close

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మన ఆత్మస్థైర్యం చూసి ‘కరోనా’ పారిపోతుంది

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి

దిల్లీ: కరోనాపై యుద్ధానికి రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ముందుకు కదులుతున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. దేశ ప్రజలను నెల రోజులుగా కరోనా అనేక రకాలుగా భయపెడుతున్నప్పటికీ ప్రజలు ధైర్యంగా ఎదుర్కొంటున్నారని అన్నారు. దిల్లీలోని కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో వివిధ రాష్ట్రాలు, శాఖల మధ్య మరింత సమన్వయం ఉండాలని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ పూర్తి బాధ్యత తీసుకుని సమస్యల పరిష్కారానికి కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రోజూ రాష్ట్ర ప్రభుత్వాలతో కంట్రోల్‌ రూం ద్వారా సంప్రదింపులు జరుపుతున్నట్లు వివరించారు. ఇక్కడ నుంచే ఎప్పటికప్పుడు రాష్ట్రాలకు సలహాలు, సూచనలు ఇస్తూ సమస్యలను పరిష్కరిస్తున్నట్లు కిషన్‌ రెడ్డి వివరించారు.

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్రాలతో సంప్రదింపులు చేస్తున్నామని.. ఈ క్రమంలోనే 80 కోట్ల మందికి నేరుగా ఉపయోగపడే విధంగా ఆర్థిక ప్యాకేజీ ప్రకటించామని కిషన్‌ రెడ్డి తెలిపారు. ఐటీ రిటర్న్‌ దాఖలు గడువును కూడా కేంద్రం పొడిగించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ 21 రోజుల పాటు నిబంధనలు పాటిస్తే కరోనా బారి నుంచి బయటపడొచ్చన్నారు. ఈ క్రమంలో ఒక రాష్ట్రంలోని వారిని మరో రాష్ట్రంలోకి అనుమతించొద్దని.. లాక్‌డౌన్‌ నిబంధనలు కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు వెళ్లొద్దని సూచించారు. దేశంలో కరోనా వ్యాప్తి ఎంత తీవ్రంగా ఉందో ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు. సరకు రవాణా వాహనాలకు తప్ప మిగతా వాహనాలకు ఎలాంటి అనుమతి లేదని.. ఈ విషయంలో రాష్ట్రాలు సమన్వయంతో పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నామని కిషన్‌ రెడ్డి వివరించారు. కరోనాపై పోరాడుతోన్న భారతీయుల ఆత్మస్థైర్యాన్ని చూసి తొందర్లోనే కరోనా వైరస్‌ దేశం నుంచి పారిపోతుందని కిషన్‌ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు