close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఈ బిగ్‌బాస్‌ ఇంట్లో నెగ్గాలంటే...

కరోనా సీజన్‌

దేశమంతా లాక్‌డౌన్‌లో ఉంది. మరో ఇరవై రోజులు ప్రతి ఇల్లూ బిగ్‌బాస్‌ హౌసే! బిగ్‌బాస్‌ ఆదేశాల మేరకు నడుచుకోవాల్సిందే!! ఉన్నదాంతో సరిపెట్టుకోవాల్సిందే. హెచ్చరికలు పెడచెవిన పెట్టి లేని హెచ్చులకు పోతే ప్రమాదంలో పడతారు. ఈ ఇరవై రోజులు.. కరోనా పేట్రేగితే ఇంకొన్ని రోజులు ఈ సీజన్‌ కొనసాగనుంది. ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవడం ఎలాగో మహిళకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే దీన్ని ఇంటిల్లిపాదీ పాటించేలా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఆమెదే!

బిగ్‌బాస్‌ మిమ్మల్ని వంట దినుసులు పొదుపుగా వాడుకోమంటున్నాడు. ఆహారాన్ని వృథా చేయొద్దని సూచిస్తున్నాడు. ఇప్పుడు ఇండియా మొత్తం బిగ్‌బాస్‌ కరోనా సీజన్‌ నడుస్తోంది. ఈ బిగ్‌బాస్‌ లక్ష్యం ఒక్కటే.. సమాజ హితం. సాధనం ఒక్కటే.. సాంఘిక దూరం. ఈ ఆటలో అందరూ గెలవాల్సిందే. ఒక్కరు నామినేట్‌ అయినా.. సమాజమంతా రిస్క్‌లో పడే ప్రమాదం ఉంది. అందుకే కొన్నాళ్లు సభ్యులంతా ఇంట్లోనే ఫ్రీజ్‌ అవ్వాలంటున్నాడు బిగ్‌బాస్‌. తన తదుపరి ఆదేశాలు వచ్చేదాకా రిలీజ్‌ అయ్యే ప్రసక్తే లేదని తేల్చేశాడు.

పరీక్ష-1 - పొదుపు కథ

ప్పటిదాకా చూసిన బిగ్‌బాసుల్లో లగ్జరీ బడ్జెట్‌ టాస్కులుండేవి. ఈ సీజన్‌లో అలాంటివేం ఉండవు. ఉన్నవి వాడుకోవడమే! పరిమిత వనరులను పరిపూర్ణంగా ఉపయోగించుకోవాలంతే. పోపులో వేసే జీలకర్ర నుంచి వాషింగ్‌ మెషిన్‌లో వేసే సర్ఫ్‌ వరకూ పొదుపుగా వాడాలి. పాలు, పెరుగు, కూరగాయలు వంటి నిత్యావసర సరకులు అందుబాటులో ఉన్నాయి కదా! అని.. పదార్థాలను దుబారా చేయొద్ధు రోడ్డుపైకి వచ్చిన ప్రతిసారీ.. నామినేషన్‌ ప్రమాదం పొంచి ఉంటుందని గుర్తించండి. ప్రతి వస్తువునూ జాగ్రత్తగా వాడండి. పప్పులు, ఉప్పులు నిండుకోకుండా చూసుకోండి. ఆవాలు అయిపోయాయనగానే.. జీవాలు పోయినట్టు ఇదైపోకండి. మెంతుల కోసం గెంతులు వేయకండి. ఉన్నవాటిని ఉన్నతంగా వాడుకోండి. ఇంట్లో వాళ్ల డిమాండ్లకు లొంగకుండా.. సమర్థంగా వ్యవహరించండి. నీటి వినియోగంలోనూ దుబారాకు తావివ్వకండి.

 

పరీక్ష-2 - వృథా సున్నా కావాలి..

ఇంట్లోనే ఉన్నామని ఆరగింపు సేవల సంఖ్యను పెంచేస్తుంటారు. డ్రాయింగ్‌ రూమ్‌ నుంచి ఆదేశాలు జారీ చేస్తుంటారు అందరూ. చిరుతిళ్లు, వేపుళ్లతో కడుపు నింపేస్తుంటారు. ఫలితం సీజన్‌ పూర్తయ్యేసరికి బరువు పెరిగే ప్రమాదం ఉంది. ఈ విషయంలో పట్టపురాణి పట్టుకోల్పోకూడదు. ఇంట్లోవాళ్లందరూ సంతోషంగా తింటారని నాలుగైదు వంటకాలు చేసేయకండి. మీరు చేస్తున్న వృథా.. పరోక్షంగా ఓ కుటుంబానికి ఒక భోజనాన్ని కోల్పేయేలా చేయొచ్ఛు వారానికి కనీసం కిలో ఉల్లిగడ్డలు వాడతాం అనుకుంటే.. దాన్ని అరకిలోకు పరిమితం చేయండి. మీ కట్టడి.. మరో కుటుంబానికి వారానికి సరిపడా ఉల్లిగడ్డలను అందిస్తుంది! దొరికాయని మరీ ఎక్కువ కూరగాయలు తెచ్చుకోకండి. అవి పాడైపోతే.. మరొకరికి లేకుండా చేసినవాళ్లం అవుతాం. వృథా అయ్యేది మన డబ్బులే. ఆహార పదార్థాల వృథాను సున్నాకు తగ్గించండి. పదార్థాల దుర్వినియోగం ఇప్పుడంతగా తెలియకపోవచ్చు! కానీ, పరిస్థితులు మరింత చేజారితే బయట ఏమీ దొరక్కపోవచ్ఛు ఆ దుస్థితి రాకుండా ఉండాలంటే పరిమితంగా వండాలి. మితంగా తినాలి. ఆరోగ్యంగా ఉండాలి.

