close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఉప్పు వేసుకొని అన్నం తిన్నా!

తనతో వచ్చినవారంతా సురక్షితంగా స్వదేశానికి బయల్దేరారు. ఆమె మాత్రం కరోనా వలలో చిక్కుకుపోయింది. 26 రోజులు చైనాలో బిక్కుబిక్కుమంటూ గడిపింది. ఊహించని ఇబ్బందులు దాటుకొని.. వూహాన్‌ నుంచి సొంతూరుకు చేరిన అన్నెం జ్యోతి.. తనకెదురైన అనుభవాలను వసుంధరతో పంచుకున్నారిలా..

పీడకల నుంచి బయటపడ్డా. చావుకు ఎదురెళ్లి వచ్చినట్టయింది నాకు. అమ్మ గుర్తొచ్చినప్పుడల్లా వెక్కివెక్కి ఏడ్చేశా. అమ్మ ఆశలన్నీ నామీద, తమ్ముడు మీదే. నాన్న చిన్నప్పుడే పోతే.. తానే అన్నీ అయి పెంచింది. ఆమె కోరుకున్నట్టుగానే ఉన్నతంగా చదువుకున్నాం. టీసీఎల్‌ ఫోన్‌ డిస్‌ప్లే ప్రొడక్షన్‌ సంస్థలో మంచి ఉద్యోగం వచ్చింది. అమ్మ కళ్లలో ఆనందం. ఆరు నెలల శిక్షణ కోసం చైనా వెళ్తున్నానంటే.. భారంగానే పంపించింది. గతేడాది ఆగస్టులో మొత్తం వందమంది వెళ్లాం. శిక్షణ పూర్తి కావొస్తుండగా.. కల్లోలం మొదలైంది. 52 మంది కొన్నాళ్ల ముందే ఇండియాకు బయల్దేరారు. 58 మందిమి మిగిలాం. రోజుల్లోనే కరోనా విజృంభించింది. విదేశీయులందరూ సొంత దేశాలకు వెళ్లిపోవాలని ఆదేశించింది అక్కడి ప్రభుత్వం. ఫిబ్రవరి ఒకటిన మేం తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాం.

కొన్ని నిమిషాలు గడిస్తే.. విమానం ఎక్కేయొచ్చు. గంటల్లో ఇండియాకు చేరిపోతాను. మర్నాటికి అమ్మ దగ్గరుంటాను అనుకున్నాను. నా టెంపరేచర్‌ చెక్‌ చేశారు అక్కడి అధికారులు. సాధారణ స్థాయి కన్నా తక్కువుందని ఆపేశారు. తర్వాత పంపిస్తామని చెప్పారు. మా కంపెనీ క్వార్టర్స్‌కి చేరుకున్నా. నేనొక్కదాన్నే మిగిలిపోయాను. నాలోనేనే కుమిలిపోయాను. కలలో కూడా ఊహించలేదు ఇలాంటి పరిస్థితి వస్తుందని. రోజులకు రోజులు క్వార్టర్స్‌లో ఒంటరిగా ఉన్నా. చైనా వెళ్లేటప్పుడు తీసుకెళ్లిన పచ్చళ్లు మాత్రమే ఉన్నాయి. మా సంస్థ కుక్‌ అక్కడే ఉండి ఆహారం అందించేవాడు. అక్కడందరికీ మాంసాహారం అలవాటు. అన్నంలోనూ మాంసం వేసేవారు. నాకు అలవాటు లేదు. అన్నాన్ని వేరుచేసి పచ్చడితో తినేదాన్ని. వేడి చేసి కడుపులో నొప్పి మొదలైంది. పచ్చళ్లు లాభం లేదనుకొని.. అన్నంలో నీళ్లు, ఉప్పు వేసుకొని తినడం మొదలుపెట్టా. అలా తింటున్నప్పుడు పగవాడికి కూడా ఇలాంటి కష్టాలు రాకూడదనిపించేది.

కాలక్షేపం కోసం టీవీ పెడితే.. కరోనా వార్తలే. భయంతో వణుకు వచ్చేది. మరోసారి విమానం ఉందని చెప్పినా.. అదీ రద్దయింది. ఈ బాధలో అమ్మతో ఫోన్‌లో మాట్లాడమే ఊరట. అయితే, అమ్మ ఏడ్చేసేది. నా మనసు మరింత బరువెక్కేది. ఫిబ్రవరి 27.. ఇండియాకు విమానం వెళ్తోందని కబురొచ్చింది. నాకు అనుమతి వచ్చిందని తెలిసింది. ఎగిరి గంతేయాలనిపించింది. అప్పటికీ మనసులో ఏదో సందేహం. విమానం ఎక్కే వరకు నమ్మొద్దనుకున్నా. గతంలో ఉష్ణోగ్రత సాధారణం కన్నా తక్కువుందని అన్యాయంగా ఆపేశారు. మళ్లీ అలాంటి పరిస్థితే ఎదురైతే ఎలా? అని భయపడ్డాను. ఇమ్మిగ్రేషన్‌ అయ్యేవరకు తీవ్ర ఒత్తిడికి గురయ్యా. విమానం గాల్లోకి ఎగిరాక గానీ.. నా మనసు కుదుటపడలేదు.

దిల్లీలో విమానం దిగగానే.. కొండంత ధైర్యం వచ్చింది. 15 రోజులు ఐసోలేషన్‌లో ఉండాలన్నారు అధికారులు. 26 రోజులు ఎక్కడో చైనాలో ఉన్న నేను.. దిల్లీలో పక్షం రోజులు ఉండలేనా! కాకపోతే అమ్మను వెంటనే చూడలేకపోయాననే బాధ. ఐసోలేషన్‌ క్యాంప్‌లో చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. కడుపునిండా ఆహారం పెట్టారు. కరోనా పరీక్షలో నెగిటివ్‌ వచ్చింది. మొన్న 14వ తేదీన కర్నూలుకు చేరా. కోవెలకుంట్ల మండలం బిజినవేములలో అమ్మమ్మ వాళ్లింటికి వెళ్లా. అమ్మ అక్కడే ఉంది. అమ్మను గట్టిగా హత్తుకొని గట్టిగా ఏడ్చాక.. ఇన్నాళ్లు నేను పడ్డ కష్టాలన్నీ ఆవిరైనట్టనిపించింది.!


మరిన్ని