close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
వందేళ్ల విద్యార్థులు!

నలభైదాటితే చాలు... ఓపిక లేదంటారు..

అరవైదాటితే చాలు... కృష్ణారామా అంటారు....

కానీ వాళ్లు వందేళ్ల వయసులోనూ ఏబీసీడీలు దిద్దుతున్నారు..

ఎక్కాలు బట్టీపడుతున్నారు. పరీక్షలు పాసై అందరితో శెభాష్‌ అనిపించుకుంటున్నారు...

నారీశక్తి పురస్కారం అందుకుంటున్న ఈ ఇద్దరి బామ్మల విజయగాథని ఓ సారి చదివేయండి...

దువుకు అర్హత వయసు కాదు... ఆసక్తి మాత్రమే అని నిరూపించారు ఈ ఇద్దరు బామ్మలు. చదువుకోవాలనే తమ కలను లేటు వయసులో తీర్చుకుంటున్నారు. అతి పెద్ద వయసులో పరీక్షరాసిన మహిళగా ఒకరు చరిత్ర సృష్టిస్తే, ఏడాదిలో నిండునూరేళ్లు పూర్తికానున్న మరో బామ్మగారు ఆ రాష్ట్రంలోనే అత్యధిక మార్కులను సంపాదించుకున్న మహిళగా రికార్డుకెక్కింది. మహిళాశక్తికి మరోసారి అర్థం చెప్పిన ఈ ఇరువురు బామ్మలు తాజాగా నారీశక్తి పురస్కారానికి ఎంపికయ్యారు. వారే భాగీరధి, కాత్యాయని. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని దిల్లీలో రాష్ట్రపతి చేతులమీదుగా ఈనెల ఎనిమిదిన ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. అంతేకాదు, ఇటీవల మన్‌కీబాత్‌ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రశంసలనూ అందుకున్న ఈ ఇరువురు బామ్మలను వసుంధర పలకరించింది.


105ఏళ్లు నాలుగో తరగతి

అమ్మకోసం చదివింది

దువుకోవాలకున్న తన చిన్ననాటి కోరిక పెళ్లి, పిల్లలతో వాయిదాపడింది. ఆమెకు వందేళ్లు దాటినా ఆ కోరిక తీరనే లేదు. అయినా ఆమె రాజీపడలేదు. 105 సంవత్సరాల వయసులో నాలుగో తరగతి పాసై .. చిన్నచిన్న వైఫల్యాలకే విసిగే ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. కొల్లాంలోని పారాకులం ప్రాంతానికి చెందిన భాగీరథి తన స్ఫూర్తిగాథని ఇలా వివరించారు.

‘మాది మధ్యతరగతి కుటుంబం. మా అమ్మ చదువుకోలేదు. అందుకే నన్ను చదువుకోమనేది. కానీ నా తొమ్మిదో ఏట అమ్మ అనారోగ్యంతో చనిపోయింది. ఇంట్లో నేనే పెద్దదాన్ని. అమ్మ చనిపోవడంతో స్కూల్‌ మానేసి నా తోబుట్టువులను చూసుకునేదాన్ని. పెళ్లై అత్తింటికి వెళ్లా. నాకు నలుగురు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు. పిల్లలు పుట్టాకైనా చదువుకుందామంటే... మావారు చనిపోయారు. దాంతో వాళ్ల బాధ్యత నేనే పూర్తిగా తీసుకున్నా. ఇప్పుడు 105 సంవత్సరాలు. ఇప్పుడైనా మా అమ్మ కోరికను తీర్చాలనిపించింది. అందుకే నాలుగోతరగతి పరీక్షకు హాజరై 74.5 శాతం మార్కులతో ఉత్తీర్ణురాలినయ్యా. మా రాష్ట్రంలో ఈ పరీక్షరాసిన అత్యధిక వయసున్న మహిళగా నిలిచా’ అని చెబుతోంది భాగీరథి అమ్మ. మీ ఆరోగ్య రహస్యం ఏంటో చెప్పండి బామ్మగారూ అని అడిగితే... టీ, శాకాహారం అంటోంది.


99లో..

రాష్ట్రంలోనే టాపర్‌...

కేరళలోని చేప్పాడు దగ్గరున్న ముట్టం ప్రాంతానికి చెందిన కాత్యాయని వయసు 100 ఏళ్లకు ఒక సంవత్సరం తక్కువ. తండ్రి ఉపాధ్యాయుడు, తల్లి గృహిణి. వీరికి ఆరుగురు సంతానం. వారిలో అందరికన్నా కాత్యాయని పెద్దావిడ. తన 14వ ఏట వ్యవసాయ కుటుంబానికి చెందిన కృష్ణబుల్లాతో వివాహం జరిగింది. నాలుగో తరగతి ప్రవేశ పరీక్షలో రాష్ట్రంలోనే టాపర్‌గా నిలిచారు. చిన్నప్పటి నుంచి చదువుకోవాలనే ఆసక్తి ఎక్కువ అంటుందీమె. ‘బాల్యంలో అమ్మకు తోడుగా చెల్లెళ్లను చూసుకునేదాన్ని. దాంతో చదువుకోలేకపోయా. మా అత్తింటి వారిది వ్యవసాయ కుటుంబం కావడంతో పెళ్లైన తరువాత చదువుకోవడం కుదరలేదు. నాకు నలుగురు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు. పిల్లలు చిన్నవయసులోనే మావారు కన్నుమూశారు. ఆస్తులు లేకపోవడంతో నేను గుడిని శుభ్రం చేసే పనిలో చేరా. పిల్లలకు పెళ్లిళ్లు చేసే బాధ్యతతో అప్పుడూ చదవలేకపోయా. నెలకు 20 రూపాయలు జీతం వచ్చేది. వాటిలో మిగిల్చి పొదుపు చేసి పిల్లలందరికీ పెళ్లిళ్లు చేశా. నాలుగేళ్ల క్రితం వరకు గుడిలోనే పనిచేసేదాన్ని. నా 97 ఏళ్ల వయసులో చదువుకోవాలనే నా కలను ఇంట్లో వాళ్లకి చెప్ఫా మా మనవళ్లు, మనవరాళ్లు మొత్తం 15 మంది. వారి సాయంతో అక్షరాలను నేర్చుకోవడం మొదలుపెట్టా. అవార్డు అందుకోవడానికి విమానం ఎక్కాలట. అదే కాస్త టెన్షన్‌గా’ ఉందని నవ్వుతూ చెబుతుందీ 99 ఏళ్ల బామ్మగారు.


మరిన్ని