close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
పంచుకుంటే ఎంత బాగుంటుందీ!

భార్యాభర్తలు సమానంగా సంపాదిస్తున్నా, భర్త కంటే భార్యే ఎక్కువగా ఆర్జిస్తున్నా కొన్నివిషయాల్లో  ఎలాంటి మార్పూ ఉండటం లేదు. ఇప్పటికీ ఇంటిపని, పిల్లల పని విషయంలో ఎనభైశాతం భారం భార్య మీదే పడుతుంది. ఇంటి పనిలో కేవలం పది శాతాన్ని మాత్రమే భర్తలు పంచుకుంటున్నారని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అతికొద్ది మంది భాగస్వాములు మాత్రమే ఉద్యోగం చేసే భార్యలకు సహాయ సహకారాలను అందిస్తున్నారు. ఎంచుకున్న రంగంలో భార్య ఉన్నత శిఖరాలను అధిరోహించేలా ప్రోత్సహిస్తున్నారు. అలా భార్యాభర్తలు ఒకరికొకరు సహకరించుకుంటూ ఒకరికోసం మరొకరు అన్నట్టుగా కలసికట్టుగా ముందుకు సాగిపోవాలంటే కొన్ని పద్ధతులను పాటించాలి. అవేంటంటే...


స్వేచ్ఛగా మాట్లాడుకోవాలి

* ఇంటి నిర్వహణ, పిల్లల పెంపకం... ఇవన్నీ కలసికట్టుగా చేయాల్సిన పనులు. అందుకే భాగస్వాములు ఇద్దరూ కలిసే నిర్ణయాలు తీసుకోవాలి.


* ఉద్యోగంలో సాధించాల్సిన లక్ష్యాలు, ఇంటికి సంబంధించిన విషయాలను గురించి అరమరికలు లేకుండా మాట్లాడుకోవాలి. ఆఫీసులోని సమస్యల గురించి భార్య ప్రస్తావించగానే... ఆఫీసు విషయాలు ఇంట్లో మాట్లాడొద్దని విసుక్కుంటారు కొందరు భర్తలు. ఇది సరికాదు. తన సమస్యలను సొంత మనిషితో తప్ప ఇంకెవరితోనూ పంచుకోలేదనే విషయాన్ని గుర్తుంచుకుని తగిన సలహాలు ఇవ్వాలి.


* ఏదైనా విషయం గురించి భార్య మీతో మాట్లాడాలనుకుంటే స్వేచ్ఛగా మాట్లాడనివ్వాలి. పూర్తిగా విన్న తర్వాతే మీ అభిప్రాయాన్ని చెప్పాలి. సమస్యలు ఏమైనా ఉంటే వాటి గురించి ఇద్దరూ చర్చించుకోవాలి. అలాగే చేయాల్సిన పనుల లిస్టును తయారుచేసుకుని దానికి అనుగుణంగా పనులను విభజించుకోవాలి.


* భార్య చేయాల్సిన పనులు సాధారణంగా ఎక్కువగానే ఉంటాయి. అలాంటప్పుడు కొన్ని పనులను మీరు తీసుకుని ఆమె పని భారాన్ని కాస్త తగ్గించండి. కొందరు ఇంటి పనుల్లో భార్యకు చిన్న సాయంచేసినా గొప్ప ఘనకార్యం చేసినట్టుగా భావిస్తారు. ఉదాహరణకు పాపాయికి తల్లి పదిసార్లు డైపర్‌ మారిస్తే... ఒక్కసారి తండ్రి మార్చి మొత్తం పని తనే చేశానని విసుక్కుంటారు. అలాగే భార్యకు ఆరోగ్యం బాలేనప్పుడు కాస్త టీ పెట్టి ఇచ్చి చాలా పనులు చేసినట్టుగా భావించేవాళ్లూ ఉన్నారు.


కలిసికట్టుగా నిర్ణయాలు

లిసి తీసుకునే నిర్ణయాలు ఇద్దరికీ మేలు చేసేవిగా ఉండాలి. ఎప్పుడూ ఒక్కరే సర్దుకుపోవాల్సిన అవసరం రాకూడదు. పిల్లల పెంపకం ఉమ్మడి బాధ్యత. ఇంటి పనులు, పిల్లలను కేర్‌ సెంటర్‌లో వదలడం.. ఈ పనులన్నీ ఇద్దరికీ సంబంధించినవి. ఇంటి పనుల విషయంలో సాయంచేసే భర్తలను ప్రోత్సహించాలి. అలాగని చిన్న పనిచేసినా వాళ్లను ఆకాశానికి ఎత్తేయకూడదు.

* రోజువారీ పనుల్లో అడక్కుండానే భార్యకు సాయం చేయొచ్చు. ఉదాహరణకు భార్య ఆఫీసు నుంచి వచ్చే వరకూ కాలక్షేపం చేయకుండా ఆరేసిన దుస్తులను మడత పెట్టడమో మరో పనో చేయొచ్చు. మగ, ఆడ పనులని వేర్వేరుగా ఉండవు. పనులు మాత్రమే ఉంటాయి.


ద్యోగం చేసే మహిళలకు ఇంటి బాధ్యతలతోపాటు వృత్తి సంబంధమైన బాధ్యతలూ ఉంటాయి. ఇంటా బయటా బాధ్యతలతో సతమతమవుతూ అప్పుడప్పుడూ ఒత్తిడికి గురవుతుంటారు. అలాంటి సమయంలో తమ సమస్యలను భర్తకు చెబుతుంటారు. చాలా సందర్భాల్లో సమస్యను పూర్తిగా వినకుండానే ఉద్యోగం మానేయమని ఉచిత సలహా ఇస్తుంటారు. అలాకాకుండా ఆమె మానసికంగా దృఢంగా మారేలా సహకరించాలి. ఒత్తిడి నుంచి బయట పడే మార్గాల గురించి వివిధ రకాలుగా ఆలోచించాలి. ఇందుకు అన్ని విధాలుగా భర్త సహకరించాలి.


సాధారణంగా మహిళలంటే సున్నితంగా, శాంత స్వభావంతో ఉండాలని, పురుషులంటే దృఢంగా, అధికార దర్పంతో ఉండాలని కోరుకుంటారు. అందుకు భిన్నంగా ఆత్మాభిమానం ఉన్న  మహిళలు కాస్త హుందాగా ఉంటే దాన్ని పొగరని తప్పుపడుతుంటారు. ఇలాంటి ఆలోచనా విధానంలో మార్పు రావాలి. ఇంట్లోని ఆడపిల్లలను స్వేచ్ఛగా మాట్లాడేలా ప్రోత్సహించాలి. అమ్మాయిలను గౌరవించి, వాళ్ల అభిప్రాయాలకు విలువనిచ్చే వాతావరణంలో అబ్బాయిలను పెంచాలి. ఇంట్లో లింగ వివక్ష చూపకుండా పిల్లలను పెంచాలి. అర్థంలేని కొన్ని పాత పద్ధతులకు ముగింపు పలికి, ప్రతి విషయాన్నీ సహేతుకంగా ఆలోచిస్తే ఇతరులూ మిమ్మల్ని అనుకరిస్తారు. మీరు సమర్థులైన భాగస్వాములుగా మారి పిల్లలనూ అలాగే పెంచితే అసమానతలు లేని సమాజ స్థాపనకు మీ వంతుగా కృషిచేసినవాళ్లవుతారు.


మరిన్ని