close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
శ్రీమంతురాలు!

మొదటి జీతంతో ఏం చేస్తావ్‌ అని అడిగితే ఓ... ఇంత పెద్ద జాబితాను తీస్తారు ఎవరైనా? ఆశ్లేష మాత్రం మొదటి జీతాన్నే కాదు ఇప్పటివరకు అందుకున్న మూడు జీతాలను సామాజిక సేవకే వాడింది. అలాని ఆ అమ్మాయిదేం శ్రీమంతుల కుటుంబం కాదు. మనసున్న కుటుంబం..

హైదరాబాద్‌లోని ఈఎస్‌ఐ ఆసుపత్రిలో స్టాఫ్‌నర్స్‌గా ఉద్యోగం చేస్తోంది ఆశ్లేష. ఉద్యోగంలో చేరి... మూడు నెలలైంది అంతే! ఇంతవరకు ఒక్కజీతాన్ని కూడా తన అవసరాల కోసం వాడుకోలేదామె. మరి ఏం చేసింది? వరంగల్‌లోని కాకతీయ మెడికల్‌ కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌లో బీఎస్సీ నర్సింగ్‌ పూర్తి చేసిందామె. ఆ కాలేజీలో ఆమెది రెండో బ్యాచ్‌. కొత్తగా ప్రారంభించిన కాలేజీ కావడంతో పూర్తిస్థాయి సౌకర్యాలు లేవక్కడ. అందుకే తన మొదటి జీతాన్ని ఆ కళాశాల అభివృద్ధికే ఖర్చు చేయమంటూ విరాళంగా ఇచ్చేసింది. ములుగు జిల్లాలోని మారుమూల గ్రామం వెంకటాపురం ఈ అమ్మాయి సొంతూరు. కనీస వైద్య సౌకర్యాలు లేని పరిస్థితి అక్కడ. వాస్తవానికి ఈ పరిస్థితులే ఆశ్లేషలో వైద్యరంగంలోకి అడుగుపెట్టాలనే కోరికను కలగజేశాయి.  మెడిసిన్‌లో సీటు రాకపోవడంతో నర్సింగ్‌ చదివింది. రెండో నెల జీతాన్ని తన ఊరికి ఇవ్వాలనుకుంది. మంచి పనుల కోసం వెచ్చించాలంటూ ఇచ్చేసింది. ఇదంతా చూసి ఆమెది బాగా డబ్బున్న కుటుంబం కాబోలు అనుకుంటే పొరపడ్డట్టే. సాధారణ మధ్యతరగతి కుటుంబం వీళ్లది. తండ్రి సత్యనారాయణ పెయింటర్‌. తల్లి జ్యోతి ఉపాధ్యాయురాలు. తండ్రి వృత్తిలోని కష్టనష్టాలు చూస్తూ పెరిగిన ఆశ్లేష ఇప్పుడు కరోనా కారణంగా  సామాన్యులు పడుతున్న ఇబ్బందులను చూసి వారికి సాయం చేయాలనుకుంది. అందుకే తన మూడో జీతాన్ని కూడా లాక్‌డౌన్‌ వల్ల ఇబ్బందులు పడుతున్న వారికి ఇవ్వాలనుకుంది. తెలంగాణ ప్రభుత్వ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ చేతుల మీదుగా అవసరార్థులకు నిత్యావసరాల పంపిణీ చేసింది. ఉన్నదాంట్లో సంతృప్తి చెందడం, తోటివారికి సాయం చేయడంలో తనకు గొప్ప సంతృప్తి ఉందని అంటోన్న ఆశ్లేష ఎందరికో ఆదర్శం!


మరిన్ని