పరీక్ష-3 - కాసులు కరగనీయొద్దు

ప్రస్తుతం కాలం భారంగా నడుస్తున్నా.. కాసులు మాత్రం ఇట్టే కరిగిపోతున్నాయ్‌. బిగ్‌బాస్‌ ఆదేశాలను బేఖాతరు చేసి సరకుల రేట్లు పెంచేస్తున్నారు. కఠిన చర్యలు తీసుకుంటామంటున్నా.. తీరు మార్చుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో డబ్బుల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. అత్యవసరమైతే తప్ప అంగడికి వెళ్లొద్ధు ఆన్‌లైన్‌లో బేరసారాలొద్ధు ఓ మోస్తరు అవసరాలు తీర్చే వస్తువుల కొనుగోళ్లను వాయిదా వేయండి. వాయిదాలు కట్టాల్సినవి ఉంటాయి. ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. ఎలాగూ బయటకు వెళ్లే పని లేదు కాబట్టి... ఎంతో కొంత మొత్తం ఆదా అయినట్టే! పిల్లల డిమాండ్లను ససేమిరా ఒప్పుకోకండి.

పరీక్ష-4 - గ్యాస్‌తో జాగ్రత్త..

రోజులు గడిచే కొద్దీ బిగ్‌బాస్‌లో షరతులు పెరిగినట్టు.. రానున్న కాలం మరింత కఠినంగా ఉండొచ్ఛు అధైర్య పడాల్సిన అవసరం లేదు. అప్రమత్తంగా ఉంటే చాలు. ఇప్పుడున్న లాక్‌డౌన్‌ పెట్రోలు, గ్యాస్‌ వంటి అత్యవసరాలకూ పాకితే.. ఇబ్బంది తప్పదు. ఇంధన వినియోగంలోనూ పొదుపు మంత్రం పఠించాల్సిన అవసరం ఉంది. గ్యాస్‌ని పరిమితంగా వినియోగించాలి. బయట తిరగొద్దు అంటున్నా.. పోలీసుల కళ్లుగప్పి ఎక్కడికో వెళ్లాలన్న ప్రయత్నాలు మానుకోవాలి. మనం వినియోగించుకునే ఇంధనం మరొకరికి అత్యవసరంగా మారొచ్ఛు ప్రతి ఒక్కరూ ఈ స్పృహతో మెలగాలి.

పరీక్ష-5 - ఒత్తిళ్లను అధిగమించి..

ఆఫీస్‌లో ఉన్నప్పుడు.. ‘వారానికి ఒక్కరోజే సెలవు.. ఇంట్లో ఉన్నట్టే లేదు’ అని నిట్టూర్చేవారు ఎందరో! ఇప్పుడు.. ఇరవైనాలుగు గంటలూ ఇంట్లోనే ఉండటం కత్తి మీద సామవుతోంది. మంచికోసమే అయినా.. కాళ్లు కట్టేసినట్టు కావడంతో విసుగెత్తిపోతున్నారు. వారానికే టీవీ మొహమొత్తినట్టయింది. ఫోనంటే చిరాకు పుట్టడం మొదలైంది. టీవీ బిగ్‌బాస్‌ షోలో అయితే.. టీవీ, ఫోన్‌ కూడా ఉండవు! దాంతో పోల్చుకుంటే కాస్త మేలే! లాక్‌డౌన్‌ ఎపిసోడ్‌ మొదలైంది ఇప్పుడే! ఇంకొన్ని వారాలు ఇంటికే పరిమితం కావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఓపికతో మెలగాలి. మానసిక ఒత్తిళ్లకు లొంగకుండా ఉండాలి. కుటుంబంలో వాతావరణం కలుషితం కాకుండా చూసుకోవాలి. వీటన్నింటికీ కావాల్సింది మనోధైర్యం. ఆ శక్తిని అందరూ పుంజుకోవాలి. ఆసక్తి ఉన్నవాటి మీదికి దృష్టిని మరల్చాలి. అప్పుడే కరోనా సీజన్‌ని విజయవంతంగా పూర్తి చేయగలుగుతాం. ‘బాగా ఆడిన కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు..’ అని బిగ్‌బాస్‌ మన్ననలు అందుకోగలుగుతాం.

 


జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు