close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
పెసర.. భళా అనరా!

క్షణాల్లో ఉడికిపోతుంది... రుచిలో అదిరిపోతుంది! పోషకాలతో పోటీపడుతుంది. వ్యాధినిరోధక శక్తి పుష్కలంగా ఉండే పెసరపప్పు ప్రయోజనాల గురించి తెలుసుకుందాం...

* ఒంట్లోని వేడిని, కఫాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. మలబద్ధకం సమస్య ఉండదు. దీంట్లో విటమిన్‌-బి1, బి2 అధికంగా ఉండటం వల్ల మనలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. పెసరపప్పును ఉడకబెట్టి, నానబెట్టి రెండు రకాలుగానూ వాడొచ్ఛు.

* పెసరపప్పుతో పచ్చడి, పెసరకట్టు మాత్రమే కాకుండా సలాడ్‌ కూడా తయారుచేయొచ్ఛు తక్కువ సమయంలో జీర్ణమవుతుంది. ఈ వేసవి కాలంలో చలువ చేస్తుంది. ముఖ్యంగా కళ్లకు చాలా మంచిది. మిగతా పప్పుల్లా కడుపు ఉబ్బరం లాంటి సమస్యలు ఉండవు. కొంతమందిలో మాత్రమే గ్యాస్‌ సమస్య ఎదురవుతుంది.

పిండిపదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వు, క్యాల్షియం, ఫాస్ఫరస్‌, ఇనుము, విటమిన్‌-ఎ1, బి1, బి2, పొటాషియం, సోడియంలాంటి పోషకాలెన్నో దీంట్లో ఉన్నాయి. మొలకెత్తిన పెసల్లో విటమిన్‌-సి పుష్కలంగా ఉంటుంది.


కలరా, చికెన్‌ పాక్స్‌, వైరల్‌ ఫీవర్‌లు వచ్చినప్పుడు కూడా దీన్ని ఇవ్వవచ్ఛు ఇది నీరసాన్ని తగ్గించి శక్తిని అందిస్తుంది. చిన్న పిల్లలకూ మంచిది. ఉత్తర భారతదేశంలో ఎక్కువగా తినే కచోరి తయారీలోనూ పెసర పప్పును వాడతారు.


పెసరకట్టు: చాలా ప్రాంతాల్లో వేసవికాలంలో పెసరకట్టుని ఇష్టంగా చేసుకుని తింటారు. పెసరపప్పును ఉడకబెట్టి వార్చి ఆ నీళ్లకు తాలింపు వేసి దీన్ని తయారుచేస్తారు. కామెర్లు వచ్చిన వాళ్లకు, కాలేయ సమస్యలు ఉన్నవాళ్లకు ఇది ఎంతో మంచిది.

* ఇది గర్భిణులకు, పాలిచ్చే తల్లులకు, చిన్న పిల్లలకు మంచిది. త్వరగా జీర్ణమవుతుంది.

పెసరపప్పు సలాడ్‌: నానబెట్టి నీళ్లు తీసిన పెసరపప్పులో తురిమిన కొబ్బరి, క్యారెట్‌, పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర వేయాలి. చివర్లో కొద్దిగా నిమ్మరసం పిండాలి. వేసవికాలంలో ఇలా చేసుకుని తినడం వల్ల చలువ చేస్తుంది. త్వరగా జీర్ణమవుతుంది. అధిక దాహాన్ని తగ్గిస్తుంది.

- డా. పెద్ది రమాదేవి, ఆయుర్వేద నిపుణులు


మరిన్ని