close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
కరోనాపై గాంధీవం

‘‘అనవసరంగా బయటకు రాకండి..
ఇంటి పట్టునే ఉండండి..’’ ఎల్లలు దాటొచ్చిన కరోనా మహమ్మారిని అరికట్టడానికి ప్రభుత్వం చేస్తున్న సూచనలు.
ఈ షరతులు వారికి వర్తించవు. ప్రమాదమని తెలిసినా.. కంటికి కనిపించని శత్రువు కట్టడిలో తలమునకలై ఉన్నారు.
కన్నవారు, కట్టుకున్న వాళ్లు, కడుపున పుట్టిన వాళ్లు.. ఇందరు దూరంగా ఉండేలా భయపెడుతున్న ‘కరోనా’కు అడ్డుగా నిలుస్తున్నారు వాళ్లు. సరిహద్దులో పహారా కాస్తున్న వీరజవాన్లుగా ఆస్పత్రిలో నిలబడి బాధితులకు భరోసా కల్పిస్తున్నారీ నర్సమ్మలు.
వైరస్‌ పీడితులను కాపాడేందుకు తమ ప్రాణాలను ఫణంగా పెడుతున్నారు.

కరోనా తెలంగాణ తలుపు తట్టింది మొదలు.. భాగ్యనగరిలోని గాంధీ ఆస్పత్రి పేరు మార్మోగిపోతుంది. అనుమానితుల తాకిడి మొదలైంది. బాధితుల సంఖ్య పెరుగుతోంది. విదేశాల్లో వేలమందిని పొట్టనపెట్టుకున్న మహమ్మారిపై మన వైద్యులు, వందల మంది సిబ్బంది పెద్ద యుద్ధమే చేస్తున్నారు. రాత్రనకా పగలనకా సేవలు అందిస్తున్నారు. చికిత్స చేయడంలో వైద్యులు తీరిక లేకుండా ఉంటే.. బాధితుల బాగోగుల బాధ్యత తమ భుజానికెత్తుకున్నారు నర్సమ్మలు. అనుక్షణం అప్రమత్తంగా ఉంటున్నారు. అయినవారే ఆమడ దూరం పాటించే పరిస్థితుల్లో.. బాధితులకు మనోధైర్యం అందిస్తూ.. స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

రోగులకు ఉపయోగించిన ప్రతి వస్తువునూ జాగ్రత్తగా సేకరించి బయోవేస్ట్‌ కింద ధ్వంసం చేస్తున్నారు. లేకుంటే వాటి వల్ల వైరస్‌ ప్రబలే ప్రమాదం ఉంది. ఈ పని కోసం నియమించిన ప్రత్యేక సిబ్బంది రాత్రింబవళ్లూ కష్టపడుతున్నారు. వీరిలో కూడా సింహభాగం మహిళలే ఉన్నారు.


24 గంటలూ అందుబాటులో..

కొద్ది రోజులుగా గాంధీ ఆస్పత్రికి 30 నుంచి 40 మంది కరోనా అనుమానితులు వస్తున్నారు. వారందరితో మాట్లాడి, ధైర్యం చెప్పడం సిబ్బంది పని. వైరస్‌ లక్షణాలతో వార్డుకు చేరినవారి బాగోగులు నర్సుల బాధ్యతగా భావిస్తున్నారు. 40 మంది నర్సులు అలుపెరగకుండా సేవలు అందిస్తున్నారు. షిఫ్టుల వారీగా 24 గంటలూ పని చేస్తున్నారు. ఉదయమే ఇంటి నుంచి బయటపడితే ఏ అర్ధరాత్రికో ఇళ్లు చేరుతున్నారు. కుదరని రోజు ఆస్పత్రిలోనే నడుం వాల్చి.. తెల్లవారడంతోనే విధుల్లోకి దిగుతున్నారు. వైద్యులు, ఇతర సిబ్బందిలోనూ మహిళలు ఎందరో ఉన్నారు. వైద్యం అందివ్వడంలో వీరందరి పాత్రా కీలకమే! ఫీవర్‌ ఆస్పత్రి, ఛాతీ ఆస్పత్రిలోనూ మహిళా సిబ్బంది క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.


మనో ధైర్యమిస్తూ..

కరోనా బాధితుడి దగ్గరికి ఎవరినీ రానివ్వరు. కుటుంబ సభ్యులనూ అనుమతించరు. అలాంటి సమయంలో వారికి చికిత్సతో పాటు ధైర్యాన్నిచ్చే నాలుగు మంచి మాటలు ఉపశమనాన్ని ఇస్తాయి. ఈ సమయంలో మహిళా సిబ్బంది తల్లుల పాత్ర పోషిస్తున్నారు. అవసరమైన చికిత్స అందిస్తూనే.. అక్కరకొచ్చే నాలుగు మంచి మాటలు చెబుతున్నారు. గంటకోసారి బీపీ, జ్వరం వంటివి పరిశీలిస్తూనే.. చిరునవ్వుతో,  సహృదయంతో పలకరిస్తున్నారు. బాధితుడికి నిబ్బరాన్నిస్తున్నారు.


ఆప్త బంధువులుగా..

ఆదమరిస్తే అసలుకే ఎసరు తెచ్చే ఈ మహమ్మారిపై యుద్ధం చేస్తున్న వీరికీ కుటుంబాలున్నాయి. ఇంటి నిండా బాధ్యతలున్నాయి. కొందరికి చెప్పుకోలేని బాధలూ ఉన్నాయి. అన్నీ ఇంటి దగ్గరే విడిచిపెట్టి వస్తున్నారంతా! బరిలోకి దిగిన తర్వాత కరోనాను కట్టడి చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నారు. ప్రత్యేక సూటు ధరిస్తున్నారు. కళ్లకు ప్రత్యేక అద్దాలు, చేతులకు గ్లౌజులు, నోటికి ఎన్‌95 మాస్క్‌ పెట్టుకొని.. రంగంలోకి దిగుతున్నారు. ప్రేమగా సేవలందిస్తూ అయినవారికి దూరంగా ఉన్న రోగులకు ఆప్తబంధువులవుతున్నారు. ఆస్పత్రిలో పని చేస్తున్న వీరిని బయట అనుమానంగా చూస్తున్న సందర్భాలు ఎదురవుతున్నాయి. వాటన్నిటినీ తేలిగ్గా తీసుకుంటూ.. తమ కర్తవ్యాన్ని పాటిస్తున్న ఈ నర్సమ్మలకు జేజేలు చెప్పేద్దాం.


 


మరిన్ని