close

గ్రేటర్‌ హైదరాబాద్‌

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అన్ని నగరాలు, పురపాలికల్లో ఆస్తుల నమోదు

 ఆన్‌లైన్‌లో స్వయంగా చేసుకోవచ్చు
 మీసేవలోనూ ఉచిత నమోదుకు అవకాశం
 మార్గదర్శకాలు విడుదల చేసిన సీఎస్‌

ఈనాడు, హైదరాబాద్‌: ధరణి ప్రాజెక్టు కోసం వ్యవసాయేతర ఆస్తుల నమోదుకు ఆన్‌లైన్‌ సౌకర్యాన్ని హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ(జీహెచ్‌ఎంసీ) సహా అన్ని నగరపాలికలు, పురపాలక సంస్థల్లో  ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) సోమేశ్‌కుమార్‌ తెలిపారు. తక్షణమే ఇవి అమల్లోకి వస్తాయన్నారు.  ఆస్తుల యజమానులు www.npb.telangana.gov.in ను ఉపయోగించి స్వయంగా,  మీసేవ కేంద్రాల ద్వారా నమోదు చేసుకోవాలని  ఆయన సూచించారు. మీ సేవ కేంద్రాల్లో నమోదు ఉచితమని, ఎలాంటి రుసుములు చెల్లించనవసరం లేదని స్పష్టం చేశారు. వాటిని సంబంధిత నగర/పురపాలికలే భరిస్తాయన్నారు. సంబంధిత మార్గదర్శకాలపై శనివారం రాత్రి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటి వరకు  24,400 మంది అధికారులు ఇంటింటికీ తిరిగి యజమానులు ఇచ్చిన వివరాలను మొబైల్‌ యాప్‌ ద్వారా నమోదు చేశారని,  శనివారం వరకు ఇలా 75.74 లక్షలకు పైగా ఆస్తులు నమోదయ్యాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ, ఇతర నగరపాలక, పురపాలక సంఘాల కోసం రెండు పద్ధతుల్లో నమోదుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.
ఇవి జతచేయాలి
ఆన్‌లైన్‌లో వ్యవసాయేతర ఆస్తుల నమోదుకు వాటి యజమానులు ఈ కింది సమాచారాన్ని జతచేయాలని సీఎస్‌ సూచించారు. ఆస్తిపన్ను గుర్తింపు సంఖ్య(పీటీఐఎన్‌) లేదా పన్ను రసీదు, ఆధార్‌ సంఖ్య (మోసపూరిత లావాదేవీల నివారణకు), మొబైల్‌ ఫోన్‌ నంబర్‌ (ఆస్తుల సమాచారం ఇవ్వడానికి), ఆధార్‌ సంఖ్యలతో పాటు యజమాని ధ్రువీకరించే కుటుంబ సభ్యుల వివరాలు (ఆస్తి హక్కుల కల్పనకు), జేపీజీ రూపేణా యజమాని ఫొటో (పాస్‌బుక్‌లో ముద్రించేందుకు), ఫ్లాట్‌ విస్తీర్ణం, నిర్మించిన ప్రాంతంతో పాటు అవిభక్త వాటా, చిరునామా.
* పై వివరాలు ఇప్పటికే నమోదు చేసిన వారు మళ్లీ చేయాల్సిన అవసరం లేదు
త్వరలో ప్రవాసుల కోసం
త్వరలోనే ప్రవాస భారతీయులు, విదేశాల్లోని భారతీయ పౌరులు, విదేశీపౌరుల ఆస్తుల నమోదుకు అవసరమైన విధానంపై విడిగా మార్గదర్శకాలు జారీచేస్తామని ప్రకటనలో పేర్కొన్నారు.

25న సీఎం చేతుల మీదుగా ‘ధరణి’ ప్రారంభం

పూర్తి జవాబుదారీతనం, పారదర్శకతతో భూ లావాదేవీల కోసం రూపొందించిన ధరణి వెబ్‌ పోర్టల్‌ దేశంలో విప్లవాత్మకమైందని, అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ తెలిపారు. ఈ నెల 25న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించనున్న ధరణికి పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని సూచించారు. ప్రారంభ సన్నాహాలపై శనివారం బీఆర్‌కే భవన్‌ నుంచి ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లతో దృశ్య మాధ్యమ సమీక్ష నిర్వహించారు. అదనపు కలెక్టర్లు, తహసీల్దార్లు, నాయబ్‌తహసీల్దార్లు హాజరయ్యారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు