close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
అందం చేతుల్లో కాదు..చేతల్లో ఉంది!

చుట్టూ వేలాదిమంది ప్రేక్షకులు.. పదుల సంఖ్యలో న్యాయనిర్ణేతలు... తనలా పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన భామలు... కానీ అందరి చూపు మెక్సికో మోడల్‌ అనా గాబ్రియెలా మొలీనా పైనే. ఎందుకంటే ఆమెకు పుట్టుకతోనే చేతులు లేవు. అయినా ఆ పోటీల్లో విజేతగా నిలిచి అందరి దృష్టినీ ఆకర్షించిందామె. అందాల పోటీలంటే శారీరక కొలతలు, బికినీల్లో ప్రదర్శనలు వంటివి కావని, ఆత్మస్థైర్యానికి, ఆత్మవిశ్వాసానికి నిదర్శనమని నిరూపించిందీ 24ఏళ్ల సైకాలజీ విద్యార్థిని..

మెక్సికోలో ఇటీవల నిర్వహించిన అందాల పోటీల్లో గెలిచి ‘మిస్‌ నాన్‌చిటాల్‌- 2020’గా ఎంపికైంది మొలీనా. ‘చిన్నప్పటి నుంచీ ప్రతి సందర్భంలో నాకు అవరోధాలే ఎదురయ్యాయి. వాటిని జయిస్తూ ఈ స్థాయికి చేరుకున్నా. వైకల్యం ఒక శాపం, అది పెద్ద భారం అని బాధపడకుండా ధైర్యంతో ముందడుగేస్తే ఏ రంగంలోనైనా విజయం సాధించగలరు’ అని చెప్పి ప్రపంచం దృష్టిని ఆకర్షించిందామె. చేతులు లేకపోయినా.. కాలి వేళ్లతో చెంచా పట్టుకుని తినడం, రాయడం, సెల్‌ఫోన్‌ వాడటం వంటివన్నీ చేస్తుంది. ఈ మార్చిలో వెరాక్రూజ్‌, జూన్‌లో మిస్‌ మెక్సికో పీజెంట్‌ పోటీల్లో గెలవడమే తన లక్ష్యమని చెబుతోంది. అందాల పోటీలకే పరిమితం కాకుండా స్ఫూర్తి ప్రసంగాలు, ఫ్యాషన్‌ ట్రెండ్స్‌ గురించి ప్రసంగాలు ఇస్తుందీ భామ.


మరిన్ని