close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సీఎం మెచ్చిన కవిత!

జనం కరోనా భయంతో విలవిల్లాడుతున్నారు... ఎక్కడి నుంచి ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని వణికిపోతున్నారు... ఆమె ఆ మహమ్మారిపై పోరాడేలా అక్షర సేద్యం చేస్తున్నారు... ‘క్వారంటైనే మన వాలంటైన్‌... ఏమైందిప్పుడు.. క్షణాలు మాత్రమే కల్లోలితం. ఆత్మస్థైర్యాలు కాదు కదా! సమూహాలు మాత్రమే సంక్షోభితం.. సాయం చేసే గుండెలు కాదు కదా’ అంటూ! ఆ కవిత ముఖ్యమంత్రినే కదిలించింది.. గుండెధైర్యం నింపే ఇలాంటి రాతలు మరిన్ని కావాలన్నారాయన...

సీఎం మెచ్చుకోలు పొందిన ఆమె... నిజామాబాద్‌ జిల్లా బోధన్‌కు చెందిన ఐనంపూడి శ్రీలక్ష్మి... ఆమె రచయిత్రే కాదు.. సామాజిక సేవకురాలు, వ్యాఖ్యాత, ఆలిండియా రేడియోలో ప్రయోక్త.

శ్రీలక్ష్మి కవితని చదివిన సీఎం కేసీఆర్‌ స్వయంగా ఫోన్‌ చేశారు. ఎనిమిది నిమిషాలు మాట్లాడారు. పరిస్థితి కుదుట పడ్డాక ప్రగతిభవన్‌కి రమ్మంటూ ఆహ్వానం పలికారు. ఇలా అందర్నీ కదిలించేలా రాయడం ఆమెకి కొత్తేం కాదు. సామాజిక సమస్యలపై, ఉప్పెనలా వచ్చిపడుతున్న ఉత్పాతాలపై, మానవ అనుబంధాలపై 13 ఏళ్ల వయసు నుంచే రాస్తున్నారు. ప్రస్తుతం.. కరోనా భయం గుప్పిట్లో ఉన్న జనాన్ని చైతన్యం చేసేలా, తోటి మహిళా రచయిత్రులు రాసిన నలభై కవితలతో కూడిన పుస్తకం అచ్చు వేసే పనిలో ఉన్నారు. ఇలాంటి సమస్యలపై రాయడానికి ప్రేరణ ఏంటని అడిగితే ‘మా కుటుంబంలో రెండు, మూడేళ్లకొకరు చొప్పున రకరకాల క్యాన్సర్లతో ఐదుగురు చనిపోయారు. అది ఎవరూ తీర్చలేని దుఃఖం. ఏడుస్తూ కూర్చుంటే పోయినవారు తిరిగి రారు కదా. బాధితులకు సాంత్వన కలిగేలా, వాళ్లలో ఆత్మస్థైర్యం నింపేలా ‘వౌండెడ్‌ హార్ట్‌’ పేరుతో పదేళ్ల కిందట ఒక పుస్తకం రాశా. దీనికోసం వివిధ ఆసుపత్రులు తిరిగి చాలామంది క్యాన్సర్‌ బాధితుల్ని కలిశా. అప్పట్నుంచి జనాన్ని పీడించే సమస్యలపై రాస్తూనే ఉన్నా’ అంటున్నారామె. ఇప్పటి వరకు పది పుస్తకాలు రాశారు. ప్రపంచీకరణ మూలంగా విచ్ఛిన్నమవుతున్న అనుబంధాలు-ఆత్మీయతలు, సామాజిక సమస్యలు, మహిళలపై అఘాయిత్యాలు, సామాన్యుల బతుకు చిత్రాలు.. ఇవే ఆమె ఇతివృత్తాలు. గతంలో ఓసారి చార్మినార్‌కి వెళ్లి 24 గంటలపాటు అక్కడి వ్యక్తులు, పరిసరాల్ని వీడియో చిత్రీకిరించి, ఎడిట్‌ చేశారు. ఈ వీడియోకి అనుగుణంగా కవిత్వం రాసి ‘డాక్యూ పోయెమ్‌’ అనే ప్రక్రియకు రూపకల్పన చేశారు. ఈరకమైన సాహిత్య ప్రక్రియ ప్రపంచంలోనే మొదటిది అంటారామె.

