close

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
టాప్‌ 10 న్యూస్‌ @9 PM

1. ​​​​​ఉద్యోగ సృష్టికర్తలే NEP లక్ష్యం: మోదీ

ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మన విద్యా విధానంలో మార్పులు తీసుకొచ్చే లక్ష్యంగా నూతన జాతీయ విద్యావిధానాన్ని (ఎన్‌ఈపీ) తీసుకొచ్చినట్లు ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఉద్యోగాలను అన్వేషించేవారు కాకుండా.. ఉద్యోగాలను సృష్టించే వారిగా యువతను తీర్చిదిద్దడమే దీని లక్ష్యమని వివరించారు. ‘స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్‌-2020’ ఫినాలే కార్యక్రమంలో శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విద్యార్థులనుద్దేశించి ఆయన ప్రసంగించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. మరింత తగ్గిన భారత్‌ కొవిడ్‌ మరణాల రేటు

భారత‌ కొవిడ్‌-19 మరణాల రేటు మరింత మెరుగైంది. లాక్‌డౌన్‌ మొదలైన తర్వాత తొలిసారి 2.15 శాతానికి తగ్గిందని ప్రభుత్వం తెలిపింది. జూన్‌లో ఇది 3.33 శాతంగా ఉండేదని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. బాధితులను గుర్తించడం, పరీక్షించడం, చికిత్స చేయడంతోనే ఇది సాధ్యమైందని పేర్కొంది. కేంద్రంతో పాటు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మరణాల రేటు తగ్గించేందుకు ఎంతగానో కృషి చేస్తున్నాయని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. కురిచేడు ఘటనపై సిట్‌ ఏర్పాటు

మత్తు కోసం మద్యానికి బదులు శానిటైజర్‌ తాగి 12 మంది మృతిచెందిన ఘటనపై ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేసింది.  ప్రకాశం జిల్లా కురిచేడులో చోటుచేసుకున్న ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తుకు ఆరుగురు పోలీసుల అధికారులతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. ఈ బృందానికి అధికారిగా మార్కాపురం ఓఎస్డీ చౌడేశ్వరి వ్యవహరించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. రెండు టీఎంసీల కోసం ₹లక్ష కోట్లా?: ఉత్తమ్‌

రెండు టీఎంసీల కోసం కాళేశ్వరానికి రూ.లక్ష కోట్లు ఖర్చు చేశారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌లో ఆయన విలేకర్లతో జూమ్‌ యాప్‌ ద్వారా మాట్లాడుతూ.. పోతిరెడ్డిపాడు ప్రస్తుత సామర్థ్యం 44 వేల క్యూసెక్కులన్నారు. 44వేల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సిద్ధమైందని చెప్పారు. పోతిరెడ్డిపాటు అంశంలో సీఎం కేసీఆర్‌ సరైన రీతిలో స్పందించట్లేదని విమర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. మళ్లీ తగ్గిన జీఎస్టీ వసూళ్లు

వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు మరోసారి తగ్గాయి. జులై నెలకు సంబంధించి రూ.87,422 కోట్లు వసూలైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఇదే ఏడాది జూన్‌ నెలలో రూ.90,917 కోట్లు వసూలు అవ్వగా.. ఈ సారి అంతకంటే తక్కువ వసూలు కావడం గమనార్హం. అయితే, కొవిడ్‌ కారణంగా ఇచ్చిన వెసులుబాటు నేపథ్యంలో ఎక్కువ మంది జూన్‌లో తమ పాత బకాయిలు చెల్లించడంతో ఆ నెల వసూళ్లు పెరిగినట్లు ఆర్థిక శాఖ పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు: జగన్

కరోనా బారిన పడి చికిత్స పొందుతూ మాజీ మంత్రి, భాజపా నేత పైడికొండల మాణిక్యాల రావు తుది శ్వాస విడిచారు. ఆయన మృతిపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాణిక్యాల రావు కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహణకు అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. వివేకా హత్య కేసు: సీబీఐ తాత్కాలిక విరామం

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) రెండు వారాల పాటు ప్రాథమిక విచారణ చేపట్టింది. కడప, పులివెందులలో సీబీఐ అధికారులు విచారించారు. వివేకా కుమార్తె సునీత, వైకాపా నేత శివశంకర్‌ రెడ్డి, పీఏ కృష్ణా రెడ్డి తదితరులను విచారించారు. ఇంకా పలువురు అనుమానితులను విచారించనున్నారు. తాత్కాలిక విరామం తీసుకుని సీబీఐ బృందం కడప నుంచి దిల్లీ వెళ్లింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. అమర్ ‌సింగ్‌  కన్నుమూత

దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన రాజ్యసభ సభ్యుడు, సమాజ్‌వాదీ పార్టీ మాజీ నేత అమర్‌సింగ్‌ ఇక లేరు. సింగపూర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. మూత్రపిండాల మార్పిడి చేయించుకున్న అమర్‌సింగ్‌..  గత ఆరు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో సింగపూర్‌లోని ఓ ఆస్పత్రిలో శనివారం మధ్యాహ్నం ఐసీయూలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. ఏపీలో కొత్తగా 9,276 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌ కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కేసుల సంఖ్య 1.50లక్షలు దాటాయి. గడిచిన 24 గంటల్లో 60,797 నమూనాలను పరీక్షించగా కొత్తగా 9,276 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో కరోనా కేసులు 1,50,209కి చేరింది. కరోనాతో ఇవాళ మరో 58 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు కరోనా బారిన పడి 1,407 మంది మృతి చెందారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. అసోంలో వరదలు: 109మంది మృతి

అసోంలో వరదల ఉద్ధృతి కొనసాగుతోంది. ఇప్పటివరకు ఈ వరదల ధాటికి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 109కి చేరింది. రాష్ట్రంలోని 22 జిల్లాల పరిధిలో దాదాపు 12లక్షల మంది ప్రజలు వరద ప్రభావానికి గురైనట్టు ఎస్‌డీఆర్‌ఎఫ్‌ అధికారులు వెల్లడించారు.  1364 గ్రామాలు వరద ముంపునకు గురికాగా.. 82,947 హెక్టార్లలోని పంట నీట మునిగింది. బాధితుల కోసం 137 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయగా..  వీటిలో 26,161 నిర్వాసితులు ఆశ్రయం పొందుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు