close

వసుంధర

పరిశ్రమిస్తే... ఉషస్సులు ఖాయం!

వ్యాపారం సాగింది లేదు..పరిశ్రమ నడిచిందీ లేదు... సకలం బంద్‌...ఇప్పుడు లాక్‌డౌన్‌ ఎత్తివేయడంతో మళ్లీ కొత్త సందడి మొదలవబోతోంది. కార్యకలాపాల రీస్టార్ట్‌ అంటే ఒకరకంగా మళ్లీ మొదటి నుంచీ ప్రారంభించడమే! అందరితోపాటు మహిళా పారిశ్రామికవేత్తలకూ ఇది ఇబ్బందికరమైన పరిస్థితి. దీన్నుంచి గట్టెక్కేదెలా? వ్యాపారం సజావుగా సాగే మార్గాలేంటో చెబుతున్నారు ఉషారాణి మన్నె... ప్రతిష్ఠాత్మక ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ (ఫ్లో) హైదరాబాద్‌ చాప్టర్‌కి ఆమె ఈమధ్యే నూతన ఛైర్‌పర్సన్‌గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆమెను వసుంధర పలకరించింది...


ఇద్దరితో మొదలుపెట్టి..

పుట్టిపెరిగింది తెనాలిలో. ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన తర్వాత కొన్నాళ్లు సెమీకండక్టర్‌ సంస్థలో ఉద్యోగం చేశాను. తర్వాత ‘పోల్‌మన్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌’ పేరుతో సొంత కంపెనీ ప్రారంభించాం. మేం తయారు చేసే ఎలక్ట్రానిక్‌ మెజరింగ్‌, కంట్రోల్‌ పరికరాలు దేశంలోని అన్ని ప్రముఖ ఫార్మా కంపెనీలకు సరఫరా చేస్తున్నాం. ఇద్దరు ఉద్యోగులతో మొదలైన మా కంపెనీ ఇప్పుడు 350 మందికి ఉపాధి కల్పిస్తోంది. ఇంజినీర్ల కొరత, ఆర్థిక ఇబ్బందుల్లాంటి ఎన్నో ఆటుపోట్లు దాటుకుంటూ సంస్థను కోట్ల టర్నోవరు వైపు నడిపించాను. పదకొండేళ్ల కిందట ఫ్లోలో సభ్యురాలిగా చేరి రకరకాల కమిటీల్లో పని చేశాను. ఫ్లో ఏర్పాటు చేసిన ‘స్టైల్‌ తత్వ’ అనే అతిపెద్ద ఫ్యాషన్‌, లైఫ్‌స్టైల్‌ ఎగ్జిబిషన్‌కి కన్వీనర్‌గా పనిచేశా. హైదరాబాద్‌ చాప్టర్‌లో దేశంలోనే ఎక్కువమంది పారిశ్రామికవేత్తలు సభ్యులుగా ఉన్నారు. అత్యంత క్రియాశీలకంగా ఉండే ఈ చాప్టర్‌కి ఛైర్‌పర్సన్‌గా ఎంపికవడం సంతోషంగా ఉంది.


మహిళలకు సహజంగానే ఓర్పు, సహనం, పట్టుదల ఎక్కువ. ఇవన్నీ వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో అతివను అందలం ఎక్కిస్తాయి. కానీ ఇంత సత్తా ఉన్నా కొన్ని రంగాలకే పరిమితమవుతున్నారు. ఇంజినీరింగ్‌, తయారీ రంగాల్లో ప్రాతినిధ్యం తక్కువ. ఉన్న ఆ కొద్దిమందీ లాక్‌డౌన్‌తో ఇబ్బందుల్లో పడిపోయారు. ఈ సమస్యకు కుంగిపోకుండా తామేంటో నిరూపించుకోవడానికి దీన్నో మంచి అవకాశంగా మలచుకోవచ్చు.
మంచి తరుణం
లాక్‌డౌన్‌ ఎత్తివేయడంతో మళ్లీ ఎక్కడి నుంచి మొదలుపెట్టాలి? ఏం చేయాలో తెలియని గందరగోళంలో ఉన్నారు చాలామంది మహిళా పారిశ్రామికవేత్తలు. ముందు వాళ్లను ఆ పరిస్థితి నుంచి తప్పించి.. పరిశ్రమలు, వ్యాపారాలు సజావుగా ప్రారంభించేలా చేయడమే మా మొదటి లక్ష్యం. దీంతోపాటు మేం చేయబోతున్న ఇతర కార్యక్రమాలు...
*ఆగిపోయిన వ్యాపారం, పరిశ్రమల్ని తిరిగి ఎలా ప్రారంభించాలి? మార్కెటింగ్‌ ద్వారా ఎలా ముందుకెళ్లాలి? అనేదానిపై ప్రభుత్వం మహిళా వ్యాపారవేత్తలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించబోతోంది. ఫ్లో లోని సభ్యులను దీనికి సమాయత్తం చేయబోతున్నాం.


* కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో భవిష్యత్తులో టెక్నాలజీ వాడకం, వ్యాపార కార్యకలాపాల్లో ఆన్‌లైన్‌ లావాదేవీలు ఎక్కువ కాబోతున్నాయి. దీనికి అనుగుణంగా మహిళా వ్యాపారవేత్తలు టెక్నాలజీ అందిపుచ్చుకునేలా శిక్షణ కార్యక్రమం ప్రారంభించబోతున్నాం.


* ఫ్లో గతేడాది ప్రభుత్వ అనుబంధ వీ(ఉమన్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌)-హబ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా స్టార్టప్‌ కంపెనీలకు అవసరమయ్యే నైపుణ్యాలు పెంపొందించేలా తరచూ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు, శిక్షణనిస్తారు. మార్కెటింగ్‌ మెలకువలు నేర్పిస్తారు. దానికి మా సహకారం ఉంటుంది. సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి పరిశ్రమలకు వీ-హబ్‌ హామీలేని రుణాలిస్తోంది. సరైన ప్రాజెక్టుతో, స్టార్టప్‌ ఆలోచనతో వచ్చినవారికి ఈ పథకం కింద రుణాలు ఇప్పించడానికి సాయం చేస్తాం.
* వివిధ రంగాలకు చెందిన నిపుణులు, పరిశ్రమాధిపతులు వాళ్ల అనుభవాలు, విజయాలు వివరించేలా స్పీకర్‌ సెషన్స్‌ చేపట్టబోతున్నాం. ‘పవర్‌ హవర్స్‌’ పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమం మహిళా వ్యాపారవేత్తలకు స్ఫూర్తిదాయకంగా ఉండబోతోంది. ప్రస్తుత కరోనా నేపథ్యం, భౌతిక దూరం పాటిస్తున్న తరుణంలో వెబినార్‌ ద్వారా సిస్టర్‌ శివానీతో పవర్‌ హవర్స్‌ నిర్వహిస్తున్నాం. చిన్నచిన్న వ్యాపారాలు చేసే మహిళలకు సైతం అందేలా ‘డిజిటల్‌ అక్షరాస్యత’, ‘ఆర్థిక అక్షరాస్యత’ పేరుతో శిక్షణ కార్యక్రమాలు రూపొందించాం.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు