close

సంపాదకీయం

సైబర్‌ దాడులకు విరుగుడు

వరికైనా వలేసి మాటలతో బోల్తాకొట్టించి పబ్బం గడుపుకొనే ఏ అవకాశాన్నీ సైబర్‌ నేరగాళ్లు విడిచిపెట్టరన్నది పచ్చినిజం. దేశదేశాల్లో కరోనా మహమ్మారి రెచ్చిపోతున్న వేళ, వైరస్‌ గురించి కీలక సమాచారం చేరవేస్తామంటూ నమ్మించి జేబులు కొల్లగొడుతున్న మాయగాళ్ల చేతివాటమే అందుకు తాజా దృష్టాంతం. విశ్వవ్యాప్తంగా కొవిడ్‌ సంక్షోభాన్ని మహదవకాశంగా భావించి సైబర్‌ ముష్కరులు చెలరేగిపోతున్నట్లు గణాంకాలు ధ్రువీకరిస్తున్నాయి. ఈ నెల తొలి రెండు వారాల్లోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐరాసల ప్రతినిధులుగా నమ్మబలుకుతూ హ్యాకర్లు నాలుగు లక్షల వరకు కరోనా సంబంధిత సైబర్‌ దాడులకు తెగబడటం దిగ్భ్రాంతపరుస్తోంది. కేవలం రెండు నెలల వ్యవధిలోనే కరోనా వైరస్‌ పేరిట అంతర్జాతీయంగా నాలుగు వేలదాకా పోర్టల్స్‌ పుట్టుకొచ్చాయి. ‘సెర్బెరస్‌’ అనేది సైబర్‌ నేరగాళ్ల చేతిలో సరికొత్త ఆయుధం. ఎప్పటికప్పుడు కరోనా వివరాలు తెలియపరుస్తామంటూ సంక్షిప్త సందేశం రూపేణా లింకులు పంపుతున్నారు. పొరపాటున ఎవరైనా అవేమిటని ఆసక్తి కనబరచి వాటిపై నొక్కితే, వారి చరవాణిలోని కీలక సమాచారాన్ని సైబర్‌ నేరగాళ్లు అమాంతం చేజిక్కించుకుంటున్నారు. ఈ బాగోతంపై ఇంటర్‌పోల్‌ హెచ్చరిక మేరకు వివిధ రాష్ట్రాల పోలీస్‌ విభాగాలను, కేంద్ర నిఘా వ్యవస్థలను కేదస(సీబీఐ) అప్రమత్తం చేసింది. సాధారణ పరిస్థితుల్లోనూ ఇ-మెయిళ్ల మాయవలల రూపంలో ఫిషింగ్‌ స్కాములు వెలుగు చూస్తూనే ఉంటాయి. కొవిడ్‌ విజృంభణ దరిమిలా ఆ తరహా సైబర్‌ దాడుల సంఖ్య ఊహాతీతంగా పెరిగిపోయింది. ఆంగ్లం, ఫ్రెంచ్‌, జపనీస్‌ సహా పలు భాషల్లో సందేశాలు గుప్పిస్తూ వ్యక్తుల్ని వ్యవస్థల్ని భిన్నరంగాల్ని లక్ష్యంగా చేసుకుని భారీగా కొల్లగొడుతున్న సైబర్‌ చోరుల దూకుడును- పకడ్బందీ ఉమ్మడి పోరాటం, విస్తృత జనచేతనలే అరికట్టగలుగుతాయి!

కొవిడ్‌ వ్యాప్తి వేగం భీతిల్లజేస్తున్న దృష్ట్యా ప్రజానీకానికి తప్పనిసరి అవసరంగా మారిన మాస్కులను విక్రయించే ముసుగులోనూ నేరగాళ్లు దండుకుంటున్నారు. ఆన్‌లైన్‌ కొనుగోళ్లు, ఇతరత్రా బ్యాంకింగ్‌ లావాదేవీల్లో విశేష వృద్ధితోపాటు సైబర్‌ ఉగ్రవాదమూ పెచ్చరిల్లుతోంది. అంతర్జాలంలో ఉంచిన ప్రతి సమాచారం, రకరకాల లింకులు అన్నింటినీ గుడ్డిగా నమ్మడం ప్రమాదకరం. ఓ భాగ్యనగర వాసి అంతర్జాలంలో కనిపించిన కస్టమర్‌ కేర్‌ నంబరుకు ఫోన్‌ చేస్తే- అవతలి ఆసామీ వినియోగదారుడి చరవాణిలో యాప్‌నొకదాన్ని చేర్పించాక క్షణాల్లో బ్యాంకు ఖాతాను ఊడ్చేసిన ఘటన, ఎందరికో గుణపాఠం! కర్ఫ్యూలు, లాక్‌డౌన్ల కారణంగా అనేక సంస్థల ఉద్యోగులు ఇళ్లనుంచే అధికారిక విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. కార్యాలయాల్లో కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లకు ఉండే స్థాయిలో ఇళ్లవద్ద సమాచార భద్రత లేకపోవడం- సైబర్‌ ముఠాలకు అయాచితవరమవుతోంది. కొన్నాళ్లుగా ఇళ్లలోని కంప్యూటర్లపై సైబర్‌ దాడులు ఇంతలంతలయ్యాయని సెర్టిన్‌ (భారత జాతీయ కంప్యూటర్‌ అత్యవసర స్పందన బృందం) నిగ్గుతేల్చింది. సైబర్‌ ముప్పుపై సరికొత్త అధ్యయన నివేదిక- గరిష్ఠ దాడులు కేరళలో నమోదయ్యాయంటోంది. నాలుగేళ్ల క్రితం ‘క్రిమ్సన్‌ ర్యాట్‌’ అనే హానికారక మాల్‌వేర్‌తో భారత దౌత్యవేత్తలకు సంబంధించిన సమాచారాన్ని కొల్లగొట్టడానికి విశ్వయత్నం చేసిన పాకిస్థానీ హ్యాకర్లు- కొవిడ్‌ నేపథ్యంలో మళ్ళీ నకిలీ ఇ-మెయిళ్ల కుహకాలకు తెరతీశారు. ఇంతటి సంక్లిష్ట పరిస్థితిలో రాష్ట్రాల్ని అప్రమత్తం చేయడానికే కేదస, కేంద్రం పరిమితమైతే ప్రయోజనమేమిటి? కొవిడ్‌ సమాచారం కోసం ‘ఆరోగ్య సేతు’ యాప్‌నే వాడాలనడం వరకు సరే- ప్రభుత్వపరంగా సైబర్‌ ఆత్మరక్షణ యంత్రాంగం పటిష్ఠీకరణ మాటేమిటి? సాఫ్ట్‌వేర్‌ దిగ్గజంగా ప్రతీతమైన ఇండియా, సుశిక్షిత సైబర్‌ సైన్యాన్ని చురుగ్గా కదం తొక్కిస్తేనే- జాతి స్థిమితంగా ఉండగలుగుతుంది!


జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు