close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
వాహన రంగంలో ఇంతే ఇంధనమై...

అత్యంత ఆదరణ పొందిన మహీంద్రా ఎక్స్‌యూవీ 500 విడుదలైన సమయం అది.. బండి మార్కెట్లోకి రాగానే బుకింగ్‌లు పోటెత్తాయి...
అంతగా వాహన ప్రియుల మనసు దోచుకున్న ఆ కారు డిజైన్‌ బృందానికి నాయకత్వం వహించింది ఒక మహిళ.
మిడ్‌ సెగ్మెంట్‌ విభాగంలో అమ్మకాల్లో దుమ్ము రేపుతున్న ద్విచక్రవాహనం బజాజ్‌ డోమినర్‌...
ఈ బైక్‌ డిజైన్‌ నుంచి మార్కెటింగ్‌ దాకా కీలక స్థానంలో ఉన్నవారంతా అతివలే.
ఆటోమొబైల్‌ అనగానే మగాళ్లకే పరిమితమైన రంగం అనుకుంటారు.
ఇక్కడ మహిళా ప్రాతినిధ్యం స్వల్పం. అయితే అది గతం.

ఇప్పుడు పరిస్థితి వేగంగా మారుతోంది.
ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి భార్యగా, సామాజిక కార్యకర్తగానే సుధామూర్తి ప్రపంచానికి తెలుసు. కానీ ఆటోమొబైల్‌ తయారీ యూనిట్లో పనిచేసిన తొలి మహిళా ఇంజినీర్‌ ఆమె. 1974 ఏప్రిల్‌లో పుణెలోని టాటా మోటార్స్‌ ప్లాంట్‌లో ఆమెను జేఆర్‌డీ టాటా స్వయంగా నియమించారు. సవాళ్లతో కూడిన రంగంలోనూ అమ్మాయిలు రాణించగలరు అని అప్పుడు సుధామూర్తి నిరూపిస్తే.. ఆ స్ఫూర్తిని టాటా యాజమాన్యం ఇప్పటికీ కొనసాగిస్తోంది. కీలకమైన తయారీ యూనిట్లలో మహిళా ఉద్యోగుల సంఖ్యను వచ్చే నాలుగైదేళ్లలో 25 శాతానికి పెంచుతామని రెండేళ్ల కిందట ప్రకటించింది. దానికనుగుణంగానే కార్యాచరణ అమలు చేస్తోంది. 2016లో మహిళా ఉద్యోగులు 13శాతం ఉండగా 2017కి 19 శాతానికి పెరిగింది. ముఖ్యంగా వాహన తయారీ యూనిట్లలో పనిచేసే మహిళల సంఖ్య బాగా పెరిగింది. ఇందుకోసం చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన వాళ్లను ఎంపిక చేస్తోంది. వారికి శిక్షణనిచ్చి సానబెడుతూ నైపుణ్యాలు పెంచుతోంది.
మహీంద్రాలో అందలం
భారీగా అమ్ముడవుతూ మహీంద్రాను మరో మెట్టు ఎక్కించిన మోడల్‌ ఎక్స్‌యూవీ 500. చిరుతపులి స్ఫూర్తితో డిజైన్‌ చేసిన ఈ స్పోర్ట్స్‌ యుటిలిటీ వాహనం 2011లో విడుదలైన దగ్గర్నుంచీ బాగా సక్సెస్‌ అయ్యింది. ఈ విభాగంలో అత్యుత్తమ డిజైన్‌ కారుగా పేరు తెచ్చుకుంది. ఈ డిజైన్‌ బృందాన్ని అప్పట్లో రామ్‌కృపా అనంతన్‌ డిజైన్‌ చేశారు. ప్రస్తుతం ఆమె కంపెనీ డిజైనింగ్‌ హెడ్‌ స్థాయికి చేరారు. అవకాశం దక్కితే మహిళలూ ఆటోమొబైల్‌ రంగంలో తమ శక్తిసామర్థ్యాలు నిరూపించుకోగలరని అంటారామె. ఆ గ్రూప్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా రామ్‌కృపా ప్రతిభను గుర్తించి సముచితస్థానంలో నియమించారు. ఆమె నుంచి ప్రేరణ పొందారో ఏమోకానీ.. ‘పింక్‌ కాలర్‌’ కార్యక్రమం కింద మహీంద్రా వర్క్‌షాప్స్‌లో మహిళల నియామకాలు పెంచుతున్నారు.
ఐటీఐల నుంచి విద్యార్థులను ఎంపిక చేసుకొని ప్రత్యేకంగా శిక్షణనిస్తున్నారు. కొన్నినెలల కిందట జైపుర్‌లో మొత్తం మహిళలే నిర్వహించే సర్వీసింగ్‌ సెంటర్‌ ప్రారంభించారు. ఇందులో టెక్నీషియన్‌, సర్వీస్‌ అడ్వైజర్‌, డ్రైవర్‌, పార్ట్‌ మేనేజర్‌, చివరికి సెక్యూరిటీ గార్డ్‌ కూడా అమ్మాయిలే ఉంటారు.

అన్నీ పనులూ వాళ్లవే
పల్సర్‌తో యువత పల్స్‌ పట్టిన బజాజ్‌ టూవీలర్‌ కొన్నేళ్ల కిందట డోమినర్‌ పేరుతో 400 సీసీ బైకును తీసుకొచ్చింది. అబ్బాయిలు ఇష్టంగా దూసుకెళ్లే ఈ బైక్‌ని పూర్తిగా మహిళలే తయారు చేశారనే విషయం మీకు తెలుసా? పుణె దగ్గరున్న చకన్‌ ప్లాంట్‌లో తయారవుతుంది ఈ మోడల్‌. ఇక్కడ పనిచేసే 130 మంది మహిళలు వివిధ రకాల విడిభాగాలను అనుసంధానించి బైక్‌ రూపం తీసుకొస్తున్నారు. బరువైన విడిభాగాలను మోయడం, వెల్డింగ్‌ చేయడం, పెయింటింగ్‌, ఫినిషింగ్‌.. ఇలా ప్రతి పనీ అమ్మాయిలే చేస్తారు. డోమినర్‌తోపాటు కేటీఎం, పల్సర్‌ బైక్‌లు, తాజాగా చేతక్‌ స్కూటరూ ఇక్కడే అసెంబ్లింగ్‌ చేస్తున్నారు. పురుషులు చేయగలిగిన ఏ పనైనా తాము అవలీలగా చేయగలమని నిరూపిస్తున్నారు మహిళలు. మోడల్‌ ఆవిష్కరణ సభలో ‘కొత్త చేతక్‌ స్కూటర్‌ను మహిళలే పూర్తిగా తయారు చేశార’ని బజాజ్‌ అధినేత రాజీవ్‌బజాజ్‌ సగర్వంగా ప్రకటించారు.

దూసుకెళ్లే దారులెన్నో  
కుర్రాళ్లు అత్యధికంగా ఇష్టపడే రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ల తయారీ ప్లాంట్‌లోనూ 20శాతం మంది అమ్మాయిలు పని చేస్తున్నారు. ‘ప్రాజెక్టు తేజస్వినీ’ కింద హీరో మోటార్స్‌ తయారీ ప్లాంట్లలో పని చేయడానికి గతేడాది వెయ్యిమంది మహిళలను నియమించుకొంది హీరో. దీంతోపాటు వాళ్ల కోసం ప్రత్యామ్నాయ కెరీర్‌ ప్రోగ్రామ్‌ కూడా ప్రారంభించింది.
* మెకానికల్‌ ఇంజినీరింగ్‌ అంటే కేవలం అబ్బాయిలకు సంబంధించిన చదువు అని భావించి అమ్మాయిలు దూరంగా ఉంటారు. ఈ ఆలోచనా విధానంలో మార్పు రావాలి. ఆటోమొబైల్‌ రంగంలో అమ్మాయిలకు అపారమైన అవకాశాలున్నాయి. వాహన పరిశ్రమ పెద్దలు సైతం అత్యధిక ప్రోత్సాహమిస్తున్నారు.  ప్రతిభ ఉంటే మేనేజ్‌మెంట్‌ స్థాయిలో ఎదగడానికి ఎన్నో అవకాశాలున్నాయి. సొంతంగానూ ఉపాధి పొందుతూ ఆదాయాన్ని పొందవచ్చు. అమ్మాయిలూ.. ఇకనైనా ఇటువైపు చూడండి. రయ్‌రయ్‌మంటూ దూసుకొచ్చేయండి.


చిన్నపిల్లలకు తల్లిదండ్రులు కొనిచ్చే బొమ్మల్లో.. అబ్బాయిలకు కార్లు, బైక్‌లు, అమ్మాయిలకు మామూలు బొమ్మలు ఇస్తున్నారంటే వివక్షకు బీజం పడినట్లే. ఆ వయసు నుంచే బాలబాలికలను మానసికంగా వేరుచేస్తున్నారని గుర్తించాలి. ఏ విషయంలోనూ లింగభేదం లేకుండా చూడాలి. తయారీ రంగంలో మహిళల సంఖ్య పెరుగుతోంది. ఇక్కడ లింగవివక్షకు తావుండదు. భద్రత కారణంగా షాప్‌ ఫ్లోర్‌లో వేసుకునే దుస్తులు మహళలకు, పురుషులకు ఒకేలా ఉంటాయి. దీన్ని కూడా వివక్షలా భావిస్తే మహిళలు ముందుకెళ్లలేరు. మెకానికల్‌ ఇంజినీరింగ్‌, డిజైనింగ్‌లో పీజీ చేసే మహిళల సంఖ్య ఇంకా పెరగాలి. ఏ వృత్తినైనా ప్రేమిస్తూ, ఆస్వాదిస్తూ చేస్తే విజయం సాధిస్తారు. డిజైనింగ్‌లో ఇది చాలా ముఖ్యం.    

- రామ్‌కృపా అనంతన్‌, డిజైన్‌ హెడ్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా


-పెద్దింటి సత్యలక్ష్మి
 


మరిన్ని