close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
మన్ను అన్నంగా...

ఇవేవో మనం ఎండాకాలం పెట్టే పిండి వడియాల మాదిరిగా ఉన్నాయే అనుకుంటున్నారా? అవి వడియాలనే మాట నిజమే కానీ... పిండి వడియాలో, గుమ్మడి వడియాలో మాత్రం కాదు. మామూలు మట్టితో చేసిన వడియాలు. ఆశ్చర్యంగా ఉందా? హైతీ మహిళలు ఆకలిని చల్లార్చుకోవడానికి ఇలా మట్టితో క్లే కుకీస్‌ని తయారుచేసి వాటినే తింటూ, జీవనోపాధికోసం అమ్ముకుంటారు..

ఈ మట్టి వడియాల వెనుక హైతీ మహిళల దయనీయమైన గాథ ఉంది. కన్నీళ్ల కథ ఉంది. మట్టిలో కొద్దిగా ఉప్పు కలిపి ‘మడ్‌ కేక్స్‌’ లేదా ‘గెటొ టె’, క్లేకుకీస్‌ని తయారు చేసి ఎండబెడతారు. అవి ఎండిన తర్వాత... ఆకలివేసినప్పుడు వాటినే తింటారు. స్థానికులకు అమ్ముతారు కూడా.

అలాగని ఇదేం వారి అభిరుచి కాదు. పేదరికాన్ని ఎదుర్కోవడానికి వేరే దారిలేని స్థితిలో ఈ క్లే కుకీస్‌ని తయారుచేసి అమ్ముకుంటున్నారు. కొద్దిపాటి క్యాల్షియం మాత్రమే ఉండే వీటి తయారీ ముందు నుంచీ ఆ ప్రాంతంలో ఉన్నా... హైతీలో వచ్చిన భూకంపం కారణంగా అది వారి జీవనోపాధిగా మారిపోయింది. సుమారు మూడు లక్షల మంది స్త్రీలు వీటిని తయారుచేసి ఆదాయం పొందుతున్నారు. హైతీని కుదిపేసిన భూకంపం కారణంగా పదిలక్షల ఇళ్లు నేలకూలాయి. రోడ్లు దారుణంగా దెబ్బతినడంతో మారుమూల ప్రాంతాల్లో ఉన్న గర్భిణులు, పిల్లలు సాయం అందుకోవడానికి ఇతర ప్రాంతాలకు వెళ్లలేకపోయారు. దాంతో మట్టి కేకులను తింటూ ఆకలి తీర్చుకున్నారు. ఇప్పటికీ పరిస్థితిలో పెద్దగా మార్పు లేదట.


మరిన్ని