close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
కిరీటం వదిలి..  స్టెత్‌  చేపట్టింది

న వృత్తి వైద్యం.. జీవిత లక్ష్యం మాత్రం ప్రపంచ సుందరిగా ఎంపికవడం. గతేడాది ఆ స్వప్నానికి చేరువైంది.. మిస్‌ ఇంగ్లండ్‌గా నిలిచింది. ఇదే ఊపులో ప్రయత్నిస్తే అందాల కిరీటం దక్కేదేమో! కానీ కరోనా కల్లోలం ఆమె మనసును మార్చేసింది. చిన్ననాటి కల పక్కన పెట్టి మళ్లీ స్టెతస్కోప్‌ అందుకుంది... అందగత్తెగా దక్కే ప్రశంసలకన్నా మానవత్వం ఉన్న మనిషిగా నిరూపించుకోవడమే ముఖ్యమంటున్న ఆ వైద్యురాలు బాషా ముఖర్జీ. మన భారత సంతతి అమ్మాయే...

శ్చిమ్‌బెంగాల్‌కు చెందిన బాషా తొమ్మిదేళ్ల వయసున్నప్పుడే కుటుంబంతో కలిసి బ్రిటన్‌కు తరలి వెళ్లింది. తర్వాత ఆమె నాటింగ్‌హామ్‌ విశ్వవిద్యాలయం నుంచి మెడిసిన్‌ పూర్తి చేసింది. బాల్యం నుంచే సేవా భావంతో ఉండే బాషా 17వ ఏటనే ‘ద జనరేషన్‌ బ్రిడ్జి ప్రాజెక్ట్‌’ అనే స్వచ్ఛంద సంస్థ ప్రారంభించి వృద్ధులు, యువతరాన్ని అనుసంధానం చేసే కార్యక్రమాలు చేపడుతోంది. స్థానిక ఎన్జీవోలతో కలిసి బాలికలకు విద్య, నెలసరి అంశాలపై అవగాహన కల్పిస్తోంది. ఆఫ్రికా దేశాలు, ఇండియా, టర్కీ, పాకిస్థాన్‌ల్లోనూ పర్యటించి అవగాహన సదస్సులు నిర్వహించింది. మధుమేహాన్ని నిర్మూలించడానికి స్థానిక ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లోనూ పాల్గొంటోంది. ప్రస్తుతం పిలిగ్రిం ఆసుపత్రిలో జూనియర్‌ డాక్టర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. ఇదంతా ఒక ఎత్తు. ప్రపంచ సుందరి కావాలనేది ఆమె చిన్ననాటి కల. దానికి తగ్గట్టే సౌందర్యంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. పోరాట విద్యలు నేర్చుకుంది. కచ్చితమైన ఆహార నియమాలు పాటిస్తోంది. ఎప్పటికప్పుడు ప్రపంచ విషయాలపై అవగాహన పెంచుకుంటోంది. మొదట్నుంచీ అందాల పోటీలకు అనుగుణంగా దీక్షతో సమాయత్తమయ్యేది. చివరికి గతేడాది డిసెంబరులో మిస్‌ ఇంగ్లండ్‌గా ఎంపికై మిస్‌ వరల్డ్‌ పోటీలకు అర్హత సాధించింది. దాదాపు తన లక్ష్యానికి చేరువైంది. ప్రపంచ పోటీలకు ఇంకా ఒక్క అడుగే దూరం. ఈ కీలక సమయంలో కరోనా విరుచుకుపడింది. ఆ మహమ్మారి బారిన పడి ఇంగ్లండ్‌ అతలాకుతలమవుతోంది. ఈ కష్ట సమయంలో వైద్యుల అవసరం ఉండటంతో తన లక్ష్యాన్ని పక్కన పెట్టేసి తిరిగి విధుల్లో చేరింది బాషా.

భారత సంతతి అమ్మాయినైనా ఇంగ్లండ్‌ ప్రజలు నన్ను అమితంగా ప్రేమించారు. వారి మనసులో చోటిచ్చారు. నన్ను మిస్‌ ఇంగ్లండ్‌-2019గా ఎంపిక చేశారు. నన్ను ఆదరించిన వారంతా ప్రస్తుతం కష్టాల్లో ఉన్నారు. కరోనా బారినపడి విలవిల్లాడుతున్నారు. ఈ గడ్డు సమయంలో వారికి చేయూతనందించడం నా బాధ్యతగా భావిస్తున్నా. ఇప్పుడు ఇంగ్లండ్‌ ప్రజల రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. మిస్‌ ఇంగ్లండ్‌ అనే పేరు కన్నా ఇప్పుడు నేను డాక్టర్‌ బాషా ముఖర్జీగా ఉండటానికే ఇష్టపడుతున్నా.


మరిన్ని