close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఇల్లే కదా...స్వచ్ఛసీమ!

లాక్‌డౌన్‌తో పట్టణాలు, నగరాల్లో కాలుష్యం భారీగా తగ్గిందంటున్నారు...సంతోషం! కానీ అంతా ఇంటికే పరిమితం కావడంతో గృహ కాలుష్యం పెరిగిందంటున్నారు... ఇది ఆలోచించాల్సిన విషయమే!  ఇంటిని స్వర్గ సీమలా సురక్షితంగా మార్చేది ఇల్లాలే కదా..  ఇప్పుడైనా.. ఎప్పుడైనా ఆ కాలుష్య ఉద్గారాల పని పట్టాల్సిందే! అందుబాటులో ఉన్న మార్గాలు వెతకాల్సిందే...
వాహనాలు, పరిశ్రమల్లోంచి వెలువడే కాలుష్యం సరే.. గృహ కాలుష్యం ఏంటన్నది చాలామందికి అర్థం కాని విషయం. కాస్త లోతుగా ఆలోచిస్తే ఇది తేలిగ్గానే అర్థమవుతుంది. ఇంట్లోని దుప్పట్లు, కార్పెట్లు, కర్టెన్లు, పెంచుకునే మొక్కలు, పెంపుడు జంతువులు, వంటగది వాయువులు, వాడుకునే ఉపకరణాలు.. ఇవన్నీ కాలుష్య కారకాలే. కుటుంబ సభ్యులు అధికంగా ఇంటిలో మెలిగితే ఆటోమేటిగ్గా కాలుష్యం పెరిగిపోతుంది. ఆస్తమా, చర్మవ్యాధులు, తుమ్ములు, దగ్గులు, ఆయాసం, అలర్జీలు, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు పట్టి పీడిస్తాయి. వీటికిలా చెక్‌ పెట్టేద్దాం.


శుభ్రం చేద్దాం

వంట సోడా, వెనిగర్‌ సహజ క్లెన్సర్లు. శానిటైజర్లతోపాటు ఒక మగ్గులో చెంచా వెనిగర్‌ వేసి ఇల్లంతా తడి గుడ్డతో తుడవాలి. వెనిగర్‌ బయో క్లీనర్‌గా పని చేస్తుంది. బ్యాక్టీరియాని చంపేస్తుంది. రిఫ్రిజిరేటర్‌లో ఆహార పదార్థాలు ఎక్కువ కాలం నిల్వ ఉంచితే బూజు పోగవుతుంది. దీన్ని నిర్మూలించడానికి చిన్న గిన్నెలో వెనిగర్‌ వేసి ఫ్రిజ్‌లో ఓ మూలన పెడితే చాలు. చీమలు, బొద్దింకలు, చిన్నచిన్న పురుగులు సహజంగానే కాలుష్య వాహకాలు. బయటి కాలుష్యాన్ని ఇల్లంతా వ్యాపింపజేస్తాయి. వీటిని అరికట్టడానికి వంట సోడా అక్కడక్కడా చల్లాలి.  


ఎయిర్‌ ఫ్రెష్‌నర్లు అతిగా వాడొద్దు

ఇల్లంతా సువాసనభరితంగా ఉండాలని కొందరు కృత్రిమ ఎయిర్‌ ఫ్రెష్‌నర్లు వాడుతుంటారు. ఇవి బెంజీన్‌, హైడ్రోకార్బన్‌ వంటివాటిని వాతావరణంలోకి వెలువరిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి కళ్లు, ముక్కు, గొంతుపై దుష్ప్రభావం చూపే అవకాశం ఉంది. దీర్ఘకాలంలో ఊపిరితిత్తులపై ప్రభావం చూపించే అవకాశమూ లేకపోలేదు.  


వెలుతురు ముఖ్యం

ఇంట్లోకి ధారాళంగా వెలుతురు వచ్చేలా కిటికీలు, తలుపులు తెరిచి ఉంచాలి. రోజుకి నాలుగైదు గంటలైనా సూర్యరశ్మి ఇంట్లో నేరుగా పడేలా చేయాలి. దీంతో ఒంటికి ‘డి’ విటమిన్‌ అందడమే కాదు.. కర్టెన్లు, ఇతర వస్తువులపై పేరుకుపోయిన కొన్ని రకాల బ్యాక్టీరియా, బూజు నశిస్తుంది. విడిచిన దుస్తులు, మనుషుల చెమట, గదిలోని తేమ ఆరిపోతుంది. వంటగదిలో పోపులు వేసినప్పుడు వెలువడే ఘాటైన వాయువులు బయటికి పోతాయి.


