close

వసుంధర

ఖమ్మం మహిళల చేయూత!

ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా మాట్లాడుకుంటోంది కరోనా గురించే. దీని వ్యాప్తిని నిరోధించడానికి తమ వంతు ప్రయత్నం చేయడానికి ముందుకు వచ్చారు ఖమ్మం జిల్లా మెప్మా సంఘాల మహిళలు. మాస్కులు, శానిటైజర్ల తయారీలో భాగమై... వైద్యులు, పోలీసులు, అధికారుల మాదిరిగా తామూ ప్రజలకు సాయం చేస్తామంటున్నారు.

రోనా వైరస్‌ హెచ్చరికల నేపథ్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మాస్కులు, శానిటైజర్ల కొరత తీవ్రంగా ఏర్పడింది. చాలా ప్రాంతాల్లో స్టాక్‌ లేదనే బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఖమ్మం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) ఆధ్వర్యంలో మహిళలు... వీటి తయారీకి సిద్ధమయ్యారు. ఇప్పటికే నగరంలోని ప్రభుత్వ కార్యాలయాలు, వసతిగృహ విద్యార్థులకు వేలాది మాస్కులు అందజేశారు. ప్రస్తుతం శానిటైజర్ల తయారీకి శ్రీకారం చుట్టారు.

వారంలో ఇరవై వేలు...

మూడు నెలల క్రితం జిల్లా నుంచి ఎనిమిది మెప్మా గ్రూపుల మహిళలకు కుట్టుపనులపై అధికారులు శిక్షణ ఇప్పించారు. కరోనా నేపథ్యంలో... ఇప్పుడు వారిని మాస్కుల తయారీపై దృష్టిసారించమని జిల్లా ఉన్నతాధికారులు సూచించారు. దీంతో నగరంలోని తొమ్మిది ప్రాంతాల్లో వారం రోజులుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ పనిలో నిమగ్నమైన 80మంది మహిళలు... ఇప్పటి వరకు 21వేలకు పైగా మాస్కులు కుట్టారు. వీటిని జిల్లా కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, నగరపాలక సంస్థ కమిషనర్‌ అనురాగ్‌ జయంతి ఆధ్వర్యంలో వివిధ శాఖల ఉద్యోగులకు, మున్సిపాలిటీలకు, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బందికి ఉచితంగా అందించారు.

శానిటైజర్‌లూ చేస్తున్నారు...

మెప్మా ద్వారా శానిటైజర్‌ లిక్విడ్‌ను తయారు చేసేందుకు కలెక్టర్‌ అనుమతివ్వడంతో పనులను ప్రారంభించారు. శిక్షణ కోసం ప్రయివేటు ల్యాబ్‌ సిబ్బందిని ఏర్పాటు చేయించారు. వీరు తయారుచేసే శానిటైజర్లు మరో రెండురోజుల్లో అందుబాటులోకి రానున్నాయి.

- అల్లూరి శ్యామ్‌కుమార్‌, ఖమ్మం నగరపాలకం, న్యూస్‌టుడే


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు