close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
నేను రేవతిని అర్థం చేసుకున్నాను!

అమ్మకోసం తెచ్చిన శరత్‌ నవలలను ఆమెకూడా ఇష్టంగా చదివేవారు. ఆ ఇష్టమే... సాహితీ ప్రపంచంలో తనకంటూ ఓ స్థానాన్ని తెచ్చిపెట్టింది. ఎన్నో అద్భుతమైన రచనలను తెలుగు పాఠకులకు కానుకగా అందించిన
పి. సత్యవతి ‘హిజ్రా ఆత్మకథ’ అనువాద పుస్తకానికి తాజాగా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ‘వసుంధర’ ఆమెతో ముచ్చటించింది...

మీ కుటుంబ నేపథ్యం..
గుంటూరు జిల్లా కొలకలూరులో 1940 జులైలో పుట్టాను. మాది మధ్యతరగతి కుటుంబం. నాన్న సత్యనారాయణ రైతు. అమ్మ కనకదుర్గ గృహిణి. నాకు ఇద్దరు చెల్లెళ్లు, ఇద్దరు తమ్ముళ్లు. అందరూ డిగ్రీలతో చదువు ఆపేశారు. నేనొక్కదాన్నే పెద్ద చదువులు చదివాను. హైదరాబాద్‌లో  బీఏ అయ్యాక ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఏ చేశాను.
రచనల మీద ఆసక్తి ఎలా మొదలయ్యింది..!
మా అమ్మకి పుస్తకాలు చదివే అలవాటుంది. ఆమె కోసం మా కళాశాల గ్రంథాలయం నుంచి శరత్‌ నవలలను తీసుకొచ్చేవాళ్లం. తనతో పాటుగా మేమూ చదివేవాళ్లం. అలా చందమామ కథల దగ్గర్నుంచి అన్ని కథల పుస్తకాలు ఇష్టంగా పోటీపడి మరీ చదివేవాళ్లం. అలా ఆసక్తి మొదలయ్యింది. మొదట్లో సరదాగా కథలు రాసుకునేదాన్ని. 1975 నుంచి సీరియస్‌గా రాయడం మొదలుపెట్టాను.
కుటుంబ మద్దతు ఎలా ఉండేది...
మా వారు ప్రసాద్‌. మా మేనత్త కొడుకే. ఆయన నన్ను చాలా ప్రోత్సహించేవారు. సంవత్సరం కిందట కాలం చేశారు. విజయవాడ ఎస్‌.ఎ.ఎస్‌. కళాశాలలో ఆంగ్ల అధ్యాపకురాలిగా పనిచేశాను. అత్తగారింట్లో మొదట ఉద్యోగం వద్దు అన్నారు. దాంతో పదేళ్లు ఇంట్లోనే ఉన్నాను. ముగ్గురు మగపిల్లలు పుట్టాక.. ఇంట్లో వాళ్లను ఒప్పించి ఉద్యోగానికి వెళ్లాను.
సాహితీ ప్రస్థానంలో మర్చిపోలేని జ్ఞాపకాలు..
ఇల్లలకగానే, సత్యవతి కథలు, మంత్రనగరి ... కథాసంపుటాలతో పాటు నవలలు, వ్యాసాలు, అనువాదాలు చాలా వచ్చాయి. వీటిని చదివి చాలామంది బాగున్నాయంటూ ఫోన్లు చేస్తారు. పాతికేళ్ల నుంచి పెద్దవాళ్లవరకూ అందరూ వచ్చి కలుస్తుంటారు. అభిమానిస్తుంటారు. ఇది చాలదా జన్మకి అని అనిపిస్తుంటుంది.
హిజ్రా ఆత్మకథ అనువాదం వెనక..
ఎ.రేవతి అని ఓ హిజ్రా జీవితమది.. తన ఆత్మకథను ఆవిడ తమిళంలో రాశారు. అది ‘ద ట్రూత్‌ ఎబౌట్‌ మి: ఎ హిజ్రా స్టోరీ’ పేరిట ఆంగ్లంలోకి అనువాదం అయ్యింది. దాన్ని 2016లో చదివాను. దొరైస్వామి అని తమిళనాడులోని ఓ మారుమూల గ్రామానికి చెందిన కుర్రాడు.. వయసుకు వస్తున్న కొద్దీ తనో స్త్రీనని తెలుసుకుంటాడు. ఆ స్త్రీత్వాన్ని ప్రేమించి, శస్త్రచికిత్స ద్వారా తనను తాను ‘రేవతి’గా మార్చుకుంటాడు. ఆ అబ్బాయి జీవితకథే ఈ పుస్తకం.సాధారణంగా అందరూ హిజ్రాలను అసహ్యించుకుంటారు. వాళ్ల వేషధారణ చూసి వెక్కిరిస్తుంటారు. కానీ వాళ్లు ఎలా ఉంటారు.. వాళ్ల ఆలోచనలేంటి.. వాళ్ల జీవితం ఎంత బాధాకరంగా ఉంటుందో ఈ పుస్తకంలో రచయిత చాలా నిజాయతీగా చెప్పారు. అది నాకు చాలా నచ్చింది. అందుకే తెలుగులోకి అనువదించాను. కానీ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం  లభిస్తుందని ఊహించలేదు. చాలా సంతోషంగా ఉంది.

- శాంతి జలసూత్రం


మరిన్ని