ఆ కొవ్వొత్తులు వద్దు

సువాసనలు, వెలుతురు కోసం వెలిగించే కొవ్వొత్తులను చాలావరకు గపారఫిన్‌ అనే పెట్రోలియం ఉత్పత్తులతో తయారుచేస్తారు. ఇవి వాతావరణంలోకి విష రసాయనాలు వెదజల్లుతాయి. వీటికి బదులు తేనెటీగల మైనం నుంచి తయారు చేసినవి వాడితే మేలు. సోయా, కాటన్‌, వుడ్‌, కోకోనట్‌ ఉత్పత్తులతో చేసినవైనా మంచివే.


బొగ్గుతో భళా

కట్టెల బొగ్గు (చార్‌కోల్‌) సహజసిద్ధమైన ప్యూరిఫయర్‌గా పని చేస్తుంది. పలుచని వస్త్రంతో తయారుచేసిన సంచిలో కొన్ని బొగ్గు ముక్కలువేసి గదిలో ఒక మూలన పెట్టాలి. ఇది వాతావరణంలోని తేమ, దుమ్మూధూళీ, సూక్ష్మక్రిములను లాగేస్తుంది. మూణ్నాలుగు రోజులకోసారి దాన్ని ఎండలో పెట్టి మళ్లీ వాడుకోవచ్చు. వీటిని ఫ్లవర్‌ వాజ్‌ల్లోనూ వేసుకోవచ్చు. రావి చెట్టు బెరడును కాల్చితే వచ్చే బొగ్గునూ ఇలా వాడొచ్చు. మోదుగు చెట్టు బొగ్గు సైతం బాగా పని చేస్తుంది. సైంధవ లవణం అని పిలిచే పింక్‌ సాల్ట్‌ గడ్డను ఒక పింగాణీ పాత్రలో పెట్టి ఇంటిలో ఉంచాలి. సూక్ష్మక్రిములు, కాలుష్య కారకాలు, మనం వదిలిన గాలిని అది పీల్చుకుంటుంది. గాలిని స్వచ్ఛంగా మారుస్తుంది.


మొక్కలు అతిగా వద్దు

కొందరు ఇంటినిండా మొక్కలు పెంచేస్తుంటారు. మొక్కలు రాత్రిపూట కార్బన్‌ డై ఆక్సైడ్‌ విడుదల చేస్తుంటాయనే విషయం మరవొద్దు. పామ్‌, గన్నేరు చెట్లు వంటివి ఇంట్లో పెంచొద్దు. తులసిలాంటి ఒకట్రెండు మొక్కలకే పరిమితం కావాలి.


ధూపంతో ఆరోగ్యం దేదీప్యం

సాలవృక్షం నుంచి తీసిన జిగురుతో వారంలో ఒకట్రెండు రోజులు ధూపం వెలిగిస్తే మంచిది. అలా చేసిన ప్రతిసారీ తలుపులు తెరిచి పెట్టాలి. లోపల ఉండే తేమ, దుర్వాసన, బ్యాక్టీరియా పోతుంది. కర్పూరానికి పిప్పర్‌మెంట్‌ ఆయిల్‌ జత చేసి, నెయ్యితో కలిపి వెలిగిస్తే గదిలోని బ్యాక్టీరియా నశిస్తుంది. యూకలిప్టస్‌ నూనె సహజసిద్ధమైన ప్యూరిఫయర్‌. దీపం వెలిగించి దానిపైన ఒక గిన్నె పెట్టి ఒకట్రెండు చెంచాల యూకలిప్టస్‌ తైలం వేయాలి. వేప బెరడు, వేప నూనెకి కాలుష్యాన్ని తగ్గించే శక్తి ఉంటుంది. అందులో ఉండే నిమోడిన్‌ అనే పదార్థం నైట్రస్‌ ఆక్సైడ్‌ని పారదోలుతుంది. ప్రమిదతో దీపం పెట్టి పైన గిన్నెలో కొద్దిగా వేప నూనె వేస్తే బ్యాక్టీరియా, ఫంగస్‌ వంటివి చనిపోతాయి.- డాక్టర్‌ పెద్ది రమాదేవి, ఆయుర్వేద నిపుణులు


మరిన్ని