close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
సేవాకావ్యం

మామూలు రోజుల్లోనే వారి గురించి ఎవరూ పట్టించుకోరు. ఒకరినొకరు అనుమానంగా చూస్తున్న ఈ రోజుల్లో మతిస్థిమితం లేని వారి బాగోగులు ఎవరు చూస్తారు? నోరు తెరిచి ఆకలి అని చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నవారి బాధ్యతను స్వీకరించింది కావ్యశ్రీ బృందం. భాగ్యనగర వీధుల్లో తచ్చాడుతున్న అభాగ్యులకు అండగా ఉంటోంది. వారి ఆకలి తీరుస్తోంది.
హైదరాబాద్‌లో ఆదాబ్‌ అనే అందాలుంటాయి. అయ్యో అనుకొనే దృశ్యాలూ ఉంటాయి. అందరికీ తెలిసిన సెలబ్రిటీలు కంటపడతారు. ఎవరికి పట్టని నిర్భాగ్యులూ తారసపడతారు. అలా ఎదురైన అభాగ్యుల ఆకలి తీర్చడమే లక్ష్యంగా పనిచేస్తోంది కావ్యశ్రీ అండ్‌ కో. లుంబినీపార్క్‌, కోఠి ప్రభుత్వాసుపత్రి, ఫీవర్‌ హాస్పిటల్‌, సచివాలయం.. ఇలా పలు ప్రాంతాల్లో మానసిక వికలాంగులు, దివ్యాంగులు, నిరుపేదలను గుర్తించి వాళ్లున్న చోటుకే వెళ్లి ఆహారం అందిస్తున్నారు. రోజువారీ కూలీల ఆకలీ తీరుస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులకూ ఆహార పదార్థాలు ఇస్తున్నారు. లాక్‌డౌన్‌ వేళ శుచి, శుభ్రతలకు ప్రాధాన్యమిస్తూ.. భౌతిక దూరం పాటిస్తూ.. సేవలు అందిస్తున్నారు వీళ్లు..
అయిదేళ్ల కిందట ‘ఫీడ్‌ ది హంగర్‌ బై కెఎస్‌కె’ సంస్థను స్నేహితులు శ్రీకాంత్‌, కృష్ణతో కలిసి స్థాపించారు కావ్య.  ప్రతి ఆదివారం గాంధీ హాస్పిటల్‌ దగ్గర సాయంత్రం అవసరమైన వారికి ఆహారాన్ని అందిస్తూ వచ్చారు. న్యూ ఆశ్రయ ఫౌండేషన్‌ అనే అనాథాశ్రమానికి తమ వంతుగా సహకరిస్తున్నారు. ఎంబీఏ పూర్తి చేసిన కావ్య కస్టమర్‌ రిలేషన్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. శ్రీకాంత్‌ ఉన్నతోద్యోగం చేస్తున్నారు. కృష్ణ చదువుకుంటూనే వీరికి సహకారం అందిస్తున్నారు. సంస్థ నిర్వహణకు అవసరమైన ఖర్చులను సొంతంగానే భరిస్తున్నారు. అలాగే ఆసక్తి ఉన్నవాళ్లు ఎవరైనా ఆర్థిక సాయం అందిస్తే  కాదనకుండా తీసుకుంటున్నారు. మొదట్లో పులిహోర, పెరుగన్నం ప్యాకెట్లను ఇచ్చేవారు. లాక్‌డౌన్‌ సమయంలో  ఎక్కువ మందికి తమ సేవలు అందేలా బ్రెడ్‌, బిస్కెట్లు, పండ్లు ఇస్తున్నారు. తరచూ గుడ్డు అందిస్తున్నారు.


మరిన్ని