సామాజిక సేవలోనూ..

అక్షర చైతన్యం కలిగించడమే కాదు.. రాతని చేతల్లో చూపించేలా సామాజిక సేవకూ ముందున్నారు శ్రీలక్ష్మి. లియో క్లబ్‌, రోటరీ క్లబ్‌, లయన్స్‌ క్లబ్‌ల్లో మంచి స్థానంలో ఉన్నారు. ఈ సంస్థల తరఫున వేల కంటి శస్త్రచికిత్సలు చేయించారు. తెలుగు మహిళా రచయితల సంఘానికి ఆమె వ్యవస్థాపకురాలు. అభిప్రాయ బేధాలున్న ఎందరినో ఒక్కతాటిపైకి తీసుకొచ్చారు. చేస్తున్న సామాజిక చైతన్య కార్యక్రమాలు తక్కువేం కాదు. 2011లో ఎయిడ్స్‌ కంట్రోల్‌ ప్రాజెక్ట్‌ కమిషనర్‌ పార్థసారధి నిర్వహించిన కార్యక్రమానికి 138మంది రచయిత్రులను తీసుకొచ్చారు. అప్పటికప్పుడే వందల కథలు, కవితలు రాయించారు. రైతుల గురించి ఎవరూ రాయడం లేదని వ్యవసాయ మంత్రి వాపోతే.. దాన్ని సవాల్‌గా తీసుకున్నారామె. ఇంటర్నేషనల్‌ సీడ్‌ కార్పొరేషన్‌ సభకి ఎనిమిది రాష్ట్రాల నుంచి 300 మంది రచయిత్రులను పిలిపించి కవితలు రాయించారు. వినియోదారుల హక్కుల కోసమూ పోరాడుతున్నారు. ఒకసారి 65 మంది అత్యాచార బాధితులందరినీ సంఘటితం చేసి ఐపీఎస్‌ స్వాతి లాక్రా ఇంటికి తీసుకెళ్లారు. వారికి చేయాల్సిన న్యాయం చేసి, బాధితుల అనుభవాలతో ఒక పుస్తకం అచ్చు వేయించారు. ఆలిండియా రేడియోలో ప్రయోక్తగా పని చేస్తూనే శ్రీలక్ష్మి ఏమాత్రం తీరిక దొరికినా ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.

కుటుంబం తోడుగా

శ్రీలక్ష్మి నాన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు. సామాజిక సేవలోనూ ముందుండేవారు. బోధన, సేవలకుగాను రాష్ట్రపతి పురస్కారం అందుకున్నారు. పాటలు రాసే ఆయన స్ఫూర్తితోనే శ్రీలక్ష్మి కవితలు రాయడం ప్రారంభించారు. ఆమె అన్నయ్య పద్దెనిమిదేళ్ల వయసులో వాయుసేనలో చేరి దేశానికి సేవలందించారు. పదవీ విరమణ తర్వాత అమెరికా ఎయిర్‌ఫోర్స్‌లో చేరారు. అమెరికా అప్పటి అధ్యక్షుడు బరాక్‌ ఒబామా నుంచి రెండుసార్లు ఉత్తమ ఉద్యోగి అవార్డు అందుకున్నారు. ప్రతి ఏడాది కుటుంబంతో కలిసి ఇండియాకు వచ్చి నెలరోజులపాటు పుట్టపర్తి ఆశ్రమంలో సేవలు చేసి వెళ్తారాయన.


గుర్తింపు

* డాక్యు పోయెమ్‌కి పాలపిట్ట-కపిసో జాతీయ అవార్డు

* తెలుగు యూనివర్సిటీ కీర్తి పురస్కారం

* రాష్ట్రప్రభుత్వం విశిష్ట పురస్కారం. లక్ష రూపాయల నగదు.

* కుందుర్తి రంజని జాతీయ అవార్డు

* వీసీ కృష్ణకుమారి చేతుల మీదుగా సాహిత్య అవార్డు

* వంగూరి ఫౌండేషన్‌ పురస్కారం


జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు