బృందాలకు సారథ్యం వహించి రికార్డు సృష్టించిన తాన్యా తాజాగా రిపబ్లిక్‌ డే పరేడ్‌లోనూ అందరి చూపును తనవైపునకు తిప్పుకొంది. ఈ యోధురాలు తన కలని ఎలా సాకారం చేసుకుందో ‘వసుంధర’తో ముచ్చటించింది.... ●

సెలవులు దొరికితే చాలు, ఒంటరిగా ప్రయాణించడానికి ఇష్టపడతా. సిక్కిం అంటే ఇష్టం. అమ్మ చేసే కేక్‌ అంటే ఇష్టం. ఇప్పటికీ చిన్న ముక్క కూడా వదలకుండా తినేస్తా. అలాగే పావ్‌బాజీ కూడా. చిన్నప్పటి నుంచి జంతువులంటే ఇష్టం. ఆకలితో ఉండే వీధికుక్కలకు నా లంచ్‌ బాక్సులో రోటీలను పెట్టేసేదాన్ని. కాలేజీలో ఉన్నప్పుడు యానిమల్‌ వెల్ఫేర్‌ కోసం ఎన్జీవోలతో కలిసి పనిచేసేదాన్ని. పర్యావరణ కాలుష్యంపై అవగాహన కలిగించే కార్యక్రమాల్లో పాల్గొనేదాన్ని. మహిళలందరికీ నేను చెప్పేదొక్కటే. జీవితం ఒక్కసారే వస్తుంది. దాన్ని మనసుకిష్టమైన ఆశయం కోసం సాధన చేయాలి. ప్రతిఒక్కరూ దేశం కోసం ఏదో ఒక మంచిపని చేయాలి.●

స్కూల్‌ నుంచి వచ్చిన వెంటనే నాన్న కోసం ఎదురుచూసేదాన్ని. బయటకు తీసుకెళ్లి ఏదైనా కొనిపెడతాడని కాదు. ఆయన దుస్తులు మార్చుకోగానే ఆ యూనిఫారంను, వదిలిన బూట్లను వేసుకోవడానికి. వదులుగా ఉండే ఆ చెప్పుల్లో కాళ్లు పెట్టి... ఓ చిన్న సైనికురాలిగా ఇల్లంతా తిరిగేదాన్ని. అది చూసి మా ఇంట్లోవాళ్లంతా మురిసిపోయేవారు. యుద్ధంలో తన ముత్తాత చూపించిన ధైర్యసాహసాలను కథలుగా చెప్పించుకునేదాన్ని.

సైనికులు ధరించే యూనిఫారం, వాటిపై ఉండే నక్షత్రాలను చూస్తూ పెరిగాను. నా స్నేహితులంతా స్కూల్లో టీచర్‌ ఇచ్చే నక్షత్రాల కోసం ఎదురుచూసేవారు. నన్ను మాత్రం మా నాన్న చొక్కాపై ఉండే నక్షత్రాలే ఆకర్షించేవి. నేను స్కూల్‌కు వెళ్లడానికి తయారయ్యే సమయంలోనే, నాన్న కూడా ఆఫీసుకు సిద్ధమవుతూ ఉండేవారు. ఆయన దుస్తులు, వాటిపై నక్షత్రాలు, బూట్లు...వాటిపైనే నా దృష్టి అంతా ఉండేది. ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతుందా, నాన్న దుస్తులను ధరిస్తానా అని ఎదురుచూసేదాన్ని. యుద్ధాల గురించి, పొరుగుదేశాలపై వాళ్లు చేసుకునే చర్చలు వినడం కోసం ప్రతిరోజూ రాత్రి భోజనం కోసం ఎదురుచూసేదాన్ని. అక్కడే నేను చాలా విషయాలు తెలుసుకున్నా. నా లక్ష్యం కూడా అక్కడే ప్రాణం పోసుకుంది.

మా నాన్న గదిలోకి వెళుతుంటే, గుడిలో అడుగు పెడుతున్నట్లు అనిపించేది. పుస్తకాలు ఎక్కువగా చదివేవారు. అక్కడ తాతయ్యలు సైనిక దుస్తుల్లో ఉన్న ఫొటోలుండేవి. అదొక మ్యూజియంలా తోచేది.

నేను పుట్టింది పంజాబే అయినా... నాన్న సూరత్‌సింగ్‌గిల్‌ ఉద్యోగరీత్యా చాలా ప్రాంతాలు తిరిగేవాళ్లం. అమ్మ లఖ్వీందర్‌ కౌర్‌ గిల్‌ టీచర్‌గా ముంబయిలో పనిచేసేది. నేను అక్కడే హైస్కూల్‌ చదువు ముగించి, నాగ్‌పూర్‌లో ఇంజినీరింగ్‌ పూర్తిచేశా. మనసులో మాత్రం సైనికురాలినవ్వాలనే లక్ష్యం ఉండేది. అందుకే టీసీఎస్‌లో ఉద్యోగం వచ్చినా చేరలేదు.

ఇంజినీరింగ్‌లో ఉండగానే ఆర్మీలో చేరడానికి దరఖాస్తు చేసుకున్నా. ఎంపికైన తరువాత అమ్మకు సంతోషం ఆగలేదు. కన్నీళ్లు పెట్టుకుంది. చెన్నై ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీలో ఏడాదిపాటు శిక్షణ తీసుకున్నా. అక్కడికి వెళ్లినప్పుడు సాధారణమైన అమ్మాయిని, ఆ శిక్షణ నన్ను ఓ కెప్టెన్‌గా తీర్చిదిద్దింది. నాన్న కూడా ఇక్కడే శిక్షణ పొందారు. నాన్న ఈ విషయం స్నేహితులతో చెప్పుకొని గర్వపడేవారు.

నాన్న ఆర్మీలో విధుల్లో ఉన్నప్పుడు కశ్మీరు లోయలో తీవ్రవాదులను పట్టుకు నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అప్పుడు నాన్నతో కలిసి అక్కడకు వెళ్లా. అక్కడున్న రాకెట్‌ లాంచర్‌ను మోయలేకపోయినా ఎత్తగలిగాను. అంతగా ఆయుధాలంటే నాకు ఇష్టం. మా నానమ్మ, మా అమ్మకు సైన్యంలో చేరాలని ఉండేదట. అప్పటి సామాజిక పరిస్థితులు వారికి కలిసి రాలేదు. మా ఇంట్లో ప్రస్తుతం వారిద్దరి తరఫున దేశానికి నేను అందించే సేవగా భావిస్తున్నా.

గణతంత్ర దినోత్సవంలో లక్షలాదిమంది ప్రజలు, నేతలు, అతిథుల ఎదుట సైనిక కవాతు చేయడంలో ధైర్యసాహసాలుండాలి అనుకుంటారు. అన్నింటికన్నా ముఖ్యంగా ఆత్మస్థైర్యం, మనపై మనకు ఆత్మవిశ్వాసం ఉండాలి అంటాను. దొరికిన మొదటి, చివరి అవకాశంగా భావిస్తా. నేను ఆర్మీ ఆఫీసర్‌ను.. నా నేతృత్వంలో కోర్‌ ఆఫ్‌ సిగ్నల్స్‌ కంటింజెంట్‌ సైనికులందర్నీ నడిపించాలి అనేదే ఆలోచించా. నేను మహిళను అనే విషయం నా మనసులో ఉండదు.


మరిన్ని