close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
రైల్లో చదువుకుని...పదిహేడు పతకాలు

అమ్మానాన్నల కష్టం చూశాక ట్యూషన్‌ పెట్టించండి అని ఇంట్లో వాళ్లని ధైర్యంగా అడగలేకపోయిందా అమ్మాయి. పైపెచ్ఛు.. చిన్నారులకు తనే ట్యూషన్లు చెప్పి అమ్మానాన్నలకు అండగా నిలిచింది. అలాంటి అమ్మాయి... ఇటీవల జరిగిన విశ్వేశ్వరాయ సాంకేతిక విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో ఏకంగా 17 పసిడి పతకాలు దక్కించుకుని ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది. ఆమే మహిమారావు. ఆ విశేషాలే ఇవి...

ది కేరళలోని కాసరగోడ్‌. కర్ణాటక సరిహద్దు ప్రాంతం. మహిమారావు అక్కడే పుట్టిపెరిగింది. తండ్రి ఆటోరిక్షా మెకానిక్‌. దీంతో మహిమ మనసులో ట్యూషన్‌కు వెళ్దామని ఉన్నా... అమ్మానాన్నలను అడగలేని దుస్థితి. ట్యూషన్‌ లేకపోతేనేం... అలా వెళ్లేవారి కంటే మేటిగా నిలవాలన్న పట్టుదలతో చదివింది. ఆ కసే ఆమెను పదోతరగతిలో పాఠశాలలో రెండో స్థానంలో నిలిచేలా చేసింది. ఉచిత నృత్య శిక్షణలో చేరి.. భరతనాట్యం, యక్షగానం, కూచిపూడి, జానపద నృత్యాల్లో రాటుదేలింది. ఇంటర్‌లో తల్లిదండ్రుల అరకొర ఆదాయం చూసి వారిని నోరు తెరిచి పుస్తకాలు కొనివ్వమని అడగలేకపోయిందామె. అందుకే సాయంత్రం ఆరు నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ట్యూషన్లు చెప్పేది. ఇంటర్‌లో 98.75శాతం మార్కులు తెచ్చుకుంది. ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షలో ప్రతిభ చూపించి.. మంగళూరు సెయింట్‌ జోసెఫ్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో సీటు సంపాదించింది.

ఇప్పుడే అసలైన సమస్య...

కాసరగోడ్‌ నుంచి మంగళూరుకు 60కి.మీల దూరం. హాస్టల్లో చేరితే ఖర్చవుతుందని అంత దూరం రోజూ రైల్లో వెళ్లేది. తెల్లవారుజామునే ప్రయాణం మొదలయ్యేది. తిరిగి రాత్రెప్పుడో ఇంటికి చేరుకునేది. రైల్లోనే పాఠాలన్నింటినీ శ్రద్ధగా చదివేది. ఆదివారాలు, సెలవుల్లో ఖాళీగా ఉండకుండా నృత్యం సాధన చేసేది. చివరి సెమిస్టర్‌ పరీక్షల సమయంలోనే నృత్యంలో కీలకంగా చెప్పుకొనే ‘విధూషి’ పరీక్షలూ వచ్చాయి. ఉదయం విధూషి పరీక్ష, ఆ వెంటనే సెమిస్టర్‌ పరీక్ష. కొంత సేపు సెమిస్టర్‌కు చదువుకొని, రాత్రుళ్లు 12 గంటల వరకు నృత్య సాధన చేసేది. ఆమె కష్టం వృథా కాలేదు. విధూషి పరీక్షల్లో ప్రథమ శ్రేణిలో పాసైంది. ఆ ఆనందంలో ఉండగానే సివిల్‌ ఇంజినీరింగ్‌ ఫలితాలు వెలువడ్డాయి. 9.38సీజీపీఏ సాధించి,ఏకంగా 17 పసిడి పతకాలు గెల్చుకుంది. ప్రస్తుతం బీటెక్‌ పిల్లలకు పాఠాలు చెబుతోందామె.

-కె.ముకుంద, ఈనాడు డిజిటల్‌, బెంగళూరు


మరిన్ని